Mahanaadu-Logo-PNG-Large

సందింట్లో వైఎస్సార్ జయంతి పోరు

నాయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే కొడుకు జగనుకు ఎంత ఇష్టం అంటే.. రోశయ్య మాటల్లో చెప్పాలి అంటే టార్చర్ పెట్టేవాడు. బాబాయి ఎంపీ సీటు ఇచ్చేయమని నాయన్ను & బాబాయిని కలిపి సతాయించి, చివరికి సోనియా గాంధీ వద్ద అడిగించి మొదటి సారి లేదనిపించుకొనేలా చేశాడు. ఇక నాయన ఆచూకీ తెలవలేదని అందరూ వెతుకుతుంటే, జగన్ ఆచూకీ కోసం మీడియా వెతికింది.

నాన్న శవం కోసం నల్ల కాలువ వద్దకు వెళ్లలేదు, కర్నూలు ఆసుపత్రికి వెళ్లలేదు కానీ, పులివెందుల చేరంగానే.. శవం ప్రక్కన సంతకాలు చెయ్యించాడు ఆయన కుర్చీ కోసం. ఇవన్నీ చూసిన కాంగ్రెస్స్ అధిష్టానం అసహ్యించుకొంటూ.. రోశయ్య గారిని ఆ కుర్చీలో కూర్చోబెట్టింది. ఆ కుర్చీ కోసం నల్ల కాలువ దగ్గరకు వెళ్లాడు. శపథం చేశాడు. నాయన కోసం చనిపోయారు అంటూ…. ఓదార్పు యాత్ర మొదలెట్టాడు. జనం ఏవగించుకొన్నారు.

రోశయ్య హయాంలో వైఎస్సార్ ప్రాణం విడిచిన పావురాళ్ల గుట్ట వద్ద ఆయనకు స్మృతి వనం పనులు మొదలెట్టారు. కాంగ్రెస్స్ హయాంలోనే అది పూర్తయ్యింది. ఆ వనం పెళ్లి చేసుకోబోయే వధూవరుల ప్రీ-వెడ్డింగ్ షూటింగులకు ప్రసిద్ధిగాంచింది అనతికాలంలోనే. ఆ స్మృతి వనం దగ్గరికి సంధింటి కుటుంబ సభ్యులు వెళ్లి నివాళులు గట్రా అర్పించడం ఎప్పుడూ మీడియాలో చూడలేదు.

ఇడుపులపాయలో బెదిరించి రాజారెడ్డి కొట్టేసిన అసైన్‌డ్ భూములలో.. ఒక ప్యాలస్ కట్టుకోవాలని వైఎస్సార్ కోరిక కలిగింది. అది వికటించి ఆ భూముల బండారం బయటపడేసరికి, మా నాయిన తెలియకుండా కొనేసినాడని పచ్చి అబద్దాలను అసెంబ్లీ సాక్షిగా కూస్తూ.. పేదలకు పంచేస్తా అని, తూతూ మంత్రంగా ఒక టెంటు వేసి, పంచుతున్నట్లు ఫోటోలు తీసుకొని మళ్లీ లాగేసుకొన్నాడు వైఎస్సార్.

శేషాచల అటవీ చట్టం వర్తించే ఆ ప్రదేశంలో అది కుదరక రాజీవ్ గాంధీ ఐఐఐటి పెడుతున్నా అని, అక్కడో హరితా రిజార్టు, నెమళ్ల పార్కు, ఉద్యానవనం, పులివెందుల నుండి బైపాస్ రోడ్లు గట్రా ప్రభుత్వ సొమ్ములతో వేయించాడు బ్రతికుండగానే వైఎస్సార్. పావురాళ్ల గుట్టలో చిధ్రమై కాలిన శరీర ముక్కలను ఏరి మూటగట్టి తెచ్చి, అదే ఇడుపుల పాయలో సమాధి చేశారు.

ఆ సమాధి వద్ద సంధింటి నుండి మరో తరం రాజకీయం మొదలైంది. తల్లిని చెల్లిని పార్టీ నుండి గెంటేశాక, తెలంగాణా వైకాపా పెట్టడానికి కూడా, చెల్లి షర్మిళ ఆ సమాధి వద్ద ఆశీర్వాదాలు తీసుకొని వెళ్లడం, పార్టీ మూసేయడం జరిగింది.

అదే సమాధి వద్ద ఎడమొహం పెడమొహం లెక్కన జయంతులకు గట్రాలకు రావడం ఇష్టం లేక, మాట్లాడుకొని విడివిడిగా వచ్చే సర్దుబాటు చేసుకొన్నారు అన్నా చెల్లెల్లు. చెల్లి కాంగ్రెస్స్ లోకి వెళ్లింది. నాయన పేరు సీబీఐ చార్జ్‌షీట్లోకి ఎక్కేలా చేసింది కాంగ్రెస్స్ కాదు, వైఎస్సార్ బిడ్డ మా జగనన్న అంటూ గత ఎన్నికల్లో షర్మిళ కడప సాక్షిగా జనానికి చెప్పింది. అది చిలికి చిలికి గాలి వానలా మారి వైఎస్సార్ వారసులా మీరు అంటూ ఒకరికొకరు దుమ్మెత్తిపోసుకొనేలా దుమారం రేగింది. ఎన్నికల్లో మరిదిని బలిచ్చినట్లు తన ప్రాణాన్ని బలివ్వడానికి వెనుకాడని బిడ్డ అని బెదిరి, కూతురు కొడుకుల పోరు పడలేక అమ్మ విజయ అమెరికా వెళ్లిపోయింది.

