గిరిజన విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఏఎస్ఎమ్ ల సేవలు

గిరిజన మరియు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి

అమరావతి, జూన్ 25: రాష్ట్ర వ్యాప్తంగా నున్న 554 గిరిజన పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఏఎన్ఎమ్ ల సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు రాష్ట్ర గిరిజన మరియు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు.

గిరిజన పాఠశాలల్లో అనారోగ్యం, పోషక ఆహార లోపం సమస్యలు తలెత్తకుండా, తద్వారా విద్యార్థుల మరణాలు సంభవించకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. మంగళవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించిన తదుపరి పబ్లిసిటీ సెల్లో పాత్రికేయులతో మాట్లాడుతూ గిరిజనుల సమగ్రాభివృద్దికి తీసుకుంటున్న చర్యలను వివరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తొమ్మిది ఐ.టి.డి.ఏ.ల పరిధిలోని 554 గిరిజన పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకై ఏఎన్ఎమ్ లను డిప్యూట్ చేయడమే కాకుండా ప్రతి నెలా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఉండే ఈ విధానాన్ని గత ప్రభుత్వం నిలుపుదల చేసిన కారణంగా అనారోగ్యంతో, పోషకాహార లోపంతో పలువురు విద్యార్థులు మరణించడం జరిగిందన్నారు.

గిరిజన పాఠశాలల్లో అటు వంటి మరణాలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. గిరిజన పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు సాదించే లక్ష్యంతో విద్యార్థుల స్టడీ అవర్స్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉపాధ్యాయుల కొరత లేకుండా ఉండేందుకై త్వరలో నిర్వహించనున్న మెగా డిఎస్సీ ద్వారా 2,024 ఉపాధ్యాయులను గిరిజన పాఠశాలల్లో భర్తీ చేయనున్నట్లు ఆమె తెలిపారు.

ప్రత్యేకించి గిరిజన విద్యార్థినులు విద్యనభ్యసించే గిరిజన బాలికల పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయులను నియమించడం జరుగుతుందని, అంటెండర్లుగా కూడా మహిళలనే నియమించడం జరుగుతుందన్నారు. విద్యా భోధన, ఆహారం, భద్రత తదితర అంశాలపై ఫిర్యాదు చేసుకుంనేందుకు ప్రత్యేకంగా ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేస్తామని, ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచడమే కాకుండా ఇతర అధికారులతో ఆయా ఫిర్యాదులపై విచారణ జరిపించి తగుచర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ సేవలను పునరుద్దరిస్తామని, ప్రసవం అనంతరం తల్లీ, బిడ్డలను క్షేమంగా వారి ఇళ్లకు చేరుస్తామన్నారు. వాహనాల ద్వారా రేషన్ ను ఇంటి వద్దే పంపిణీ చేసే విధానం వల్ల గిరిజనులు ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం జరుగుచున్నదని, ప్రత్యేకించి గిరిజన ప్రాంతాల్లో 962 రేషన్ డిపోలు ఉన్నాయని, ఆ డిపోల ద్వారానే రేషన్ పంపిణీ చేసే విధానాన్ని అనుమతించే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామన్నారు.

జిసిసి పరిధిలో 16 పెట్రోల్ బంకులు, 12 గ్యాస్ డిపోలు మరియు 12 సూపర్ మార్కెట్లు ఉన్నాయని వాటిని అభివృద్ది పరుస్తామన్నారు. అరుకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉందని, దేశ, విదేశాల్లో అరుకు కాఫీ విక్రయాలను విస్తరింపచేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు ఆమె తెలిపారు. గంజాయి, డ్రగ్స్ విస్తృత వినియోగం పర్యవసాన ఫలితాలను గిరిజన మహిళలు, బాలికలే అనుభవిస్తున్నారని, ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా రానున్న వందరోజుల్లో గంజాయి, డ్రగ్స్ నిర్మూలకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

ఈ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందనే విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ప్రక్క రాష్ట్రాల నుండి ప్రత్యేకించి ఒడిస్సా నుండి ఎటు వంటి మాధక ద్రవ్యాలు రాష్ట్రంలోకి రాకుండా చెక్ పోస్టుల్లో పటిష్టమైన తనిఖీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. మాధక ద్రవ్యాల నిర్మూలన విషయంలో జిసిసి, పోలీస్, విజిలెన్సు వ్యవస్థలను కూడా అప్రమత్తం చేయనున్నట్లు ఆమె తెలిపారు.

గిరిజన ప్రాంతాల్లో ఎం.పి.డి.ఓ.ల ద్వారా కాకుండా ఐటిడిఏ ల ద్వారానే త్రాగునీటి పధకాల విస్తరణకు తగు చర్యలు చేపడతామన్నారు. పిటీజీలు నివశించే ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా గృహాల నిర్మాణానికి తగు చర్యలు తీసుకోనున్నట్లు ఆమె తెలిపారు.