పసుపు చీరకట్టుకున్నా నిందిస్తారా?

– సొంత చెల్లెమ్మలపైనే జగనన్న బురదనా.. హవ్వ
-అది సంప్రదాయానికి గుర్తని తెలియదా?
– వైఎస్ వారసులెలా అవుతారన్న దానికేమిటి అర్ధం?
– షర్మిల వైఎస్‌కు పుట్టలేదని గతంలో వైసీపీ సోషల్‌మీడియా బురద
– ఇప్పుడు సోదరుడు జగన్ వారసురాలు కాదని వ్యాఖ్య
– వైఎస్ వ్యతిరేకులతో జత కట్టారంటూ చెల్లెమ్మలపై జగనన్న నింద
– మరి పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సీటు ఎలా ఇచ్చారు?
– చెల్లెళ్లపై జగనన్న చేసిన వ్యాఖ్యలపై మహిళాలోకం కన్నెర్ర
– పసుపుచీర కట్టుకోవడంపై చేసిన వ్యాఖ్యలు రచ్చ
– సంప్రదాయాన్ని వెక్కిరిస్తారా అంటూ ఆగ్రహం
– వైసీపీకి దూరమవుతున్న మహిళలు
– తలపట్టుకుంటున్న వైసీపీ అభ్యర్ధులు
( మార్తి సుబ్మ్రహ్మణ్యం)

ఇప్పుడున్న గడ్డుపరిస్థితిలో మా పార్టీకి ఆడవాళ్ల ఓట్లే ఆధారం. అన్ని వర్గాలూ దూరమైనప్పటికీ మహిళలు ఒక్కరే మాకు సానుకూలంగా ఉన్నారని ఇప్పటిదాకా సంబరపడ్డాం. సర్వేలు కూడా అవే చెప్పాయి. కానీ మా జగన్ గారు ఉన్న ఆ ఒక్క ఆధారాన్ని కూడా చేతులారా పోగొడుతున్నారు. ఎవరైనా సొంత చెల్లెళ్ల గురించి బహిరంగసభలో వ్యతిరేకంగా విమర్శిస్తారా? దానితో సొంత చెల్లినే ప్రేమించలేని జగనన్న, ఇక అక్కాచెల్లెమ్మలకు ఏం న్యాయం చేస్తారన్న భావన ఎందుకు రాదు? దీన్నిబట్టి జగన్‌గారికి స్క్రిప్టురాసే వారికి, సలహాలిచ్చే వారికి మెదడులో గుజ్జులేదని అర్ధమవుతుంది. లేకపోతే ఎవరైనా ఈ సమయంలో సొంత చెల్లి షర్మిల, సునీత మీద బురదచల్లి, మహిళల ఓట్లు పోగొట్టుకుంటారా? పసుపుచీర కట్టుకున్నారని ప్రత్యేకంగా వ్యాఖ్యానించి మహిళలను దూరం చేసుకుంటారా?.. ఇదీ తమ పార్టీ అధినేత-సీఎం జగన్, తన చెల్లెమ్మలను నిందిస్తూ విమర్శించిన తర్వాత ఆ పార్టీ అభ్యర్ధుల ఆందోళన.

తన రక్తం పంచుకుని పుట్టిన చెల్లి షర్మిలను తండ్రి వారసులు కాదంటూ జగనన్న చేసిన వ్యాఖ్య మహిళాలోకంలో చర్చనీయాంశమయింది. పసుపుచీర కట్టుకోవడాన్ని తప్పు పట్టిన జగనన్న మాటలపై మహిళలు సెంటిమెంటుతో రగిలిపోతున్నారు. పసుపు శుభసూచికం. మహిళలకు పసుపుచీరలంటే మక్కువ ఎక్కువ. షర్మిల తన కుమారుడి పెళ్లి కార్డు ఇచ్చేందుకు చంద్రబాబు ఇంటికి వెళ్లినప్పుడు పసుపుచీరతోనే వెళ్లారు. తాజాగా సొంత అన్న జగన్ దానిని ఆక్షేపించడాన్ని మహిళాలోకం జీర్ణించుకోలేకపోతోంది. తన సొంత చెల్లెళ్లపై తమ అధినేత జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పటివరకూ వైసీపీని అభిమానిస్తున్న మహిళాలోకాన్ని పార్టీకి దూరం చేస్తున్నాయని వైసీపీ అభ్యర్ధులు నెత్తీనోరూ కొట్టుకుంటున్నారు.

