భావోద్వేగాలకు లోనైన నాయకులు
వైఎస్సార్ 75వ జయంతి వేడుకలు
హైదరాబాద్ , మహానాడు : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా ప్రజాభవన్ లో ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తెలంగాణ ఇంచార్జ్ దీపా దాస్ మున్షి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కెవిపి రామచంద్రరావు, ఇతర సీనియర్, ముఖ్య నాయకులు సోమవారం తిలకించారు. ఫోటో ఎగ్జిబిషన్ సందర్భంగా ఫొటోలను తిలకిస్తున్న నాయకులంతా వైయస్ రాజశేఖర్ రెడ్డితో తమకున్న అనుబంధాన్ని, అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. ఎగ్జిబిషన్లో ఉన్న ప్రతి ఫోటో దగ్గర ఆ ఫోటోకు ఉన్న విశిష్టతని, ఆ ఫోటో వెనకాల ఆనాటి సంఘటనలని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలు చూస్తూ నాయకులు కంటతడి పెట్టుకుని భావోద్వేగాలకు లోనయ్యారు. ఆనాటి పాదయాత్ర సందర్భంగా ప్రజల భావోద్వేగాలను, ప్రజల కష్టసుఖాలను అప్పటి పరిస్థితులను నాయకులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ ప్రజా ప్రస్థానం పాదయాత్రలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫోటోలను చూస్తూ నాయకులందరూ.. ఆ ఫోటో వెనుక ఏం జరిగింది.. అప్పటి సంఘటనలు ఏంటి? అని భట్టి విక్రమార్కను అడగడంతో, ఆయన అప్పటి పరిస్థితులను, సంఘటనలను అన్నింటిని అందరితో చెప్పుకుంటూ ముందుకు సాగారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగిన విధానం ప్రజల నుంచి వచ్చిన ఆదరణ.. ఇలా అన్ని అంశాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అక్కడున్న నేతలకు వివరించారు.