ఫేక్‌ వీడియోల వెనుక ఎవరున్నారో రేవంత్‌ చెప్పాలి

కాంగ్రెస్‌ కార్యాలయం నుంచే వీడియోలు
రిజర్వేషన్లపై గత చరిత్ర తెలుసుకుని మాట్లాడు
బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌

హైదరాబాద్‌, మహానాడు : కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్‌ చేస్తున్న తప్పుడు ప్రచారంపై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ మండిపడ్డారు. జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని తెలిపారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ చేస్తున్న అవాస్తవ ప్రచారంలో ఆర్‌ఎస్‌ఎస్‌ను లాగడంపైనా ఫైరయ్యారు. దీనిపై ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ స్వయంగా తాము రాజ్యాంగ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని స్పష్టత ఇచ్చారని గుర్తుచేశారు. పదేళ్ల ప్రధాని మోదీ పాలనపై విమర్శలు చేసేందుకు అవకాశం లేక కాంగ్రెస్‌ సర్కార్‌ అబద్ధాలు చెప్పి బురదజల్లే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. రేవంత్‌ రెడ్డి సీఎం స్థాయికి తగ్గట్లు వ్యవహరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతో ఫేక్‌ వీడియోలు తయారు చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిపై రేవంత్‌ రెడ్డి ప్రధాని మోదీకి, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. నెహ్రూ నుంచి రాహుల్‌గాంధీ వరకు రాజ్యాంగం పట్ల వ్యవహరించిన తీరును రేవంత్‌ రెడ్డి గుర్తుచేసుకోవాలని హితవుపలికారు.

అమిత్‌షాపై మార్ఫింగ్‌ వీడియోలు చేస్తున్నారంటే దీని వెనుక ఎవరున్నారో రేవంత్‌ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. స్వయంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం నుండే ఈ వీడియోలు బయటకు వచ్చాయి. అంబేద్కర్‌ దూరదృష్టితో మతపరమైన రిజర్వేషన్లను రాజ్యాంగంలో పొందుపర్చలేదు. సామాజిక వివక్షకు గురైన ఎస్సీ, బీసీ, ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లు కొనసాగాలని ప్రతిపాదిస్తే దానికి కాంగ్రెస్‌ నాయకులు తూట్లు పొడిచారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ప్రయోగశాలగా మార్చి అనంతరాం కమిషన్‌ సూచనమేరకు సామాజికంగా వెనకబడ్డ ముస్లింలను బీసీలో చేర్చినప్పటికీ కూడా 2004, 2009లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీ-ఈ గ్రూపును క్రియేట్‌ చేసి 14 ముస్లిం సామాజికవర్గాలను చేర్చి 4 శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. ఎస్సీ, బీసీ, ఎస్టీలకు దక్కాల్సిన వాటాను ముస్లింలకు కల్పించడం మతపరమైన రిజర్వేషన్‌ కాదా? విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో బీసీలు నష్టపోతున్న విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ డ్రామాలు

స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఉంటే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దానిని కుదించి 18 శాతానికి తగ్గిస్తే నోరువిప్పని కాంగ్రెస్‌ ఇప్పుడు రిజర్వేషన్ల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు వ్యవహరించే తీరు అమాయక బీసీలను మోసం చేయడమేనన్నారు. కేటగిరి-2బీ కింద కర్ణాటకలో ముస్లింలను బీసీ జాబితాలో చేర్చారు. ఓటు బ్యాంకు రాజకీయాలు, మైనారిటీల బుజ్జగింపు చర్యలో భాగంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో ముస్లింలను బీసీ జాబితాలో చేర్చుతున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ చేసిన అవినీతిని కక్కిస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మెతకవైఖరి అవలంబిస్తున్నారు. ఓటుకు నోటు కేసు ముందుకు పోదు..కాళేశ్వరం ఫైళ్లు ముందుకు కదలవు. బీఆర్‌ఎస్‌ నాయకులు ఆమ్‌ ఆద్మీ పార్టీతో చేతులు కలిపి వాటా పంచుకున్నారు. రెండు పార్టీల నాయకులు శిక్ష అనుభ విస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని దోషిగా నిలబెట్టడానికి ప్రజలు ఓటు అనే అస్త్రాన్ని ఉపయోగించ బోతున్నారు. తెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలవబోతోంది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు పరాభవం తప్పదని స్పష్టం చేశారు.