వైసీపీ పాలనలో గంజాయికి రాజధానిగా రాష్ట్రం

  • కాపులకు… దళితులకు చిచ్చు పెట్టాలనే అనంతబాబుకు జగన్ ప్రోత్సాహం
  • ఒక వ్యక్తి చేసిన తప్పు మొత్తం కులానికి ఆపాదించి చూడకూడదు
  • దళితుల్లో కాపుల పట్ల ద్వేషం నింపాలనేది జగన్ కుట్ర
  • ప్రజలు కష్టాలు తీర్చమని అడిగితే వైసీపీ నాయకులు గంజాయి పంపిణీ చేస్తున్నారు
  • జగన్ లాంటి వారిని మోదీ పట్టించుకోరు
  • పోలవరానికి జగన్ తీరని ద్రోహం చేశాడు
  • అనుభవజ్ఞుల సమూహంతో కూటమి బలంగా పాలన చేస్తుంది
  • ప్రత్తిపాడు నియోజకవర్గం, ఏలేశ్వరం వారాహి విజయభేరీ సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్

‘నేను కులాలను కలిపే ఆలోచనతో ముందుకు సాగుతాను. నా దృష్టిలో ప్రతి కులం, ప్రతి మనిషి ఒక్కటే. తన దగ్గర పనిచేస్తున్న దళిత యువకుడు సుబ్రమణ్యంను కిరాతకంగా హత్య చేసి, మృత దేహాన్ని వాళ్ల ఇంటికే డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును జగన్ కావాలనే  వెనకేసుకొస్తున్నాడు. దీనివల్ల అనంతబాబుకు వ్యక్తిగతంగా ఎంత నష్టం జరుగుతుందో తెలియదు కానీ.. అతడి సామాజిక వర్గం అయిన కాపులకు మాత్రం చాలా నష్టం జరుగుతోంది. ఇదే  జగన్ అసలు కుయుక్తి. అతడ్ని ప్రోత్సహించడం ద్వారా దళితులను మరింత రెచ్చగొట్టాలి.

అనంతబాబు కాపు సామాజిక వర్గం కాబట్టి అతడిపై ద్వేషం కాకుండా, కాపులపై దళితులకు ద్వేషం పెరగాలనేది జగన్ అసలు కుట్ర అని జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ అన్నారు.  కాపులకు, దళితులకు చిచ్చు పెట్టాలని, అనంతబాబునును వెనకేసుకురావడం ద్వారా కాపులపై దళితుల్లో ఆగ్రహం నింపాలనేది జగన్ పన్నాగం అని, దీన్ని జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలని చెప్పారు. దళితులను కాపులకు దూరం చేయాలనే పన్నాగం దీనిలో దాగుందన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం, ఏలేశ్వరంలో ఆదివారం జరిగిన వారాహి విజయభేరీ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. కాకినాడ లోక్ సభ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, ప్రత్తిపాడు నియోజక వర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సత్యప్రభలను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ –  “మహనీయుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం చట్టం అందరికీ ఒక్కటే. తప్పు చేసిన ప్రతి ఒక్కరికీ ఒకేలా పని చేయాలి. అందుకే ఆ మహనీయుడి ప్రతి విగ్రహం కూడా వేలు చూపిస్తూ ఉంటుంది. దీని అర్ధం చట్టం అందరికీ ఒక్కటే అని సూచిక.  జనసేన గొంతు జనం గొంతు. అలాంటి గొంతు పార్లమెంటులో, అసెంబ్లీలో ప్రజల బాధలను, సమస్యలను వినిపిస్తే దాని తీరే వేరు. కాకినాడ పార్లమెంటు వైసీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ కు జగన్ అంటే భయం. నేను మోదీతో ఏ విషయం మీద అయినా మాట్లాడగలను. నేను మోదీని సంపూర్ణంగా గౌరవిస్తాను.  రాష్ట్రంలో మూడు పార్టీల కూటమి ఇంత బలంగా ఉంది అంటే.. జనసైనికులు ఇచ్చిన బలమే. జగన్ దాష్టికాలను అయిదేళ్ల పాటు ఏ మాత్రం లొంగకుండా చేసిన పోరాటమే మోదీ వద్ద నాకు ప్రత్యేక స్థానాన్ని అందించాయి.

