ఓట్లు దండుకునేందుకు పథకాల కొనసాగింపు
జనచైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి
గుంటూరు, మహానాడు : వైసీపీ శనివారం విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వలేదని, ప్రజల సొమ్ముతో ఓట్లు దండుకునే పథకాల కొనసాగింపునకు ప్రాధాన్యం ఇచ్చారని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి విమర్శించారు. గుంటూరు జన చైతన్య వేదిక హాలులో ఆదివారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్‌సత్తా జిల్లా కార్యదర్శి ఎన్.అరవింద్, అఖిలభారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు జాస్తి వీరాంజనే యు లు, రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఓ.నారాయణరెడ్డి పాల్గొన్నారు. లక్ష్మణరెడ్డి ప్రసం గిస్తూ గత ఎన్నికల మేనిఫెస్టోలో సంపూర్ణ మద్యనిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామని ఆచరణలో మద్యం అమ్మకాలను 1.5 లక్షల కోట్లకు చేర్చారన్నారు. ఇటీవల ప్రకటించిన మేనిఫెస్టోలో మద్య నిషేధం ప్రస్తావన లేకపోవడం శోచనీయమన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి తీవ్ర విఘాతం
నీటిపారుదల ప్రాజెక్టులకు గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్‌లో ఐదు శాతం మాత్రమే కేటాయించి ఆచరణలో 2.5 శాతం మాత్రమే వ్యయం చేసి ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయ లేదని విమర్శించారు. 25 శాతం నిరుద్యోగులు ఉన్నారని, వారికి ఉద్యోగావకాశాలు, పారిశ్రా మిక అభివృద్ధికి, అవస్థాపన సౌకర్యాల మెరుగుదలకు మేనిఫెస్టోలో స్థానం కల్పించలేదన్నారు. 14 లక్షల కోట్లకు పైగా పెరిగిన అప్పుల భారానికి పరిష్కారం చూపలేదన్నారు. విశాఖ స్టీల్, కడప స్టీల్, విశాఖ రైల్వే జోన్, ప్రత్యేక హోదాల ప్రస్తావన లేదని తెలిపారు. మూడు రాజధాను ల పేరుతో మూడు ముక్కల ఆటను కొనసాగిస్తామని మేనిఫెస్టోలో పేర్కొని ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లుగా మార్చుకోవాలనే కుటిల ప్రయత్నం కనిపిస్తుందన్నారు.
అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధికి ఎలాంటి ఆలోచనలు మేనిఫెస్టోలో కనబడలేదన్నారు. భారతదేశం లో ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యతలో 30వ స్థానం, మానవ వనరుల అభివృద్ధిలో 25వ స్థానం, తలసరి ఆదాయం లో 11వ స్థానం, దక్షిణ భారతదేశంలో తలసరి ఆదాయంలో అట్టడుగున ఉన్న పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్‌ను ఏ విధంగా పురోగమన దశలోకి తీసుకువస్తారని ప్రశ్నిం చారు. ఐదేళ్లలో ఒక్క డీఎస్సీని ప్రకటించకుండా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకుండా విద్యారంగాన్ని అస్తవ్యస్తం చేశారన్నారు. నేటి మేనిఫెస్టోలో కూడా ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల ను భర్తీ చేస్తామని ప్రకటించకపోవడం దారుణమన్నారు.
అంకుర సంస్థలకు ప్రోత్సాహకాలు లేవు
నూతలపాటి అరవింద్ ప్రసంగిస్తూ మేనిఫెస్టోలో స్వయం ఉపాధి కల్పించే అంకుర సంస్థల ప్రోత్సాహకాలు ప్రకటించకపోవడం అభివృద్ధి నిరోధక చర్య అని అన్నారు. ఔత్సాహికులకు పరిశ్రమల స్థాపనకు కావలసిన వాతావరణం, భద్రత ఆంధ్రప్రదేశ్ లో కరువైందన్నారు. జాస్తి వీరాంజనేయులు ప్రసంగిస్తూ ఐదేళ్లుగా పంచాయతీలకు ఎలాంటి నిధులు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం పంచాయతీలకు అందించిన నిధులను దారి మళ్ళించిందని పేర్కొన్నారు. నేడు వైకాపా మేనిఫెస్టోలో 65 శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామీణ ప్రాంత అభివృద్ధికి ఎలాంటి ప్రోత్సాహకాలు లేకపోవడం దారుణమని విమర్శించారు.