జిల్లాలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి
మరికొన్ని రోజులు 144 సెక్షన్ కొనసాగింపు
అల్లర్ల కారకులపై కేసులు నమోదు చేశాం
ఎస్పీ బిందు మాధవ్ వెల్లడి
నరసరావుపేట, మహానాడు : మాచర్ల పట్టణంలోని మాచర్ల రూరల్ సర్కిల్ పోలీస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడారు. పోలింగ్ రోజు, తర్వాత రోజున జిల్లాలోని కొన్ని స్టేషన్ల పరిధిలో అవాంఛనీయ ఘటనలు జరిగా యి. పోలీసులు కారకులైన వారిని గుర్తించి కేసులు పెట్టారు. ఘటనలు పునరావృతం కాకుండా మాచర్ల, నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, ఇతర ప్రాంతాలలో స్థానిక పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించాం. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించి కట్టుదిట్టంగా అమలు చేస్తూ పలు చోట్ల విస్తృత వాహన తనిఖీలు నిర్వహిస్తున్నాం.
శాంతి భద్రతలకు సంబంధించి ఎక్కడా ఎటువంటి సమస్య ఉత్పన్నమవకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాం. ప్రస్తుతం జిల్లాలో అన్ని చోట్ల ప్రశాంత వాతావర ణం నెలకొంది. పరిస్థితులు పోలీసుల అదుపులో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని పర్యవేక్షిస్తూ పోలీస్ అధికారులను అప్రమత్తం చేస్తున్నాం. ఇంకా కొన్నిరోజులు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఇప్పటివరకు మాచర్ల, నరసరావుపేట నియోజకవర్గాలలో జరిగిన అన్ని సంఘటనలకు సంబంధించి కేసులు నమోదు చేశాం. వీటిపై విచారణ చేస్తాం. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడే ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తీవ్రమైన చర్యలు ఉంటాయి. ప్రజలు సమన్వయం పాటించి ప్రశాంత వాతావరణానికి సహకరించాలని కోరారు.