జగన్ లాంటి వారిని మోదీ దగ్గరకు కూడా రానివ్వరు

జగన్ లాంటి వ్యక్తి వెళ్లి ప్రధాని మోదీని ప్రజల సమస్యలు, రాష్ట్ర సమస్యలు గురించి ఏం అడుగుతాడు..? సర్ నా మీద ఉన్న 39 కేసులను కొట్టేయండి.. నన్ను కాపాడండి అని మాత్రమే అడుగుతారు. జగన్ లాంటి వారిని మోదీ తాట తీసి కింద కూర్చోబెడతారు. ఇలాంటి క్రిమినల్స్ ను దగ్గరకు కూడా రానివ్వరు. 5 ఏళ్లు జగన్ ప్రభుత్వాన్ని చూశారు. బుగ్గలు నిమిరి, ముద్దులు పెట్టి మరీ వచ్చాడు. ఏం చేశాడో మీ అందరికీ తెలుసు. నేను మాట ఇచ్చాను అంటే దానిపై నిలబడేవాడిని. దశాబ్దం పాటు ప్రజల కోసం కష్టపడిన వాడిని. పోరాటం చేసిన వాడిని. ప్రజల కోసం అద్భుతమైన భవిష్యత్తును అందిస్తాను. కూటమి ప్రభుత్వానికి ప్రజలు నిలబడండి.

పోలవరానికి తీరని అన్యాయం చేసిన జగన్

జగన్ ప్రభుత్వం వచ్చే నాటికే పోలవరం పనులు 72 శాతం పూర్తయ్యాయి. దాన్ని కొనసాగించి ఉంటే, అద్భుతమైన ప్రాజెక్టు సాకారం అయ్యేది. పనులు చేయలేక, పోలవరాన్ని ఏటీఎం మాదిరి వాడుకున్న జగన్ పోలవరానికి తీరని అన్యాయం చేశాడు. గోదావరి జిల్లాల మెట్ట ప్రాంతాలకు తీరని అన్యాయం చేశాడు. పోలవరంలో ఏం జరుగుతుందో బయట వ్యక్తులు, విపక్షాలు తెలుసుకుంటాయనే నెపంతో పోలవరం ప్రాంతాన్ని నిషేధిత ప్రాంతం చేశాడు. పోలవరం పూర్తయితే తాగు, సాగునీటి సమస్య చాల ప్రాంతాలకు తీరుతుంది. రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది.

పత్తిపాడులో మాఫియా డాన్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆగడాలు ఎక్కువ అయ్యాయి. వంతాడ మైనింగ్ ఇష్టానుసారం చేస్తూ లాటరైట్ ముసుగులో బాక్సైడ్ తవ్వుకుంటున్నారు. ద్వారంపూడి తమ్మడు లంపక లోవ గ్రామంలో వీర భద్రారెడ్డి తన వీరభద్ర కంపెనీకు అక్రమంగా గ్రావెల్ రవాణా చేశాడు. మైనింగ్ సెస్ వాడుకొని వాళ్ల కంపెనీ కోసం ప్రత్యేకంగా వంతెన వేసుకున్నారు. ప్రజలకు కావాల్సిన రోడ్లు లేవు, వంతెనలు లేవు కాని, వీళ్ల కోసం బ్రిడ్జిలు వేసుకున్నారు. వంతెన నిర్మించడమే కాదు.. బరి తెగించి మరీ అనుమతి ఇచ్చిన అధికారి పేరు వంతెనకు పెట్టారు. అన్నవరం క్షేత్రాన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ది చేస్తాం. వంతాడ మైనింగ్ రెగ్యులరైజ్ చేస్తాం.

