ఘనంగా విను’కొండ’ తిరునాళ్ళ

-పోటెత్తిన భక్త సందోహం
-ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే
-రామలింగేశ్వర ఆలయం, ఘాట్ రోడ్డు నిర్మాణం చేపడతాం.. ఎమ్మెల్యే జీవీ

వినుకొండ, మహానాడు: వినుకొండ పట్టణంలోని కొండపై వేంచేసియున్న గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి తిరుణాల మహోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. రామలింగేశ్వర స్వామి ఆలయం నిర్మాణంలో ఉండటం వలన తొలి ఏకాదశి పండుగ సందర్భంగా భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించేందుకు  కొండపై దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో బాల ఆలయం ఏర్పాటుచేసి గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు.

వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రత్యేక పూజలకు హాజరుకాగా, వారికి పేద పండితులు ఆశీర్వచనంతో ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే  స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు అభివాదం చేస్తూ ఆప్యాయంగా పలకరించారు. అమ్మ ఆశ్రమ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన అన్నదానం స్టాల్స్ ను  సందర్శించారు.

విశ్వహిందూ పరిషత్, పలు స్వచ్ఛంద సేవా సంస్థలు ఏర్పాటుచేసిన అన్నప్రసాదాలు, తాగునీటి కేంద్రాలు, వైద్య శిబిరాలను సందర్శించి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ రామలింగేశ్వర స్వామి ఆలయం, కొండ ఘాట్ రోడ్డు నిర్మాణ దశలో ఉన్నాయని, వాటిని పూర్తి చేసే బాధ్యత స్వామి వారు నాకు కల్పించడం భాగ్యమని, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ నిధులతో త్వరితగతిన దేవాలయం, కొండపైకి తారు రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు. ఆలయ నిర్మాణానికి నూతన కమిటీ, ఘాట్ రోడ్డు నిర్మాణానికి మొదట ప్రారంభించిన కమిటీ సభ్యుల భాగస్వామ్యం, ప్రజల సహాయ సహకారాలు ఆశీస్సులతో పూర్తి చేస్తామని తెలిపారు.

అలాగే రామలింగేశ్వర స్వామి దేవాలయానికి వచ్చే మెట్ల మార్గం తొలగించారని, త్వరలో మెట్ల నిర్మాణం చేపట్టి భక్తుల అభీష్టం మేరకు మెట్ల మార్గం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో పట్టణానికి శాశ్వతంగా తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు. గోదావరి పెన్నా నదుల అనుసంధానం వలన సాగర్ కుడి కాలువకు భవిష్యత్తులో సాగు, త్రాగునీరు సాగర్ కుడికాలువకు రావాలని భగవంతుని ప్రార్థించానన్నారు. అలాగే వినుకొండ ప్రాంతంతోపాటు, పల్నాడు జిల్లా అభివృద్ధి చెందాలని అందుకు దేవుడు తనకు మరింత శక్తిని ప్రసాదించాలని కోరినట్లు తెలిపారు.

హిమాలయ గురూజీ కొండపై అఖండ జ్యోతి కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు. వినుకొండ ప్రాంతం గొప్పగా అభివృద్ధి చెందేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని అందుకు వినుకొండ నియోజకవర్గ ప్రజలందరూ సహకారం అందించాలని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కోరారు. శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్న కొండపై భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాదాలు, త్రాగునీరు కేంద్రాలను ఏర్పాటుచేసి సేవలందించడం పట్ల తన సతీమణి ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతిని ఆయన అభినందించారు.

కొండపై వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు హెచ్చరించారు. రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద కొబ్బరికాయల వ్యాపారి అధిక ధరకు విక్రయిస్తుండగా ఎమ్మెల్యే జిబి ఆంజనేయులు సందర్శించి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొబ్బరికాయ 30-40 రూపాయలకు విక్రయించాలని ఆదేశాలిస్తే అధిక ధరలకు విక్రయించడం ఏమిటని దేవదాయ శాఖ అధికారులను ఆయన నిలదీశారు. భక్తుల వద్ద దోపిడీ చేస్తే సహించేది లేదని , నిర్ణయించిన ధరలకు విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులకు ఆదేశించారు.

మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ తొలి ఏకాదశి పండుగ అంటే ఊరంతా పండుగని, నేడు వినుకొండ రామలింగేశ్వర స్వామి తిరుణాలకు  ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో పునర్ వైభవం వచ్చిందన్నారు. త్వరలో ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట మహోత్సవం, ఘాట్ రోడ్డు తారు రోడ్డు నిర్మాణం ఎమ్మెల్యే సహకారంతో పూర్తవుతుందని తెలిపారు. తొలి ఏకాదశి, మొహరం పండుగలు ఒకే రోజు వచ్చినప్పటికీ వినుకొండలో హిందూ ముస్లింలు ఐక్యతతో  మతసామరస్యానికి నిదర్శనంగా పండుగలు జరుపుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నాయకులు ఉన్నారు.

హిందూ ముస్లిం ఐక్యతకు నిదర్శనం వినుకొండ ప్రజలని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కొనియాడారు. తొలి ఏకాదశి పండుగ, వినుకొండ రామలింగేశ్వర స్వామి తిరునాళ్ల మహోత్సవం, మొహరం పండుగ ఒకేరోజు వచ్చినప్పటికీ  ముస్లింలు హిందువులపై అభిమానం, గౌరవంతో ముస్లిం సోదరులు మొహరం పండుగను జరుపుకొని ఊరేగింపును రేపు గురువారం నిర్వహించుకునేలా నిర్ణయం తీసుకోవడానికి చూస్తే వినుకొండలో ముస్లింలు హిందువులకు మధ్య ఉన్న ఐక్యతకు అద్దం పడుతుందన్నారు. ముస్లిం సోదరులు తీసుకున్న నిర్ణయాన్ని ఎమ్మెల్యే అభినందించారు. జిల్లా జనసేన పార్టీ నాయకులు నిశ్శంకర శ్రీనివాసరావు,  బీజేపీ ఇంచార్జ్ యార్లగడ్డ లెనిన్, న్యాయవాదులు నలబోలు రామకోటేశ్వరరావు, పొట్లూరి సైదారావు, పీవీ సురేష్ బాబు, పఠాన్ ఆయుబ్ ఖాన్, మోటమర్రి నరసింహారావు, పలువురు పాల్గొన్నారు