సొంత చెల్లెళ్లనే ప్రేమించని నాయకుడు ఇక ఇతర ఇతర మహిళలను ఏం గౌరవిస్తారన్న చర్చకు ఇప్పటికే తెరలేచింది. అన్నా చెల్లెళ్ల పంచాయతీకి దూరంగా తల్లి విజయమ్మ ఇప్పటికే అమెరికాకు వెళ్లిపోయారు. అటు చూస్తే షర్మిల-డాక్టర్ సునీత రోజూ వివేకా హంతకుడు అవినాష్‌రెడ్డేనని, హంతకుడికి ఎలా సీటు ఇస్తారని ఎన్నికల ప్రచారంలో ప్రశ్నిస్తున్నారు. వైఎస్ బిడ్డకు న్యాయం చేయాలని షర్మిల కొంగుచాపి అర్ధిస్తోంది.

మరో వైపు డాక్టర్ సునీత.. తండ్రి హత్య తదనంతర పరిణామాలపై, సాక్షి చానెల్‌లో సిద్ధమని జగనన్నకు సవాల్ విసిరింది. జగన్ తలకు వేసిన పట్టీ తీసేస్తే గాలి వచ్చి, దెబ్బ దానంతట అదే పోతుందని డాక్టర్ చెల్లెమ్మ సలహా ఇచ్చింది. అంటే ఇప్పటివరకూ జగనన్న చుట్టూ ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లు ఎవరూ, ఆయనకు అలాంటి సలహా ఇవ్వలేదని, సానుభూతి కోసం జగనన్నే అది కట్టుకున్నారని డాక్టర్ చెల్లెమ్మ చెప్పకనే చెప్పింది.

ఇవి చాలదన్నట్లు.. వివేకా భార్య- జగనన్నకు చిన్నమ్మ అయిన సౌభాగ్యమ్మ తన స్వదస్తూరీతో రాసిన లేఖ, మహిళల సానుభూతిని పోగేసేదే. ‘‘హంతకుడికి సీటు ఎలా ఇస్తావు? నీ కోసం మీ చిన్నాన్న ఎంత చేశారో మర్చిపోయావా? నీ చెల్లెళ్లపై సొంత మీడియాలో దారుణంగా ప్రచారం చేస్తుంటే ఎందుకు సహిస్తున్నావు? పైగా వైఎస్‌కు పుట్టలేదని ప్రచారం చేస్తారా? నీకిది ధర్మమా? అంటూ జగన్‌కు రాసిన లేఖ, మహిళల కంట కన్నీరు, షర్మిలకు ఓట్లు జమిలిగా తెచ్చిపెట్టేవేనన్నది నిర్వివాదం.

ప్రధానంగా షర్మిలను వైఎస్ వారసురాలు కాదంటూ, జగన్ చేసిన వ్యాఖ్య మహిళల ఆగ్రహానికి గురువుతోంది. రక్తం పంచుకుని పుట్టిన చెల్లి షర్మిలతో మొన్నటి వరకూ రాఖీ కట్టించుకున్న జగనన్న, ఇప్పుడు తనపై ఎదురుతిరిగిన అదే చెల్లిని, తండ్రికి వారసురాలు కాదని చెప్పడం సొంత చెల్లి-తల్లిని అవమానించడమేనన్న వ్యాఖ్యలు మహిళలోకంలో వ్యక్తమవుతోంది.

అయితే ‘‘చిన్నాన్నను చంపిన వారికి కొమ్ముకాస్తున్న జగనన్న వైఎస్‌కు ఎలా వారసుడు ఎలా అవుతాడు? నేను అసలు వైఎస్‌కే పుట్టలేదని నన్ను-మా అమ్మను అవమానిస్తున్నారు.

