గోదావరికి గండి పడలేదు… తాత్కాలిక రహదారి మాత్రమే దెబ్బతింది
ప్రజల రక్షణ కోసం అన్ని ఏర్పాట్లు చేశాం
– కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్
అమలాపురం, మహానాడు: సామాజిక మాధ్యమాలు, ఎలక్ట్రానిక్ మీడియాలో గోదావరి నదికి గండి పడిందని వసున్న కథనాలలో ఎంత మాత్రం వాస్తవం లేదని, పుకార్లు నమ్మొద్దని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… కేవలం నది పాయలో ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారి మాత్రమే కొట్టుకుపోయిందని గోదావరి నది గట్టుకు ఎటువంటి గండి పడలేదని ఆయన పేర్కొన్నారు.
పి గన్నవరం మండలం బూరుగులంక రేవు లో లంక గ్రామాల ప్రజల రాకపోకల కోసం వశిష్ట నదిపాయలో తాత్కాలికంగా నిర్మించిన రహదారి గురువారం వరద నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఇది నది పాయలో ఇసుక, మట్టితో ఏర్పాటుచేసిన రహదారి కావున ప్రతి సంవత్సరం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి లక్ష క్యూసెక్కుల వరద నీరు కిందకు విడుదల చేసినప్పుడు ఆ తాత్కాలిక రహదారి కొట్టుకుపోవడం సర్వసాధారణం. ప్రతి సంవత్సరం ఊడిమూడిలంక, జి పెదపూడి లంక, అరిగెల వారి పేట బూరుగులంక గ్రామాల ప్రజలు రాకపోకలు వరదల సీజన్ తగ్గేవరకు పడవలపైనే సాగిస్తుంటారు.
ఈ సమస్యను పరిష్కరించడానికి వశిష్ట నదిపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు వచ్చే ఏడాది నాటికి పూర్తి కానున్నాయి. ఈ నాలుగు లంక గ్రామాల్లో అధికారిక లెక్కల ప్రకారం 2319 మంది ప్రజలు నివసిస్తున్నారు. తాత్కాలిక రహదారి కొట్టుకుపోవడంతో ఈ నాలుగు లంక గ్రామాల్లో నివసించే ప్రజల రాకపోకలకు 4 మెకనైజ్డ్ పడవలు, లైఫ్ జాకెట్లు ఏర్పాటు చేసినట్లు, ప్రజల భద్రతకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని సామాజిక మాధ్యమాలలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచురితమవుతున్న వార్తలను చూసి భయభ్రాంతులకు గురి కావద్దని జిల్లా కలెక్టర్ తెలిపారు.