ఓ పనైంది …. ఇంకో పని ఉంది !

రాష్ట్రం లో ఎన్నికల యుద్ధానికి సంబంధించి రాజకీయ పక్షాలు సిద్ధం అయిపోయి ఉన్నాయి . లంగోటాలు బిగించి , వంటికి నూనె రాసేసుకుని కబాడీ కి బరి లో ఎదురెదురు గా నిలబడ్డాయి . రిఫరీ విజిల్ ఊదడమే ఆలస్యం , ఆట మొదలైపోతుంది . ఒక పనై పోయింది.

ఇంత వరకు బాగానే ఉంది.అయితే , ప్రతిపక్షాలు , అధికార పక్షమూ కలిసి చేయవలసిన పని ఇంకొకటి ఉంది .

అధికార పక్షమూ, ప్రతిపక్షమూ చేతులు కలిస్తేనే కదా, ప్రజాస్వామ్యం బతికి బట్ట కట్టేది. దేశం లో సంగతి పక్కన బెడితే, మన రాష్ట్రం లో ప్రజాస్వామ్యాన్ని బతికింప చేసే పని… బాధ్యత…. విద్యుక్త ధర్మం… అధికార, ప్రతిపక్ష పార్టీలదే కదా!
అధికార పక్షం గా వైసీపీ ఉన్నది. ప్రతిపక్షం గా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉన్నాయి.

ఇప్పుడు, రాష్ట్రం లో ఎన్నికల పేరుతో జరగనున్న యుద్ధం లో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి…. వారు, వీరూ కలిసి; గత ఐదేళ్ల లో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టిన వారి జాబితాలు తయారు చేయాలి.

చట్టాలను దుర్వినియోగం చేసినవారు, ఇసుకను, సహజవనరులను అక్రమంగా తవ్వేసి అమ్మేసుకున్నవారు, దొంగ సారాయి, అక్రమ మద్యం వ్యాపారం చేసిన కేసుల్లో ఉన్నవారు, ప్రభుత్వ భూ కబ్జాలకు పాల్పడిన వారు, ప్రైవేట్ భూములను ఆక్రమించుకున్నవారు, కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు దండుకుంటున్న వారు, ప్రభుత్వం నుంచి, ఇతరత్రా అధికారికం గా లభించే ఆదాయం మినహా, అక్రమ ఆదాయానికి అలవాటు పడిన ప్రతి ఒక్కరూ సామాజిక ద్రోహులే. వారిని ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత…. అటు పాలక పక్షం పైన, ఇటు ప్రతిపక్షం పైన ఉన్నది.

ఈ బాపతు జనానికి టిక్కెట్లు కేటాయిస్తే ; ఆయా పార్టీలకు కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ పట్ల పెద్దగా ఆసక్తి లేదని ప్రజలు భావించే ప్రమాదం లేక పోలేదు.

నా సంగతి మా మేనమామ కు తెలుసు కదా అన్నట్టుగా ; టికెట్ పొందిన వారి జాతకం మొత్తం…. ఆయా నియోజక వర్గాలలో ప్రజలకు తెలుస్తుంది. అటువంటి వ్యక్తులకు టిక్కెట్లు కేటాయించే పార్టీలపై కూడా ప్రజలకు సద్భావన కలగదు.

ఒకవేళ, ప్రజాస్వామ్యపు ఖర్మ కాలి, అటువంటి వారికి టిక్కెట్లు వస్తే ; ఆయా పార్టీలనే ప్రజలు తప్పు బడతారు.

అందుకే, ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (శాసన సభలో సభ్యత్వం ఉన్నది ఈ రెండు పార్టీలకే గదా ) కూర్చుని, రెండు పార్టీలలో- నీళ్ల ల్లో మొసళ్ళ లా – ప్రజాస్వామికం మాటున తిరుగుతున్న నర హంతకులను, కబ్జా దారులను, బ్లాక్ మార్కెటీర్ల ను, ఫోర్జరీ దారులను, రౌడీ షీటర్లను గుర్తించి…. వారిని ఎన్నికలు అనే ప్రజాస్వామిక ప్రక్రియ కు దూరంగా ఉంచితే ; రాష్ట్రం లో ప్రజాస్వామ్యం మరికొంత కాలం మనుగడ సాగిస్తుంది.

జగన్ పార్టీ గెలుస్తుందా…. లేక, చంద్రబాబు నాయుడు పార్టీ గెలుస్తుందా అనేది పాయింట్ కాదు, ఇక్కడ.

ప్రజాస్వామ్యం గెలుస్తుందా… రేపటి ఎన్నికలతోనే తనువు చాలిస్తుందా అనేది ముఖ్యం.

తెలుగు లో ఓ సామెత ఉంది, జుట్టు ఉంటే ఏ ముడి ఐనా వేసుకోవచ్చు అని. బోడి గుండు అయితే, ఏ జడ వేసుకుంటాం.

జుట్టు అనేది ఉంటే, వాలు జడ వేసుకోవచ్చు, పూల జడ వేసుకోవచ్చు, మధ్య పాపట తీసి రెండు జడలు వేసుకోవచ్చు. ముడి వేసుకోవచ్చు. కొప్పు వేసుకుని, దాని మీద బంగారపు బిళ్ళ గుచ్చు కోవచ్చు.

అలాగే, రాష్ట్రం లో ప్రజాస్వామ్యం అనేది ఒకటి బతికి ఉంటే, తరువాత ఎన్ని నృత్య రీతుల నైనా ప్రదర్శించవచ్చు.

ప్రజాస్వామ్యమనేదే మృగ్యం అయిపోతే, ఇంక మిగిలేది ఏముంటుంది.

త్రేతాయుగం నాటి రావణాసురు ని లంకే కదా!

పట్టపగలే…. బహిరంగంగానే…అక్రమాలు …. అరాచకాలు …. హత్యలు…. మానభంగాలు… దోపిడీలు…. దౌర్జన్యాలు..ఫోర్జెరీలు… చివరకు దెయ్యాల దిబ్బలు….

ఇటువంటి సమాజాన్ని అటు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గానీ, ఇటు ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు గానీ కోరుకుంటారని కలలో కూడా ఊహించడం కష్టం.

అందుకే, జగన్ మోహన్ రెడ్డి చొరవ తీసుకుని, ప్రతిపక్ష నేత ను ఆహ్వానించి, సమస్త అక్రమాసురుల, సామాజిక ద్రోహుల జాబితా ను రూపొందించాలి. ఆ జాబితాలో పేర్లు ఉన్న వారిని ఊళ్ల ల్లోకి రానివ్వవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేయాలి.
ఆతరువాతే, ఎన్నికలకు ఎవరి యుద్ధ వ్యూహలతో, వారు సిద్ధం కావాలి. ప్రజలు కూడా హర్షిస్తారు.