కూటమిలో ‘ధర్మారెడ్డి ’ కుంపటి!

– బీజేపీ-జగన్.. ‘ధర్మ’ పరి ‘రక్షణ’
– టీటీడీ జేఈఓ ధర్మారెడ్డి డిప్యుటేషన్ పొడిగింపు
– వచ్చే నె ల11తో ముగియనున్న గడువు
– ధర్మారెడ్డి డిప్యుటేషన్ పొడిగించాలని కోరిన జగన్
– జగన్ అభ్యర్ధనను ఆగమేఘాలపై మన్నించిన కేంద్రం
– ధర్మారెడ్డిని బదిలీ చేయాలన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, భానుప్రకాష్‌రెడ్డి
– ఇప్పటికే ధర్మారెడ్డిపై కూటమి ఆరోపణల వర్షం
– అయినా ఖాతరు చేయని బీజేపీ సర్కారు
– బీజేపీ-వైసీపీ బంధం బట్టబయలు
– కూటమి ఏర్పాటు ఉత్తుత్తిదేనా?
– అందుకే డీజీపీ, సీఎస్‌పై వేటు వేయలేదా?
– బీజేపీకి టీడీపీ-జనసేన ఓట్లు బదిలీ అవుతాయా?
– బీజేపీ పక్షపాతంపై టీడీపీ-జనసేన అసంతృప్తి
– కూటమిలో ధర్మారెడ్డి ‘డిప్యుటేషన్’ కల్లోలం
( మార్తి సుబ్రహ్మణ్యం)

జగన్ ఒత్తిడి చేసినందుకే రఘురామకృష్ణంరాజుకు నర్సాపురం ఎంపీ టికెట్ ఇవ్వలేదట
– ఇది మొన్నటివరకూ వినిపించిన అనుమానాలు.
ఎన్డీయే కూటమి ఉన్నప్పటికీ డీజీపీ-సీఎస్‌ను మార్చాలన్న ఫిర్యాదుపై ఈసీ ఎందుకు స్పందించడం లేదు?
– ఇది నిన్నటివరకూ జనంలో వినిపించిన అనుమానాలు
టీటీడీ జేఈఓ ధర్మారెడ్డి డెప్యుటేషన్ పొగిడించవద్దని కూటమి స్వయంగా కోరినా, వాటిని బేఖాతరు చేసిన కేంద్రం ఆయనకు పొడిగింపు ఎలా ఇచ్చింది?
– ఇది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న అనుమానాలు.

బీజేపీ కూటమిలో ఉన్నప్పటికీ జగన్ సిఫార్సులు ఎలా అమలవుతున్నాయన్న ప్రశ్నలకు.. బీజేపీ-జగన్ బంధం కొనసాగుతోందన్న అనుమానాలకు, ధర్మారెడ్డి డిప్యుటేషన్ రూపంలో మరోసారి సమాధానం దొరికింది. ఇది బీజేపీ-జగన్ ‘దత్త’బంధాన్ని మరోసారి బట్టబయలుచేసింది.

నిజానికి వచ్చే నెల 14తో ధర్మారెడ్డి డిప్యుటేషన్ ముగియనుంది. కేంద్ర సర్వీసులో ఉన్న అధికారులకు సహజంగా 7 సంవత్సరాలు, ఏ రాష్ట్రంలోనయినా డెప్యుటేషన్ అవకాశం ఉంటుంది. ఆ ప్రకారంగా ధర్మారెడ్డి డెప్యుటేషన్ ఏడేళ్ల గడువు 14వ తేదీతో ముగుస్తుంది. దానితో ఆయన కేంద్ర సర్వీసుకు తిరిగి వెళ్లిపోవలసి ఉంటుంది. గతంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కూడా, ఆయన ఒకసారి రాష్ట్ర సర్వీసులో పనిచేసి తిరిగి ఢిల్లీ వెళ్లిపోయారు. జగన్ సీఎం అయిన తర్వాత మళ్లీ రాష్ట్ర సర్వీసుకు వచ్చారు.

సాధారణ అధికారులయితే ఏడేళ్ల డిప్యుటేషన్ ముగిస్తే, మూటాముల్లె సర్దుకుని వెళ్లిపోతుంటారు. అలా చాలామంది వచ్చి వెళ్లిన వారే. కానీ అక్కడ ఉంది ధర్మారెడ్డి! ఆయన మామూలు అధికారి కాదు. న్యాయవవస్థ నుంచి, రాజకీయ వ్యవస్థల వరకూ అంతా ఆయనకు సుపరిచితులే. ‘తిరుపతి లడ్డు’ ఇచ్చినంత ఈజీగా.. వెంకన్న దర్శనం చేసుకున్నంత సులభంగా ఉంటుంది వారితో ఆయన అను‘బంధం’!

