రూ.9 లక్షల కోట్లు ఇస్తే…గాడిదగుడ్డు అంటారా?

బీజేపీని ఎదుర్కోలేక పిరికిపందల్లా తప్పుడు ప్రచారం
భాగ్యనగర జన సభలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, మహానాడు : భాగ్యనగరంలో శుక్రవారం జరిగిన జన సభలో ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 17కు 17 ఎంపీ సీట్లలో బీజేపీ పోటీ చేస్తోంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు రాజకీయంగా ఎదుర్కోలేక ప్రజల దృష్టి మరల్చేందుకు పిరికిపందల్లా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీల్లో ఏం అమలు చేశారో, ఎలా చేయబోతున్నారో చెప్పకుండా బీజేపీపై తప్పుడు ప్రచారంతో బురదజల్లుతున్నారు. వారిని చూసి ప్రజలు నవ్వు కుంటున్నారు. వారిని ప్రజలు నమ్మడం లేదు. రేవంత్‌ రెడ్డి, కేసీఆర్‌ సర్టిఫికెట్‌ తమకు అవసరం లేదని ప్రజలు చెబుతున్నారు. మోదీ లేని దేశాన్ని ప్రజలు ఊహించలేదు.

తెలంగాణ ప్రజలందరూ బీజేపీని ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణ అభివృద్ధికి నరేంద్ర మోదీ నాయక త్వంలో చిత్తశుద్ధితో పనిచేస్తాం. మాకు కావాల్సింది తెలంగాణ ప్రజల సర్టిఫికెట్‌ మాత్రమే. రేవంత్‌ ఏ సభకు వెళ్లినా తలపై గాడిదగుడ్డు పెట్టుకుని వెళుతున్నారు…సిగ్గుండాలి. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.9 లక్షల కోట్లకు పైగా నిధులు ఖర్చు చేస్తే దాన్ని గాడిద గుడ్డుతో పోలుస్తున్నాడు. మోదీ ప్రభుత్వం రైతులను ఆదుకునేలా మూడు విడతల్లో రైతుల అకౌంట్లలో జమ చేస్తోంది. అనేక రకాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే మిడి మిడి జ్ఞానంతో బీజేపీని విమర్శిస్తున్నారు. మే 13న ఎన్నికల్లో కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.