ప్రజావసరాలకు అనుగుణంగా ఇసుక సరఫరా

గనులు, ఎక్సైజ్ శాఖలు పూర్తి స్థాయిలో ప్రక్షాళన
నూతన ఎక్సైజ్ విధాన రూపకల్పన
గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖలు కేటాయించడం ఒక గురుతర బాధ్యత
రాష్ట్ర గనులు, భూగర్బ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర

అమరావతి, జూన్ 24 : గత ఐదేళ్ల కాలంలో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురైన గనులు, ఎక్సైజ్ శాఖలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని రాష్ట్ర గనులు, భూగర్బ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన ఖనిజ సంపద వనరులను ప్రజా శ్రేయస్సు కోసం సద్వినియోగం చేస్తామన్నారు.

సోమవారం ఉదయం అమరావతిలోని రాష్ట్ర సచివాలయం మూడో బ్లాక్ మొదటి అంతస్తులో ఆయనకు కేటాయించిన ఛాంబరులో వేదపండితుల మంత్రోత్సారణల మధ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే 2022 వ సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉన్న ఓఎన్జీసి పెట్రోలియం మైనింగ్ లీజు పునరుద్ధరణ ఫైల్ పై తొలి సంతకం చేశారు. పెట్రోలియం, నేచురల్ గ్యాస్ నిబంధనలు 1959 ప్రకారం కొన్ని షరతులకు లోబడి 2040 సంవత్సరం వరకూ ఈ లైసెన్స్ పునరుద్ధరణ చేయడం జరుగుతుంది.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కూటమి ద్వారా రాష్ట్రంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన పరిపాలన అందజేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో నూతన ఎక్సైజ్ విధానాన్ని రూపకల్పన చేసి, మద్యం లావాదేవీలు, డిస్టిలరీల నుంచి మధ్యం పంపిణీ తదితర కార్యక్రమాలను అత్యంత పారదర్శకంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. అక్రమ ఇసుక రవాణాను నియంత్రించి, ప్రజావసరాల కనుగుణంగా ఇసుకను సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

అత్యంత కీలకమైన గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖలు తమకు కేటాయించడం ఒక గురుతర బాధ్యతగా భావిస్తూ, సమర్ధవంతంగా పని చేసి, వాటి ద్వారా రాష్ట్ర ఖజానాకు పెద్ద ఎత్తున ఆదాయం చేకూర్చడానికి శాయశక్తులా కృషి చేస్తానని ఆయన తెలిపారు. తమకు ఇటు వంటి కీలకమైన శాఖలు అప్పగించిన రాష్జ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, మచిలీపట్నం నియోజకవర్గ ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజలకు శిరసాభివందనాలు చేస్తున్నట్లు తెలిపారు.

నేడు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొల్లు రవీంద్ర ను రాష్ట్ర గృహ నిర్మాణ & సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గనుల శాఖ కార్యదర్శి డా. ఎన్. యువరాజ్, డైరక్టర్ మైన్స్ ప్రవీణ్ కుమార్, ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్, డైరెక్టర్ చేతన్ ఇతర అధికారులు, ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు.