కేటీఆర్ నీతి వాక్యాలు అప్పుడేమయ్యాయి?
తెలంగాణ హుందాతనాన్ని నాశనం చేశారు
కేటీఆర్ మాటలు చిత్రంగా ఉన్నాయంటూ ఎద్దేవా
తెలుగుదేశం జెండా పండుగ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు ధ్వజం
ఫరూక్ నగర్: స్వార్థ రాజకీయాల లబ్ధికోసం తెలంగాణ ప్రాంతాన్ని నాశనం చేసి నేడు నీతి వాక్యాలు వల్లిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ ను చూస్తే చిత్రంగా ఉందని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు విమర్శించారు. మంగళవారం ఫరూక్ నగర్ మండలం కొండన్నగూడ గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఇరు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందిన బిఆర్ఎస్ పార్టీ మాట్లాడే సంస్కృతిని కూడా నాశనం చేశారంటూ విమర్శించారు. నేటి రాజకీయాలను భ్రష్టు పట్టించి డబ్బులు ఉంటే తప్ప రాజకీయాలు ఉండవని సంస్కృతిని తీసుకువచ్చారని విరుచుకుపడ్డారు. పార్టీలు మార్చడం ఒక రివాజుగా చేశారని టిఆర్ఎస్ తీరుపై మండిపడ్డారు.
ప్రతిపక్ష హోదాలో ప్రజా సమస్యలపై పోరాడే పరిస్థితిని క్షీణించేలా చేశారని అన్నారు. ప్రస్తుతం పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేలను ఉద్దేశించి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు చిత్రంగా ఉన్నాయని బక్కని ఎద్దేవా చేశారు. పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ నిలబడి గెలవాలని అంటున్నారని, మరి గతంలో 15 మంది ఎమ్మెల్యేల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు ఆ నీతి ఏమైందని ప్రశ్నించారు.
మహిళలు స్వయం ఉపాధి, మహిళాసంస్థల ఏర్పాటు, దీపం పథకం, యువతకు ముఖ్యమంత్రి ఉపాధి పథకం, గృహ నిర్మాణం పధకం, మేకలు, గొర్రెలు, పాడి పశువుల ద్వారా ప్రజలు లబ్ధి పొందే విధంగా తెలుగు దేశం పార్టీ కృషి చేసిందని ఆయన అన్నారు.
సామాజికవేత్త అన్నా హజారే లాంటి గొప్ప నేతలతో వాటర్ షెడ్ పథకం భూగర్భ జలాలకు తోడ్పాటు అందించే అనేక కార్యక్రమాలు తెలుగుదేశం చేపట్టిందని గుర్తు చేశారు. గ్రామ పంచాయతీ, పాఠశాల భవనాల నిర్మానాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత నాటి తెలుగుదేశం ప్రభుత్వానిదని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చల్ల వెంకటేశ్వర రెడ్డి పట్టణ అధ్యక్షుడు గంధం ఆనంద్ అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.