ఏక్‌ దిన్‌ కా సుల్తాన్‌ మిర్జా షంషేర్‌

ఒక్కరోజు మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా రికార్డ్‌
ఎన్నికల కోడ్‌ రోజు ఉదయం బాధ్యతలు..సాయంత్రానికి కోడ్‌

విజయవాడ: స్టేట్‌ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఉన్న షేక్‌ అసిఫ్‌కు విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి అభ్యర్థిగా జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయిం చారు. ఖాళీ అయిన అయన స్థానంలో ప్రకాశం జిల్లాలో పేరొందిన రాజకీయ నాయకులు, విద్యాసంస్థల ప్రముఖులు మిర్జా షంషేర్‌ అలీబేగ్‌ నియమితు లయ్యారు. వైసీపీ అధినేతల్లో ఒకరైన వైవీ సుబ్బారెడ్డి స్వయంగా రంగంలోకి దిగి ఆఘమేఘాల మీద జీవో పొందగలిగారు. అయన నియామకం ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చే రోజుకు ఒక్కరోజు ముందు జరిగింది. జీవో విడుదలైన
మరసటి రోజు అయన బాధ్యతలను స్వీకరించారు. సాయంత్రానికి ఎన్నికల కోడ్‌ వచ్చేసింది. కోడ్‌ అయ్యాక వైసీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చి మళ్లీ సీటులో కూర్చోవచ్చని ఆశపడ్డారు. ప్రభుత్వం మారడంతో నామినేటెడ్‌ పదవులలో ఉన్నోళ్లను దించేయాలని ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఉత్తర్వులు వెలువడటంతో మిర్జా ఆశ నెరవేరలేదు. కేవలం ఒక్కరోజు చైర్మన్‌గా రికార్డుల్లోకి ఎక్కారు.