వైఎస్సార్ పార్టీలో వైఎస్సార్ లేరు. వై అంటే వైవీ సుబ్బారెడ్డి ఎస్ అంటే సాయిరెడ్డి ఆర్ సజ్జల రామకృష్ణారెడ్డి. నాకు చెల్లిని ప్రేమించే అన్న జగనన్న మాత్రమే తెలుసు. కానీ డబ్బుకు-అవినీతికి దాసోహమై-వైఎస్ ఆశయాలను తుంగలోతొక్కిన ఈ జగన్మోహన్‌రెడ్డి ఎవరో నాకు పరిచయం లేదం’’టూ షర్మిల చేస్తున్న ఘాటైన సెంటిమెంట్ వ్యాఖ్యలు, మహిళాలోకం మనసును హత్తుకుంటున్నాయి. ఇవన్నీ నేరుగా వైసీపీ మహిళా ఓట్లకు గండికొట్టేవేనన్నది వైసీపీ అభ్యర్ధుల ఆందోళన.

‘‘ మాకు ఉద్యోగులు, నిరుద్యోగులు, యువకులు, పెన్షనర్లు, రైతులు, వ్యాపార వర్గాలు ఓటేయరని తెలుసు. ఒక్క మహిళలే మా వెనుక ఉన్నారన్న ధైర్యంతో ఉన్నాం. కొంత క్రైస్తవులు, దళిత క్త్రైస్తవులు, మాలలు ఉన్నారనుకున్నాం. వారి ఆశీస్సులు ఉంటే మిగిలిన వర్గాలు ఓటేయకపోయినా చాలన్న ధైర్యం ఇప్పటిదాకా ఉండేది. కానీ ఇప్పుడు మా జగన్ సార్ సొంత చెల్లెళ్లపై చేసిన విమర్శలు, షర్మిల వైఎస్ వారసురాలు కాదంటూ చేసిన వ్యాఖ్య, పసుపుచీర కట్టుకుందంటూ చేసిన విమర్శ కచ్చితంగా మహిళలను వైసీపీకి దూరం చేసేవే’’ అని గుంటూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్న ఒక వైసీపీ అభ్యర్థి ఆందోళను వ్యక్తం చేయడం గమనార్హం.

‘‘ మేం ఈరోజు జగన్‌గారి వ్యాఖ్యలపై రియాక్షన్ ఎలా ఉందని మా పార్టీ మహిళలను అడిగాం. వాళ్లు కూడా వ్యతిరేకంగా మాట్లాడారు. అంటే మా పార్టీ మహిళలే జగన్ గారి కామెంట్లను వ్యతిరేకిస్తుంటే, ఇక సమాజంలోని మహిళల మనోభావాలేమిటో చెప్పాల్సిన పనిలేదు. మేమైతే మహిళలనే నమ్ముకుని కోట్లు ఖర్చుపెట్టుకుని ఎన్నికల్లో దిగాం. కానీ మమ్మల్ని మా జగన్ సారే తన కామెంట్లతో కొంపముంచుతారనుకోలేద’ని ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒక మంత్రి నిరాశాపూరిత వ్యాఖ్యలు చేయటం ప్రస్తావనార్హం.

వైఎస్‌ను వ్యతిరేకించిన వారితో చెల్లెమ్మలు చేతులు కలిపారంటూ, జగనన్న చేసిన విమర్శలపై మహిళాలోకంలో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. హెలికాప్టర్ ప్రమాదం వెనుక అంబానీ హస్తం ఉందని అప్పట్లో జగన్, ఆయన కుటుంబసభ్యులు ఆరోపించారు. అభిమానులు కూడా రిలయన్స్ ఆస్తులు ధ్వంసం చేశారు. ఆ తర్వాత అదే అంబానీ రిలయన్స్‌కు చెందిన పరిమళ్ నత్వానీకి, జగన్ రాజ్యసభ సీటు ఇచ్చి గౌరవించిన విషయాన్ని ఎలా మర్చిపోతామని మహిళలు ప్రశ్నిస్తున్నారు.

అలాగే విజయమ్మను విమర్శించిన బొత్సకు, వైఎస్‌ను విమర్శించిన కన్నబాబు లాంటి వాళ్లకు మంత్రిపదవులిచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఏదేమైనా తాజాగా జగనన్న తన చెల్లెమ్మలనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు, మహిళలను వైసీపీకి దూరం చేసేవేనన్న ఆందోళన- అభిప్రాయం పార్టీ అభ్యర్ధులలో స్పష్టంగా కనిపిస్తోంది.