అందుకే.. అత్యంత నీతి నిజాయితీపరుడైన ధర్మారెడ్డి గారి సేవలు వెంకన్నకు అత్యవసరమని, జగనన్న కేంద్ర రక్షణశాఖమంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌కు లేఖ రాశారు. ఆయన తప్ప వెంకన్న భక్తైలను కంట్రోల్ చేసే మొనగాడు రాష్ట్రంలో ఎవరూ లేరని జగనన్న తన సిఫార్సులో లిఖించారు. ధర్మన్న డిఫెను సర్వీసు అధికారి కాబట్టి, ఆ డెప్యుటేషన్ ఫైల్‌పై ఆమోదముద్ర వేయాల్సింది రాజ్‌నాధ్‌సింగే మరి!

తమకున్న ఐఏఎస్ లంతా ఎన్నికల సేవల్లో బిజీగా ఉన్నందున, వెంకన్న సేవలో తరిస్తున్న ధర్మన్న సేవలు మరో రెండు నెలలు పొడిగించాలని, జగనన్న కేంద్రమంత్రికి ఉత్తరం ముక్క రాశారు. అంతే.. జగనన్న అడటం.. ధర్మన్న ఫైలు రెండోసారి క్లియరయిపోవడం, పంచకల్యాణి గుర్రం కూడా ఈర్ష్యపడేంత వాయువేగంతో జరిగిపోయింది.

తిరుమల దర్శనానికి వచ్చే సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు, గవర్నర్లు, ప్రధానులు, కేంద్రమంత్రులు, కేంద్రంలోని వివిధ శాఖల కార్యదర్శులు, ముఖ్యమంత్రులకు దగ్గరుండి మరీ వెంకన్న దర్శనం చేయించి, వారిని మెప్పించడంలో ధర్మారెడ్డి నిష్ణాతుడన్న పేరుంది. కాబట్టి ఒకరకంగా ‘అన్ని వ్యవ స్థలూ ఆయన చేతిలో ఉన్నట్లే’ లెక్క అన్నది మేథావుల ఉవాచ.

అందుకే జగనన్న కూడా ధర్మన్న పలుకుబడికి ముచ్చటపడి, ఆయనను ఏరికోరి ఏపీకి తెచ్చుకున్నారట. ఢిల్లీలో పనులు కావాలంటే, అందరితో చనువుగా ఉండే అధికారులు అవసరం. ధర్మన్నకు ఆ చొరవ ఎక్కువ మరి! ఆ మాటకొస్తే ఒక్క ధర్మన్నే కాదు. టీటీడీ జేఈఓలుగా పనిచేసిన వారంతా అతనికంటే ఘనులు ఆచంట మల్లన్నలే. వారి పలుకుబడి మామూలుగా ఉండదు. ధర్మన్న వారికంటే పవర్‌ఫుల్. అందుకే జగన్ననకు ధర్మన్నంటే మహా ఇష్టమట.

అసలు ధర్మారెడ్డిగారే కేంద్రంలోని పెద్దలతో జగనన్నకు లంగరు వేయించి.. ‘సుహృద్భావ వాతావరణం’ ఏర్పాటుచేశారని, ప్రతిపక్షాలు ఎప్పుడో తేల్చేశాయి. సీఐడీ పోలీసులు తనను అరెస్టు చేసి.. కంటోన్మెంట్ ఆసుపత్రికి తీసుకువెళ్లినప్పుడు, జగన్ కోసం ధర్మారెడ్డి అక్కడి డిఫెన్స్ అధికారులతో మాట్లాడి శ్రమదానం చేశారని ఎంపి రఘురామకృష్ణంరాజు బహిరంగంగా ఆరోపించారు.

నిజానికి ధర్మారెడ్డి డెప్యుటేషన్ ముగుస్తున్నందున, కోడ్‌కు ముందే ఆయన స్థానంలో మరొక ఐఏఎస్‌ను నియమించాల్సి ఉంది. కానీ జగన్‌కు కేంద్రంపై ఉన్న నమ్మకంతో ఆపని చేయకుండా, ధర్మారెడ్డి డెప్యుటేషన్‌ను పొడిగించాలని లేఖ రాయడం సాహసమే. అంటే ఢిల్లీతో జగన్ దత్తబంధం భార తీసిమెంట్ మాదిరిగా ఎంత బలంగా ఉందో మెడపై తల ఎవరికైనా అర్ధమవుతుంది. అదే టీటీడీకి.. కోడ్ ముందే ఇద్దరు జేఈఓలను ఆగమేఘాలపై నియమించిన జగన్ సర్కారు, ధర్మారెడ్డి అంశంలో నింపాదిగా ఉండ టానికి కారణం కూడా ఈ ‘దత్తబంధమే’నన్నది బహిరంగ రహస్యం!

అయితే ఒకవైపు ధర్మారెడ్డిని బదిలీ చేయాలని, ఆయన టీటీడీలో ఉంటే ఆ ప్రభావం ఎన్నికలపై పడుతుందని, స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందే శ్వరి ఈసీతోపాటు కేంద్రానికీ లేఖ రాశారు. మరోవైపు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి సైతం, ధర్మారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన పలుకుబడి-అధికారాన్ని వైసీపీ గెలుపు కోసం వినియోగిస్తున్నందున, ఆయనను బదిలీ చేయాలని ఈసీని కోరారు. అటు కూటమిలోని టీడీపీ-జనసేన కూడా ధర్మారెడ్డిని తప్పించాలని కోరాయి.

