రైతు రుణమాఫీ చేసి తీరుతాం
ఓట్లడిగే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదు
కాళేశ్వరం, మేడిగడ్డ దుస్థితే నిదర్శనం
దోచిన డబ్బుతో వెంకట్రామిరెడ్డి ఖర్చు
ఎన్నికల ప్రచారంలో మంత్రి కొండా సురేఖ
గజ్వేల్, మహానాడు : తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలుచేయకుండా అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేసి చూపిన కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. గజ్వేల్ నియోజకవర్గం కొండపాకలో ఆమె మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోలేదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు రూ.2 లక్షల లోపు రుణమాఫీ చేస్తారని, హరీష్రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ తళతళలాడుతుందనుకుంటే మట్టిరోడ్లు కనిపిస్తున్నాయని, ఎలాంటి ప్రగతి జరిగిందో అర్థం చేసుకోవచ్చని ఎద్దేవాచేశారు. కాళేశ్వరం, మేడిగడ్డ దుస్థితే బీఆర్ఎస్ పాలనకు అద్దం పడుతుందని మంత్రి పేర్కొన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కలెక్టర్గా ఉన్నప్పుడు దోచుకున్నదంతా ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి ఖర్చు పెడుతున్నాడని ధ్వజమెత్తా రు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ కేంద్రం నుంచి దుబ్బాక అభివృద్ధికి నిధులు తెస్తానంటూ నమ్మించి వంచించారని విమర్శించారు. దేవుడి పేరు చెప్పి ఓట్లడిగే వారిని తరిమికొట్టాలని, బీఆర్ఎస్, బీజేపీ చెప్పే మోసపూరిత మాటలను నమ్మి మోసపోవద్దని సూచించారు. అనంత రం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురికి శాలువాలు కప్పి సాదరంగా పార్టీలోకి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హన్మంతరావు, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.