10న అద్ధంకి మేదరమెట్ల వద్ద సిద్ధం సభ

త్వరలో మేనిఫెస్టో విడుదల
ఎంపీ విజయసాయిరెడ్డి

అద్దంకి,మేదరమెట్ల,ఫిబ్రవరి 28: బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద మార్చి 3 న నిర్వహించ తలపెట్టిన సిద్ధం మహాసభ స్వల్ప మార్పు చేసి మార్చి 10వ తేదీన నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి తెలిపారు. అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల, పిచ్చుకుల గిడిపాడు జాతీయ రహదారి పక్కన సిద్దం సభ ఏర్పాట్లను పార్టీ ముఖ్యనాయకులతో కలసి బుధవారం ఆయన పరిశీలించారు.

అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మేదరమెట్ల జాతీయ రహదారి వద్ద సుమారు 98 ఎకరాల్లో సభా ప్రాంగణం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. సభకు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాల నుంచి 15 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ఈ సభకు వచ్చేందుకు ఇప్పటికే 7 లక్షలకు పైగా సంసిద్ధత వ్యక్తం చేశారని అన్నారు.

సభ సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల వరకు కొనసాగుతుందని అన్నారు. మార్చి 13,14 తేదీల్లో ఎన్నికల ప్రకటన వచ్చే అవకాశం ఉందని, పార్టీకి ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ చూస్తే ఎన్నికల్లో 175 కి 175 సీట్లు సాధిస్తామన్న ధీమా మరింత బలపడుతుందని అన్నారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ మేనిఫెస్టోపై కసరత్తు జరుగుతోందని అతి త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు. అలాగే చివరి సిద్ధం సభకు ముందే అన్ని సీట్లు ప్రకటించనున్నట్లు తెలిపారు.