బీజేపీకి అవయవదానం చేసింది కాంగ్రెస్ పార్టీనే
ఆ పార్టీ గెలుపు కోసమే ఓట్లు బదిలీ చేశారు
బీఆర్‌ఎస్ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవిప్రసాద్
హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో గురువారం బీఆర్‌ఎస్ నేతలు జి.దేవిప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, బీఆర్‌ఎస్‌పై ప్రేలాపనలు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి వాస్తవానికి ఓట్లు బదిలీ చేసింది సీఎం, మంత్రులు, విప్పులేనని తెలిపారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను దింపిందని పేర్కొన్నారు. సిద్దిపేటలో మా నేత హరీష్ రావు బీజేపీకి ఓట్లు బదిలీ చేశారని నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ సొంత గ్రామం కొండారెడ్డి పల్లిలో బీజేపీకే ఆధిక్యత వచ్చింది. అంటే రేవంతే బీజేపీకి ఓట్లు బదిలీ చేశారా? అని ప్రశ్నించారు. కొండంగల్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో 30 వేలకు పైగా మెజారిటీ తెచ్చుకున్న రేవంత్ ఈ ఎన్నికల్లో 22 వేలకు పడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ వస్తే మహబుబ్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే వారు. బీజేపీకి ఓట్లు బదిలీ చేసి అక్కడ డీకే అరుణను గెలిపించారు ..మంత్రులే బీజేపీకి అవ యవదానం చేశారని వ్యాఖ్యానించారు. మంత్రుల నియోజకవర్గాల్లో అప్పటికీ ఇప్పటికీ ఓట్లు తగ్గాయి. ఆరునెలల పాలనలో కాంగ్రెస్ విఫలమైంది. అందుకే 8 సీట్లకు పరిమితమైంది. ఎందుకు పోయాయో కాంగ్రెస్ సమీక్ష చేసుకోవాలని సూచించారు. సముద్ర కెరటం పడి లేచినట్టే బీఆర్‌ఎస్ పడుతుంది ..మళ్లీ లేస్తుందని, తమపై పిచ్చి ప్రేలాపనలు ఆపాలని హితవుపలికారు.
పాలన మీద దృష్టిసారించాలి
దేవిప్రసాద్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నపుడు 2014లో 11 సీట్లు, 2019లో 9 సీట్లు సాధించాం. కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇంతకన్నా ఎక్కువ సీట్లు సాధించింది. 8 సీట్లు సాధించి రేవంత్ రెడ్డి ఎగిరెగిరి మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు తక్కువ తెచ్చుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ బూడిద అయిందని రేవంత్ అధికార మదంతో మాట్లాడుతున్నారు. వెయ్యి మంది రేవంత్‌లు, వంద మంది మోదీలు వచ్చినా బీఆర్‌ఎస్‌ను ఏమీ చేయలేరని సమాధానమిచ్చారు. బీఆర్‌ఎస్ మీద శాపనార్థాలు పెట్టే బదులు పాలన మీద దృష్టి పెట్టాలని హితవుపలికారు. అమరవీరుల జాబితా కూడా సరిగా తయారు చేయని అసమర్థుడని ధ్వజమెత్తారు.