నేనైతే జగన్‌ మొహాన కొట్టేవాడిని

అవినీతి చేయబట్టే మూడు రాజధానులకు తలూపారు
వైసీపీ ఎంపీ అభ్యర్థి రోశయ్యపై పెమ్మసాని ఫైర్‌

గుంటూరు: ‘పార్లమెంట్‌ వైసీపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య 700 ఎకరాల గ్రావెల్‌ తవ్వి అక్రమ సంపాదనను వెనకేసుకున్నారు. అందుకే జగన్‌ చెప్పినట్టల్లా ఆడుతున్నారు. మూడు రాజధానులు కావాలని జగన్‌ చెప్పమంటే మాత్రం చెప్పేస్తారా? ప్రజల గురించి ఆలోచించేది లేదా? అదే నేనైతే రాజీనామా చేసి జగన్‌ మొహాన కొట్టి వచ్చేవాడిని’ అని గుంటూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ వ్యాఖ్యానించారు. గుంటూరు 38వ డివిజన్‌ బృందావన్‌ గార్డెన్స్‌ టెంపుల్‌ రోడ్డులో వేములపల్లి విఠల్‌ ఆధ్వర్యంలో మాజీ రిటైర్డ్‌ మున్సిపోల్‌ కమిషనర్‌ దేవినేని కరుణచంద్రబాబు అధ్యక్షతన ఆదివారం జరిగిన ఆత్మీయ సమావేశానికి పెమ్మసాని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మూడు రాజధానులే కావాలన్న రోశయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్‌ ద్వారా రూ.2,300 కోట్లు అవినీతి చేశారు కాబట్టే, జగన్‌ చెప్పినదానికల్లా తల ఊపుతున్నారని విమర్శించారు. అందుకే ఎంపీగా ఓడిపోతారని తెలిసినా సరే గత్యంతరం లేక రోశయ్య పోటీ చేస్తున్నారని అన్నారు.

అదే రోశయ్య స్థానంలో తాను ఉండి ఉంటే పదవికి రాజీనామా చేసి, జగన్‌ మొహాన విసిరి వచ్చేవాడినని, ఆయన కాబట్టి చేతులు కట్టుకుని ఉన్నారని తెలిపారు. గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేస్తున్న రజనీ ఒక సిస్టమాటిక్‌గా అవినీతి చేస్తున్నారని, అందుకే చిలకలూరిపేట ప్రజలు ఇక్కడకు పంపారని, ఆమెలో ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. రాష్ట్రంలో విద్యార్థులకు, యువతకు ఉపాధి అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు, దేశాలకు వలస పోవాల్సిన అవసరం వస్తుందని తెలిపారు. పరిశ్రమలను తీసుకురావాలంటే ఒక కఠోర శ్రమ అవసర మని సొంత నేలపై, పుట్టిన భూమిపై ప్రేమ ఉన్న వారికి మాత్రమే ఆ ప్రయత్నం సాధ్యమవు తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి మాధవి, జనసేన నాయకులు ఆళ్ల హరి, స్థానిక నాయకులు విఠల్‌రావు, కార్పొరేటర్‌ పద్మ, తదితరులు పాల్గొన్నారు.