-వైసీపీ ట్రాప్ లో పడొద్దు
– విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి
విజయవాడ : నియోజకవర్గ క్రైస్తవుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస్తానని పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా లంబాడీ పేట బేతెస్ట్ చర్చ్ ను సుజనా చౌదరి ఆదివారం సందర్శించారు. సుజనాకు క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టేట్ ప్రెసిడెంట్ పాస్టర్ అప్పికట్ల జవహర్ స్వాగతం పలికారు. క్రిస్టియన్ల సమస్యలను సుజనా అడిగి తెలుసుకున్నారు. సలహాలు సూచనలు స్వీకరించారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలని సుజనాని పాస్టర్ కాటూరి మోజెస్ పాస్టర్ అప్పికట్ల జవహర్ ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆశీర్వదించారు.
క్రైస్తవులు, ముస్లిం మైనారిటీలపై ఎన్డీఏ కూటమికి చిత్తశుద్ధి ఉందని ఈ సందర్భంగా సుజనా చెప్పారు. క్రైస్తవులను రెచ్చగొడుతూ వైసీపీ రాజకీయ పబ్బం గడుపుతోందని దుయ్యబట్టారు. బీజేపీ అంటే అభద్రతాభావం పోగొట్టుకోవాలని, వైసీపీ మాటలు నమ్మవద్దని అన్నారు. క్రైస్తవుల సమస్యలను పరిష్కరించి వారి సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ క్రైస్తవలందరూ తమకు అండగా ఉండి భారీ మెజారిటీతో గెలిపించాలని సుజనా విజ్ఞప్తి చేశారు.