భవన నిర్మాణ కార్మికులకు దిక్కు లేకుండా చేశారు

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి రూ.450 కోట్లు జగన్ ప్రభుత్వం తీసుకుంది. గతంలో భవన నిర్మాణ కార్మికులకు వివిధ అవసరాల నిమిత్తం కూతురు పెళ్లికి  డెలివరీకి డబ్బులు ఇచ్చేవారు.

ప్రమాదం జరిగితే క్లైయిమ్ చేసుకునే సౌలభ్యం ఉండేది. ఈ నిధులను జగన్ మళ్లించాడు. కూటమి ప్రభుత్వం రాగానే మళ్లీ సంక్షేమ నిధికి ఊపిరి పోస్తాం. భవన నిర్మాణ కార్మికులు మళ్లీ వైసీపీకి నిలబడితే మీ బతుకుల మీద కొడతాడు జాగ్రత్త. రాష్ట్రంలో 76 ఎయిడెడ్ కళాశాలలు తీసేశాడు. వాటిని మళ్లీ పునరుద్ధరించాలని కోరుతున్నారు. దాతలు స్థలాలు ఇచ్చి, వెనుకబడిన వారికి విద్య అందించాలానే లక్ష్యాన్ని వైసీపీ ప్రభుత్వం నీరుగార్చింది. కూటమి ప్రభుత్వంలో ఎయిడెడ్ కళాశాలలు, స్కూళ్లను మళ్లీ యధావిధిగా పునరుద్ధరిస్తాం.

ప్రత్తిపాడు సమస్యలపై ప్రత్యేక దృష్టి

ప్రత్తిపాడు నియోజవకర్గ సమస్యలపై కూటమి ప్రభుత్వంలో ప్రత్యేక దృష్టిపెడతాం. ఏలేరు రిజర్వాయర్ ఆధునీకరణ, పుష్కర, పోలవరం కాలువలపై లిఫ్ట్ ఇరిగేషన్, రోడ్లకు కొత్తరూపు తీసుకొస్తాం. నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు వైద్యం అందాలి. ప్రాథమిక వైద్యం సమగ్రంగా తీసుకొచ్చి, వైద్యులను నియమిస్తాం. గిరిజనులు కోరిక మేరకు పెద్ద మల్లాపురం గ్రామాన్ని మండలంగా చేస్తాం. వంతాడ అక్రమ మైనింగ్ కు చెక్ పెడతాం. మిథున్ రెడ్డి తూర్పుగోదావరిలో విధ్వంసం చేస్తున్నాడు. ఈ సంపద మనది. ఈ హక్కులు మనకు ఉండాలి. వంతాడ మైనింగ్ ను రెగ్యులేట్ చేసి, వంతాడ మైనింగ్ వల్ల భూములు కోల్పోయిన వారికి అండగా నిలుస్తాం. పుష్కర ఎత్తిపోతల పథకం ముందుకు తీసుకెళ్తాం. సుబ్బారెడ్డి సాగర్, చంద్రబాబు సాగర్ ప్రాజెక్టులను ఆధునీకరణ చేస్తాం. ఎర్రమట్టి గ్రావెల్ తోడేయడం వల్ల అది రవాణా సమయంలో ఆ మట్టి ప్రజలకు కొత్త రోగాలను తీసుకొస్తోంది. దీనిపై తగిన చర్యలు తీసుకుంటాం. పత్తిపాడులో ద్వారంపూడి అడుగు పెట్టాలంటే ఒకటికి వందసార్లు ఆలోచించాలి.

