నెల రోజుల పాలన అద్భుతం

-చంద్రబాబుకే అది సాధ్యం 
-నరసరావుపేట తెదేపా అధ్యక్షులు కొమ్మాలపాటి 

నరసరావుపేట, మహానాడు: నెల రోజుల్లోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, పలు సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు పరిపాలన అద్భుతమని నరసరావుపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

పరిపాలన మొదలు పెట్టిన వెంటనే అవ్వ తాతలకు ఇచ్చిన హామీ మేరకు 3000 రూపాయల పెన్షన్ ని 4000 వేల రూపాయలకు పెంచి అవ్వ తాతల గుండెల్లో పెద్ద కొడుకుగా నిలిచారన్నారు. వాలంటీర్స్ లేకుండా పెన్షన్ పంపిణీ సాధ్యం కాదన్న గత పాలకుల మాటలను, సచివాలయ ఉద్యోగుల ద్వారా మొదటి తారీకునే పెన్షన్ల పంపిణీ చేసి సుసాధ్యం అని నిరూపించారన్నారు.

ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి భవన నిర్మాణ రంగంపై ఆధారపడిన అనేక రంగాల కార్మికుల కుటుంబాల్లో సంతోషాన్ని నింపారన్నారు. ఒక దార్శనికుడు అధికారం చేపట్టడంతో గతంలో రాష్ట్రం వీడి వెళ్లిపోయిన అనేకమంది మరలా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి క్యూ పెడుతున్నారన్నారు. విభజన హామీలలో భాగంగా ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలపై సయోధ్య కుదుర్చుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశమై మరొక అడుగు ముందుకు వేశారన్నారు.

పోలవరంలో జరిగినటువంటి అవకతవకలపై ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి దానిలోని లోపాలను రాష్ట్ర ప్రజలకు వివరించారన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేటందుకు ప్రణాళికలు రచిస్తున్నారన్నారు. పట్టిసీమ నీటిని కృష్ణమ్మ చెంతకు తీసుకువచ్చి రైతాంగానికి నీటి కష్టాలను తీరుస్తున్నారు.

మెగా డీఎస్సీ ద్వారా 16347 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. అదేవిధంగా గత 5 సంవత్సరాల నుండి రాజధాని లేని రాష్ట్రంగా చెప్పుకుంటున్న రాష్ట్రానికి ,”అమరావతి” రాజధాని అంటూ రాజధాని పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.

రాష్ట్రంలో గాడి తప్పిన పాలనను సక్రమ మార్గంలో పెట్టేoదుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు.  ఈ విధంగా గడిచిన 30 రోజుల పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందుతూ పాలన సాగించడం చంద్రబాబుకే సాధ్యమని కొమ్మాలపాటి శ్రీధర్ అభివర్ణించారు.