కూటమి ప్రభుత్వం చొరవ చూపాలి
పిడుగురాళ్ల, మహానాడు: రైలు బండ్లను మా ఊళ్లలో ఆపండి మహాప్రభో.. అంటూ పల్నాడు ప్రాంతంలోని పలు మండలాల ప్రజలు నాయకులకు, అధికారులకు మొర పెట్టుకుంటున్నారు.
సికింద్రాబాద్ నుంచి రేపల్లె వెళ్లే ఒకప్పటి ప్యాసింజర్ బండి ఇప్పుడు రేపల్లె ఎక్స్ ప్రెస్ గా మారిన తర్వాత బెల్లంకొండ స్టాప్ ఎత్తివేశారు. దీంతో బెల్లంకొండ, రాజుపాలెం మండలాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సికింద్రాబాద్ నుంచి రేపల్లె వెళ్లే రేపల్లె రైలు బండిని బెల్లంకొండలో ఆపాలని సమీప మండలాల ప్రజలు కోరుతున్నారు.
డెల్టా ఎక్స్ ప్రెస్ రైలు బండిని బెల్లంకొండ, పిడుగురాళ్ల స్టాపులు ఎత్తివేయడంతో బెల్లంకొండ, రాజుపాలెం, పిడుగురాళ్ల, మాచవరం మండలాల ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. డెల్టా ఎక్స్ ప్రెస్ రైలుకు బెల్లంకొండ, పిడుగురాళ్ల స్టాపులను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.
అలాగే నారాయణాద్రి, విశాఖ, చెన్నై ఎక్స్ ప్రెస్ రైళ్ల కు పిడుగురాళ్ల స్టాపు ఎత్తివేయడంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇక్కడి ప్రయాణీకులను విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం, కేంద్ర మంత్రులు చొరవ తీసుకుని రైళ్లను పునరుద్ధరించాలని ప్రజలు మొర పెడుతున్నారు.