రిజర్వేషన్లు రద్దు చేసేందుకే మోదీ కుట్ర
ఈ ఎన్నికలు గుజరాత్ వర్సెస్ కర్నాటక
మోదీ ఇచ్చింది ఏమీ లేదు…ఖాళీ చెంబు తప్ప
కర్నాటక ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
కర్నాటక, మహానాడు : బీజేపీపై పోరాటం చేసే వారికి అమిత్‌షా నోటీసులు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో బీజేపీని ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రినైన నాకు, గాంధీభవన్ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇస్తున్నారు.ఎన్నికలు వచ్చినప్పుడల్లా మోదీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ అధికా రులను పంపిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన సోమవారం కర్నాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మోదీ విధానాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఎంతో పోరాటం చేస్తున్నారన్న రేవంత్ ఈ పోరాటంలో కర్నాటక నుంచి 25 మంది ఎంపీలను గెలిపించి మోదీని గద్దె దించడానికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రానికి కరువు వస్తే మోదీ ఎలాంటి సహాయం చేయలేదు.
ఆయన ఇచ్చింది ఏమీ లేదు..ఖాళీ చెంబు తప్ప అని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకే బీజేపీ 400 సీట్లు కావాలం టోందని రిజర్వేషన్లు కావాలనుకుంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. ఈ ప్రాంతం నుంచి వచ్చిన ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు..ఆయనకు మీరు మద్దతుగా నిలవాల్సిన బాధ్యత ఉంది..గుజరాత్ మోదీకి అండగా ఉన్నట్లే కర్ణాటక ఖర్గేకు అండగా నిలవాలని కోరారు. ఈ ఎన్నికలు కర్ణాటక వర్సెస్ గుజరాత్ అని పేర్కొన్నారు. మొన్న కర్నాటక, నిన్న తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది..రేపు దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు.