ప్రభుత్వంపై వైసీపీ నేతల విమర్శలు సిగ్గుచేటు

ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు, మహానాడు: గుంటూరు చుట్టుగుంట సెంటర్లోని  రైతు బజార్లో సబ్సిడీపై కందిపప్పు, బియ్యం కేంద్రాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా గళ్ళా మాధవి మాట్లాడుతూ… చౌకధరలకే పేదలకు నిత్యావసర వస్తువులు  అందించడమే ధ్యేయంగా టీడీపీ పనిచేస్తుందని,పేదలకు కందిపప్పు బియ్యం సరఫరాలో ఇబ్బందులు లేకుండా నిత్యావసరాల సరుకులు అందుబాటులోకి తేవడం కోసం దుకాణం ప్రారంభించారు. కందిపప్పు – 160రూ,  బియ్యం రూ.  48/- లకు అందిస్తున్నట్లు తెలిపారు.

తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులు కావస్తున్నా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తహసీల్దార్ కార్యాలయంలో ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల ఫోటోలు ఏర్పాటు చేయకపోవటం శోచనీయమని,అధికారులు ఇంకా వైసీపీ మత్తులోనే ఉన్నారని, త్వరలోనే మత్తు వదిలి పనిచేస్తారని ఆశిస్తునట్లు ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు.

అలాగే ఉచిత ఇసుక విషయంలో వైసీపీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ప్రజల మీద మోపిన భారాలను “చంద్రబాబు నాయుడు” ఒక్కోటి సులభతరం చేస్తున్నారని, రెట్టించిన సంక్షేమంతో ప్రభుత్వం పాలన మొదలు పెట్టి ప్రజల నుండి మన్ననలు పొందుతుందన్న అక్కసుతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని, అయినా ఇసుకను దోచుకొని, అనేక మంది భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకు కారణమైన వైసీపీ నేతలు విమర్శలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఎద్దేవా చేశారు.