చెల్లి షర్మిళ కడపలో రాహుల్ గాంధీ సభ పెట్టించి, ఓడినా.. కాంగ్రెస్స్‌లో పెద్దలను కలిసింది వైఎస్సార్ జయంతికి రమ్మంటూ. ముఖ్యంగా పొరుగున కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే సురేష్‌ను కలిసింది. వైఎస్సార్ జయంతి ఉత్సవాలకు బెజవాడ రండి అంటూ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క & దామోదర్ నరసింహాలను కూడా హైద్రాబాదులో కలిసి ఆహ్వానించింది.

ఎన్నికల్లో భంగపడి, ఇంకా కోలుకోలేని జగన్లో.. కొత్తగా వైఎస్సార్ వారసత్వ పోరు ఇంటిలో నుండి చెల్లి రూపంలో మొదలయ్యే సరికి, భయం పట్టుకొంది జగనుకు. ఇటీవలే మూడు రోజులు పులివెందుల్లో వుంటా అని వెళ్లి, అక్కడ కార్యకర్తలు & నాయకులు పెట్టిన పైసలు ఇస్తారా లేదా అని నిలదీసేసరికి సర్ది చెప్పలేక, రెండో రోజే బెంగుళూరుకు వుడాయించాడు దంపతులు ఇద్దరూ.

అక్కడి నుండి జగన్ దంపతులు రోజుల క్రితమే దిగారు తాడేపల్లిలో. నెల్లూరులో ఈవీయెంలను పగలగొట్టిన సమరయోధుడు పిన్నెల్లిని పలకరించడానికి ములాఖత్‌కు వెళ్లి మార్జాల హుంకరింపులు చేసి వచ్చాడు, జగను.

అంతలోనే వైఎస్సార్ జయంతి వేడుకల విషయంలో చెల్లి చేస్తున్న ఏర్పాట్లు గమనించి గతుక్కుమని, మళ్లీ పులివెందులలో మూడు రోజులు ఉంటానని ఏర్పాట్లు చేసుకొన్నాడు. ఆ సమాధి వద్ద కూతురు, కొడుకు ఆశీర్వాదాలు తీసుకొన్నా.. జనం ఆశీర్వదించలేదు.

కానీ కన్న కొడుకు జగన్, ఆ సమాధి వున్న ఇడుపులపాయలోనే 23 విగ్రహాలను ప్రభుత్వ సొమ్ములు వెచ్చించి ఏర్పాటు చేయించి, అందులో కూడా సొమ్ములు కొట్టించే వెసులుబాటు కల్పించాడు. స్మృతి వనం ఎవరికైనా ఒక చోట వుంటుంది. అధికారికంగా ప్రాణం పోయిన పావురాళ్ల గుట్టవద్ద వున్నా.. తనకు అధికారం వుందని కోట్లు తగలేసి, అందులోకూడా మింగేస్తూ.. నాన్నకు మరో స్మృతి వనం కట్టించిన గొప్ప కొడుకు జగన్.

నాన్న పేరు చెప్పి నలభై మూడు వేల కోట్లు మింగే అవినీతి అనంకొండ జగన్, జేబులో నుండి పైసా తీసి నాన్నకోసం ఖర్చు చెయ్యలేదు ఈ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బంగారు కొండ. నాన్న అంటే అంత గౌరవం మనసులో. ఆయన ప్రమాదం, శవం, సమాధి ప్రతిదీ రాజకీయం చేసుకోడానికి ఎప్పుడూ జగన్ ముందే వుంటాడు. ఇంట్లో ఆడబిడ్డలు రోడ్లల్లో తిరగవచ్చా అని అత్తయ్యతో చెల్లెల్లకు పాఠాలు కూడా చెప్పించగల సమర్థుడు వైఎస్సార్ కొడుకు జగన్.

దేశంలో అత్యధికంగా అన్నదాతలు వైఎస్ రాజసేఖర్ రెడ్డి హయాంలో చనిపోయారని తెలిసినా.. రైతు దినోత్సవంగా ప్రకటించి అన్నదాతల దగ్గర ఉమ్మేయించిన ఘనుడు జగన్. నకిలీ గిన్నిస్ బుక్ రికార్డుల రక్తదానాలతో బురిడీ కొట్టించి దొరికిపోయి అభాసుపాలయ్యేలా చేసిన గొప్ప పుత్రుడు జగన్.

– రాజేష్ నార్ల