-జీవీ ఆంజనేయులు
-సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన జీవీ, పల్నాడు ఎమ్మెల్యేలు
పల్నాడు అభివృద్ధికి అన్నివిధాల తోడ్పాటును అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును… అక్కడ కొన్ని ప్రాంతాలను అయిదేళ్లు రావణకాష్టంగా మార్చిన అరాచక శక్తులను ఉక్కుపాదంతో అణిచివేయాలని రాష్ట్ర డీజీపీకి విజ్ఞప్తి చేశారు ఆ జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు. సోమవారం రాష్ట్రమంత్రిమండలి తొలి సమావేశం, పలు కీలక నిర్ణయాలకు ఆమోదం నేపథ్యంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులంతా ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన జీవీ ఆంజనేయులు.. అధికారంలోకి రాగానే చేసిన తొలి 5 సంతకాలకు మంత్రివర్గం ఆమోదంతో ముఖ్యమంత్రి ప్రజలందరికీ నిజమైన తీపి కబురు చెప్పారని ఆనందం వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా పింఛన్లు రూ.4వేలు చేయడం, మూడు నెలల బకాయిలు కలిపి జులై 1వ తేదీన ఇంటికే రూ.7వేల పింఛను అందిస్తామన్న మాటను అదేస్ఫూర్తితో అమలు చేస్తోన్న ప్రభుత్వం, ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వాటి తోపాటు మిగిలిన నిర్ణయాలన్నింటికీ క్యాబినెట్ ఆమోదంతో హామీల అమలుకు మార్గం సుగమం అయిందని… ఇదేస్ఫూర్తితో అయిదేళ్లు ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగానే ముఖ్యమంత్రిని కలసినప్పుడు పల్నాడు ప్రాంత అభివృద్ధికి చేయూతనివ్వాలని, కీలకమైన వాటర్ గ్రిడ్, వరికెపూడిశెల ప్రాజెక్టులు పూర్తి విషయాన్నీ విన్నవించినట్లు తెలిపారు. అనంతరం డీజీపీని కలిసింది పల్నాడు జిల్లా ఎమ్మెల్యేల బృందం. అక్కడ నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ద్వారకా తిరుమలరావుకు శుభాకాంక్షలు తెలిపామని, ఎన్నికల అనంతరం హింస, తదనంతరం పరిస్థితి వివరించి తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు ఎమ్మెల్యే జీవీ. మరీముఖ్యంగా మైనింగ్, ఇసుక అక్రమ రవాణ, మద్యం అక్రమాలతో ప్రజల జీవితాల్లో చిచ్చుపెట్టిన ఏ ఒక్కర్ని వదిలిపెట్టొద్దని కోరామన్నారు జీవీ ఆంజనేయులు.