30వ తేదీన సంపూర్ణ మేనిఫెస్టో

కూటమి సంపూర్ణ మేనిఫెస్టో ఈ నెల 30వ తేదీన విడుదల అవుతుంది. ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు సాయం, ప్రతి మహిళకు నెలకు రూ.1500, ఉచిత బస్సు ప్రయాణం, పేదలకు కడుపు నింపడానికి అన్నా క్యాంటీన్లు, డొక్కా సీతమ్మ క్యాంటీన్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం పునరుర్ధరణ, చేతి వృత్తులను ప్రొత్సాహం, పోలవరం పూర్తి. సబ్ ప్లాన్ నిధులు ఆయా వర్గాలకు అందేలా చూస్తాం. ఈ అరటి పండు తొక్క ప్రభుత్వాన్ని యువత చెత్త బుట్టలో పడేయండి. వైసీపీ నాయకులు అరటి పండు తినేసి, మన మీదకు తొక్క విసిరేశారు. అలాంటి వారిని మనం విసిరేద్దాం. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓటు వేయండి. కూటమి ప్రభుత్వానికి నిలబడాలి.

ఏ మూలకెళ్లినా గంజాయి కంపు

యువతకు ఉపాధి లేదు… ఉద్యోగికి జీతాలు సకాలంలో లేవు. సంపద ఎటు వెళ్తోంది..? డబ్బు ఏమైపోతోంది అంటే జగన్ జేబులోకి వెళ్తోంది. మద్యం పేరుతో రూ.41 వేల కోట్లు దోచేశాడు. రూ.60 ఉన్న మద్యం రూ.200 కు పైగా అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలతో వ్యాపారం చేస్తున్నాడు. ప్రతి చేతికీ పని.. ప్రతి చేనుకీ నీరు అన్నది కూటమి లక్ష్యం. కూటమి ప్రభుత్వంలో నేను ప్రజల గళం అవుతాను. ప్రజల గుండె చప్పుడు అవుతాను. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచుతాం. తల్లిదండ్రుల దగ్గరే ఉంటూ ఉపాధి చూపిస్తాం. రాష్ట్రం గంజాయికి కేరాఫ్ అయింది.

దేశంలో గంజాయి రాజధానిగా మారింది. 25 వేల టన్నుల మాదక ద్రవ్యాలు దొరికాయి అంటే సాధారణ విషయం కాదు. రాష్ట్రంలో ఏమూలకు వెళ్లినా గంజాయి దొరుకుతోంది. ప్రజలు తాగు నీరు, సాగు నీరు అడిగితే వైసీపీ పాలకులు మాత్రం గంజాయి ఇస్తున్నారు. 2047 నాటికి యువత భవిష్యత్తు బంగారం కావాలి. వారిని దీనికి అనుగుణంగా సమర్థంగా తయారు చేస్తాం. యువత గొంతే సమాజ సంకల్పం. మీ ఆశయమే దేశ భవిష్యత్తు. నేను మీ కోసం అలాంటి ఉజ్వల భవితను తీసుకొస్తాను. కాపు రిజర్వేషన్లనపై మాట ఇచ్చి వెనక్కు వెళ్లిపోయారు.

కూటమి ప్రభుత్వం బలంగా ఉంటుంది. మూడున్నర ఏళ్లు ఆంధ్రప్రదేశ్ ను పాలించిన కిరణ్ కుమార్ రెడ్డి , 14 ఏళ్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు , ప్రతి కష్టానికి భుజం కాసే నేను కలిసి ముందుకు వస్తున్నాం. ఒక్కరి ఆలోచనతోనే రాష్ట్రం ముందుకు వెళ్లదు. అనుభవం ఉన్నవారు… నాలాంటి వారి  ఆలోచనతో ఆంధ్రా భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. అందుకే ప్రజలంతా ఆలోచించి కూటమికి భుజం కాయాలి. ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సత్యప్రభకి సైకిల్ గుర్తుపై, కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ కి గాజు గ్లాసు గుర్తుపై ప్రజలు ఓటు వేయాలి’’ అని కోరారు.