కోరింది కూటమి కాబట్టి.. ఇంకేముంది ధర్మన్న బదిలీ ఖాయమనుకున్నారు. అయినా విచిత్రంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మాత్రం.. ధర్మారెడ్డి డిప్యుటేషన్ పొడిగించాలన్న జగన్ అభ్యర్ధనను పెద్దమనసుతో మన్నించడమే విచిత్రం. ఇది బీజే పీ-జగన్ తెరచాటు బంధానికి నిదర్శనమన్న వ్యాఖ్యలు, రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఒకవైపు జగన్ పార్టీని ఓడించాలనే ధ్యేయంతో కూటమిలో చేరిన బీజేపీ.. అదే జగన్ రాసిన లేఖను ఎలా అమలుచేస్తుందో అర్ధం కావడంలేదని కూటమి నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

‘‘ జగన్‌కు అనుకూలంగా పనిచేస్తున్న డీజీపీ, సీఎస్‌లను బదిలీ చేయాలని మేం ఇప్పటికి కొన్ని డజన్ల సార్లు ఈసీని కోరాం. కానీ దాన్ని పక్కనపెట్టారు. అదే ధర్మారెడ్డి డెప్యుటేషన్ పొగిడించాలన్న జగన్ లేఖపై మాత్రం ఆగమేఘాలపై స్పందించి, ఆయనకు ఆనుకూలమైన నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల కూటమి శ్రేణుల్లో ఎలాంటి సంకేతాలు వెళతాయి? ఎన్డీఏ కూటమి ఉన్నప్పటికీ ఏపీలో జగన్ మాటనే కేంద్రంలో చెల్లుతుందన్న సంకేతాలు వెళితే, ప్రజలు కూటమికి ఓటేస్తారా? అసలు కూటమిలో బీజేపీకి టీడీపీ-జనసేన ఓట్లు బదిలీ అవుతాయా? ప్రభుత్వం వేరు-పార్టీ వేరని కేంద్ర బీజేపీ నాయకత్వం తప్పించుకునే కబుర్లు చెబితే ఎవరూ నమ్మరు’’ అని కూటమికి చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

ఇప్పటివరకూ జరుగుతున్న పరిణామాలు కూటమిలో కుంపటి రేపినట్టయింది. ఎన్డీఏలో చేరడం వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదన్న అసంతృప్తి, టీడీపీ-జనసేన వర్గాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అటు జనసేన కూడా తమ గుర్తును మరొకరికి కేటాయించిన తీరుపై రగిలిపోతోంది.

‘‘ఎన్నికల సమయంలో జగన్‌కు అనుకూలంగా ఉండే అధికారుల మార్పు, మాపై పోలీసుల బెదిరింపులు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయనే, మేం కూటమిలో టీడీపీని కూడా తీసుకువచ్చాం. కానీ ఇప్పుడు మాకు అనుకూల వాతావరణమేమీ లేదు. ఎన్నికల సంఘం గ్లాసు గుర్తును ఇతరులకూ కేటాయిస్తోంది. డీజీపీ,సీఎస్‌ను ఇంతవరకూ మార్చలేదు. ధర్మారెడ్డిని మార్చమంటే, ఆయన డెప్యుటేషన్ పొడిగించార ంటే బీజేపీతో జగన్ సంబంధాలు ఇంకా కొనసాగుతున్నాయని, మెడపై తల ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది. ఇక ఎన్డీయే కూటమి వల్ల ఏం ఉపయోగం’’ అని జనసేన సీనియర్ నేత ఒకరు ప్రశ్నించారు. ఇది బీజేపీకి ఓట్ల బదిలీపై అనుమానం రేపేలా కనిపిస్తోంది.

అయితే ఈ ప్రభావం బీజేపీ పోటీ చేస్తున్న నియోజకర్గాలపై కచ్చితంగా పడే ప్రమాదం కనిపిస్తోంది. ఎన్డీఏ తమకు చేయిచ్చి, జగన్ వైపు చూస్తుందన్న అసంతృప్తితో ఉన్న టీడీపీ-జనసేన నేతలు.. తమ ఓట్లు బదిలీ చేయించరన్న భయాందోళనతో ఉన్నట్లు తెలుస్తోంది.

కేవలం టీడీపీ-జనసేన బలాన్ని వాడుకుని ఎమ్మెల్యే-ఎంపీ సీట్లు సాధించాలన్న ఎత్తుగడతోనే, బీజేపీ కూటమిలో టీడీపీని తీసుకున్నట్లు ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తోంది. ఏపీలో బీజేపీకి వైసీపీ-టీడీపీ రెండూ కావాలికాబట్టే జగన్‌కు ఇబ్బందిలేకుండా వ్యవహరిస్తోందన్న వ్యాఖ్యలు క్షేత్రస్థాయిలో వినిపించడానికి ఇలాంటి సంఘటనలే కారణమన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.