అయ్యో పాపం పోలీసు…

కారులో విగతజీవిగా ఎస్సై నాగేశ్వరరావు

భీమవరం, మహానాడు :  కొద్ది రోజుల్లో రిటైర్మెంట్ అయ్యి ప్రశాంతంగా శేష జీవితం గడపాల్సిన ఆ పోలీసు అధికారి ఎవరూ లేని అనాధగా చనిపోవడం హృదయాల్ని కలచివేసింది. వివరాల్లోకి వెళితే… ఎన్టీఆర్ జిల్లాలో ఎస్సై గా పనిచేస్తున్న ఎ.నాగేశ్వరరావును ఎన్నికల బదిలీలలో భాగంగా భీమవరం బదిలీ చేశారు. మూడు నెలల్లోనే యదావిధిగా పాత స్థానాలకు వేస్తారని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఐదు నెలలు గడిచినా వీరిని పట్టించుకునే వారే లేరు. ఒక పక్క రిటైర్మెంట్ దగ్గర పడుతుంది. కుటుంబానికి దగ్గరగా ఉండి, పిల్లా పాపలతో సంతోషంగా గడపాల్సిన సమయం.. నిత్యం ఈ ఆలోచనలతో సతమతమవుతూ తన బాధను దిగమింగుకొని ఉద్యోగం చేస్తున్నాడు. మంగళవారం రాత్రి నైట్ రౌండ్స్ వెళ్లి ఇంటికి చేరుకున్నాడు…. తెల్లవారిన తర్వాత కూడా భర్త ఇంటికి రాకపోవడాన్ని గమనించిన భార్య ఉదయాన్నే తన తోటి ఉద్యోగులకు ఫోన్ చేసి సార్ ఎక్కడ ఉన్నారు ఇంకా ఇంటికి రాలేదు అని ఆరా తీసింది.

మేడం…  సార్ నాలుగు గంటలకే ఇంటికి వచ్చేశారు నేను మా ఇంటికి వచ్చేశాను అని చెప్పాడు. అన్ని చోట్లా వెతకగా తాను ఉంటున్న అపార్ట్మెంట్ లోని సెల్లార్ లో ఉన్న కారులో చనిపోయి ఉన్నాడు. ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు, పోలీసులు అయ్యో పాపం అంటూ బాధను వెలిబుచ్చారు.