నవసందేహాలకు సమాధానం చెప్పండి…జగన్‌

పీసీసీ చీఫ్‌ షర్మిలారెడ్డి లేఖ

కడప:  పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, క్రమశిక్షణా రాహిత్యంపై సీఎం జగన్మో హన్‌రెడ్డికి నవ సందేహాల పేరిట లేఖ రాశారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి మీరు వినోదం చూస్తున్నారు. రాష్ట్ర రాబడి పెంచుకోకుండా స్థిరాస్తుల కల్పన చేయకుండా సంక్షేమ పథకాల సాకు చూపి ఆర్థిక అరాచకత్వానికి పాల్పడ్డారు. కనీసం రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలకు ప్రజలు నోచుకోలేదు. ఉద్యోగులు ఒకటో తేదీన జీతాలు తీసుకోలేదు. కాంట్రాక్టర్లు సకాలంలో బిల్లులను కళ్ల చూడలేదు. ఇంతటి ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యం మున్నెన్నడూ లేదు. నిజంగా రాష్ట్ర ప్రజల సంక్షేమం మీద మీకు చిత్తశుద్ది ఉంటే ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యం వల్ల నలుగుతున్న ప్రజలు అడిగే ఈ సందేహా లను నివృత్తి చేయాలని కోరారు.

పన్నుల వాత…అప్పుల మోత

బ్రాండ్‌ ఇమేజ్‌ని గంగలో కలిపి, జనంపై ఓ వైపు పన్నుల వాత మరోవైపు అప్పుల మోత… 12 లక్షల కోట్ల రుణాలతో అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని అపకీర్తిపాలు చేసింది మీరు కాదా? రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో 2019-20లో 31.32 శాతంగా ఉన్న ప్రజా రుణాలు (పబ్లిక్‌ డెట్స్‌) 2022`23 ఆర్థిక సంవత్సరం నాటికి 33.32 శాతానికి పెరగటం మీ చలువ కాదా? 2020 నవంబరు నాటికే పరిమితిని మించి రాష్ట్రం అప్పులు తెచ్చుకుంటోంది, ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)తో పాటు ‘క్రిసిల్‌’ వంటి సంస్థలు హెచ్చరించినా పరిస్థితిని ఎందుకు చక్కదిద్దలేకపోయారు ? అన్నిటితో పాటు ఆస్తి పన్ను 45 శాతం పెంచారు. ఇంట్లో రోజూ పుట్టే చెత్తకు కూడా కొత్తగా పన్ను వేశారు. దేశంలో ఎక్కడా లేనట్టు పెట్రో ఉత్పత్తులపై మీ పన్ను కింద రూ.70 వేల కోట్లు అదనపు భారం మోపారు. ఇంకా ప్రజలు మిమ్మల్ని మళ్లీ ఎందుకు ఎన్నుకోవాలి?

నిధులను దారిమళ్లించిన మిమ్మల్ని ఎందుకు క్షమించాలి?

ఎక్కడా అప్పులు పుట్టని పరిస్థితి. కొత్త అప్పు తెస్తే తప్ప జీతాలివ్వలేని స్థితి. ఈ దయనీయస్థితి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించే మార్గం ఉంటుందా? రాష్ట్రంలో 70 శాతంగా ఉన్న పన్ను రాబడి కాక పన్నేతర రాబడిని ఏ మాత్రం పెంచుకోకుండా కేవలం అప్పులపైనే ఆధారపడటం, వివిధ పథకాల కింద కేంద్రం ఇచ్చే నిధులను కూడా అడ్డగోలుగా దారి మళ్లించి ఏ విధంగా గొప్ప పాలనో చెప్పగలరా? పంచాయతీ, మున్సిపల్‌ నిధులు రూ.12 వేల కోట్లు దారి మళ్లించడం రాజ్యాంగం 73, 74 సవరణల స్ఫూర్తికి విరుద్ధం కాదా? ఖజానాకు రావాల్సిన నిధులు కార్పొరేషన్లకు మళ్లించి ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని మించి అప్పులు తెచ్చి పుట్టబోయే పిల్లల నెత్తిన సైతం భారం మోపిన మిమ్మల్ని ప్రజలెందుకు క్షమించాలి? ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు లక్ష కోట్ల రూపాయల మేర దారిమళ్లించిన మిమ్మల్ని దళిత, గిరిజన బలహీన వర్గాలు ఎలా నమ్ముతారని మీరనుకుంటున్నారు? సరైన సమాచారం, సమగ్ర వివరాలతో ఈ నవసందేహా లను తీర్చిన తర్వాతనే రాష్ట్ర ప్రజానీకాన్ని ఓట్లు అడగాలి. అప్పటివరకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు.