సెల్‌ టవర్‌ ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం

సెల్‌ఫోన్‌ చోరీ చేశాడని నిందలు వేశారని మనస్థాపం
చాకచక్యంగా కిందకు దింపిన పోలీసు సిబ్బంది

కాకినాడ, మహానాడు : చేయని దొంగతనాన్ని తనపై మోపడంతో అవమానం భరించలేని ఓ యువకు డు సెల్‌టవర్‌ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి సిద్ధపడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆ యువకుడు ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన జిల్లా కేంద్రం కాకినాడలో జరిగింది. కాకినాడ జిల్లా చిత్రాడకు చెందిన ప్రదీప్‌కుమార్‌ను సెల్‌ఫోన్‌ దొంగతనం చేశావంటూ స్థానికులు నిందలు మోపా రు. ఆ అవమానాన్ని తట్టుకోలేక త్రీటౌన్‌ పరిధిలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీస్‌ టవర్‌పై ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసుకోబోయాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ కృష్ణ భగవాన్‌ ఆదేశాల మేరకు ఎస్సై ఎం.సాగర్‌బాబు ఆధ్వర్యంలో టవర్‌ దగ్గరకు చేరుకుని హామీ ఇచ్చి కానిస్టేబుల్‌ శ్రీనివాసరావు, సిబ్బంది సాయంతో కిందకు దింపారు. ప్రాణాలు కాపాడిన పోలీసులను స్థానికులు అభినందించారు.