సీఎం రేవంత్ అదే పనిచేస్తున్నారు..
కేసీఆర్ ముందు నీ అనుభవమెంత?
రాజకీయాల నుంచి తప్పుకో
మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య
హైదరాబాద్, మహానాడు : బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. రేవంత్ రెచ్చగొట్టే ప్రసంగాలు ప్రజలకు ఉపయోగపడవని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో తిట్లు, శాపనార్థాలు ప్రజల మద్దతు కోల్పోయిన తర్వాత మాట్లాడతారు. సీఎం రేవంత్ రెడ్డి సరిగ్గా అదే చేస్తున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ను రేవంత్ చచ్చిన పాము అంటున్నారు. 60 లక్షల మంది సభ్యత్వం ఉండి 1.85 శాతం ఓట్లతో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్ చచ్చిన పాము ఎట్లా అవుతుంది? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల్లో ఎన్ని అమలు చేశారు? పార్లమెంట్ ఎన్నికల రెఫరెండం అంటూనే తిట్ల దండకంతో ప్రజల విశ్వాసం కోల్పోతున్నారని, కాంగ్రెస్ పార్టీ మూడవ స్థానానికి పరిమితం అవుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో టీమ్ వర్క్, హోం వర్క్ రెండూ లేవని విమర్శించారు. కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డి అనుభవం ఎంత? అని ప్రశ్నించారు. ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాలని కోరారు.