ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కూటమి 120 రోజుల పాలన

– తెలుగుదేశం పార్టీ నేతలు

వినుకొండ, మహానాడు: రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో ఏ నమ్మకంతో అఖండ మెజార్టీ అందించారో ఆ నమ్మకాన్ని మరింత పెంచేలా కూటమి పనిచేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) లోక్‌సభాపక్ష నేత ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. వినుకొండ మండలం గోకనకొండ-నూజండ్ల మండలం పువ్వాడ మధ్య గుండ్లకమ్మ నదిపై హైలెవెల్ వంతెన నిర్మాణానికి గురువారం వారు శంకుస్థాపన చేశారు. పువ్వాడ ఎస్సీ కాలనీలో ఇంటింటికీ నల్లా కనెక్షన్ పథకాన్ని కూడా వారు ప్రారంభించారు. ములకలూరులో సీసీ రహదారులు, మినీ గోకులం నిర్మాణానికి భూమిపూజ చేసి శిలాఫలకాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ గుండ్లకమ్మపై వంతెన అవసరాన్ని ఎంపీ లావు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి దగ్గరుండి నిధులు మంజూరు చేయించారని తెలిపారు.

ఎంపీ లావు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం సమయంలో ఈ ప్రాంతంలో సాగునీటి సమస్య గురించి ముఖ్యంగా చెప్పామని, శాశ్వత పరిష్కారం గోదావరి జలాలు సాగర్ కుడి కాల్వలో కలపడమేనని అన్నారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ పల్నాడు జిల్లా, వినుకొండ నియోజకవర్గం అభివృద్ధికి ఇన్‌ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అండగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. సమర్థుడు ఇన్‌ఛార్జి మంత్రిగా రావడం వల్ల ప్రజలకు కచ్చితంగా అభివృద్ధి, సంక్షేమం అందుతుందన్నారు.

వినుకొండ నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మరోపక్క జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ బాధ్యత తీసుకుని అభివృద్ధిలో వెనుకబడిన ఈ ప్రాంతాల్లో ప్రగతి పథంలో ముందుకు నడపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యుడు మల్లికార్జునరావు, జనసేన ఉమ్మడి జిల్లాల కన్వీనర్ నిశంకర్ శ్రీనివాసరావు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, బీజేపీ నాయకులు యార్లగడ్డ లేనిన్ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.