ముస్లిం సోదరులకు అండగా ఉంటా

-ఆటోనగర్‌లో నీటి సమస్య పరిష్కరిస్తా
-గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని
-మోటార్‌ ఫీల్డ్‌ సోదరులతో సమావేశం

గుంటూరు, మహానాడు: రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు నిర్ణయం జరిగింది. పొత్తు వల్ల ముస్లిం సోదరులకు ఎలాంటి సమస్య ఉండదని గుంటూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. గుంటూరులోని ఆటోనగర్‌లో గురువారం సాయంత్రం జరిగిన మోటార్‌ ఫీల్డ్‌ సోదరుల ఆత్మీయ సమావేశం కార్యక్రమానికి పెమ్మసాని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ అధికారంలో ఉండగా దొడ్డిచాటున బీజేపీకి సహకారం అందించిందే తప్ప రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. కానీ ప్రజా సంక్షేమం దృష్ట్యా, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకలను అరికట్టేందుకు ఎన్డీఏ కూటమి ముందస్తు చర్యలు తీసుకుందని చెప్పారు. ఆటోనగర్‌లో ఎన్నో ఏళ్లుగా నీటి సౌకర్యం లేక స్థానికులు పడుతున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయని తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే నీటి సమస్యను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. నాయకులతోనూ సంప్ర దించి ఇతర సమస్యలపై పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి మహమ్మద్‌ నశీర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ ఆటోనగర్‌ అభివృద్ధి చేస్తామంటూ పదేళ్లు వైసీపీ ఎమ్మెల్యే కాలయాపన చేశారని, గెలిచిన తర్వాత ఒకసారి కూడా ఆటోనగర్‌ వైపు తొంగి చూడలేదని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నంబూరు సుభాని, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ, బీసీ నాయకులు నిమ్మల శేషయ్య, టీడీపీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌, ముస్లిం నాయకులు సయ్యద్‌ ముజీబ్‌, టీడీపీ నాయకులు భరత్‌ రెడ్డి, డిప్యూటీ మేయర్‌ షేక్‌ గౌస్‌, ఆటోనగర్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ సయ్యద్‌ షబ్బీర్‌ తదితర నాయకులు పాల్గొన్నారు.