కోట్లు కొల్లగొట్టారు!

వైకాపా పాలనలో అతిపెద్ద ‘చెత్త’ స్కామ్
విజిలెన్స్ విచారణ చేపట్టాలి
నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడి డిమాండ్

చిలకలూరిపేట, మహానాడు :  వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అతి పెద్ద చెత్త కుంభకోణంతో కోట్లు కొల్లగొట్టారని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. ఈ చెత్త కుంభకోణానికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చీఫ్ ఆపరేటింగ్ అధికారి ఎన్ కిరణ్ కుమార్ కి తెలియజేస్తూ ఫిర్యాదుతో కూడిన వినతిపత్రం గురువారం అందజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన భారీ చెత్త కుంభకోణం సూత్రధారుల పేర్లను ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, ధనుంజయ రెడ్డి, రాంకీ గ్రూప్ అధినేత ఎంపీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి ల పేర్లను ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కూడా స్వచ్ఛంద్ర సంస్థలో కోట్లు కొల్లగొట్టే స్కెచ్ జరుగుతుందని ఆయన ఆరోపించారు. వివరాల్లోకి వెళితే..

క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ పేరుతో గత ఐదేళ్లలో వివిధ కొనుగోలులో భారీగా నిధుల దుర్వినియోగం జరిగింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అస్మదీయ గుత్తేదారు సంస్థలకు స్వచ్ఛంద సంస్థ నిధులు అడ్డగోలుగా ధారపోశారు ట్రై సైకిళ్లు ఈ ఆటోల నుంచి డస్ట్ బిన్ల కొనుగోళ్ల వరకు అప్పుడే ప్రభుత్వ పెద్దలు సిఫారసు చేసిన సంస్థలకి అధికారులు కాంట్రాక్టులు కట్టబెట్టారు. 2014-19 లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇచ్చిన ధరల కంటే అధికంగా చెల్లించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలకు కొందరు స్వచ్ఛంద సంస్థలు అధికారులు కమిషన్లు కొట్టేశారు నాసిరకం ట్రై సైకిళ్లు కదలని ఈ ఆటోల ద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారు. లక్షల సంఖ్యలో కొన్నట్లు రికార్డుల్లో చూపిస్తున్న డస్ట్ బిన్లు ప్లాస్టిక్ బుట్టలు చాలా చోట్ల పంపిణీ కాలేదు గత ఐదేళ్లలో జరిగిన భారీ కొనుగోళ్లపై నూతనంగా అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విచారణ చేయిస్తే ఈ అవినీతి భాగవతం మొత్తం కూడా వెలుగులోకి వస్తుంది.

గ్రామాల్లో ఇళ్ల నుంచి తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించేందుకు 12 లీటర్ల సామర్థ్యం గల ప్లాస్టిక్ డస్ట్ బిన్లు ఒక్కొక్కటి జీఎస్టీ తో కలిపి 68 రూపాయలకి గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో స్వచ్ఛంద సంస్థ కొనుగోలు చేసింది వైకాపా ప్రభుత్వంలో 10 లీటర్ల సామర్థ్యం గల 30 లక్షల డస్ట్ బిన్లు ఒక్కొక్కటి 75 రూపాయల ధరకి కొని ఒక్కోదానిపై అదనంగా ఏడు రూపాయలు చొప్పున గుత్తేదారులకు చెల్లించి 2.10 కోట్ల నిధులకు అధికారులు టెండర్ పెట్టారు ప్లాస్టిక్ బుట్టల వ్యవహారాన్ని అధికారులు ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు చాలా గొప్యంగా ఉంచారు. టెండర్ ప్రక్రియ నుంచి గుత్తేదారు సంస్థల ఎంపిక డస్ట్ బిన్ల పంపిణీ వంటి వివరాలు ఆర్టీఐ ద్వారా కూడా ఇవ్వకుండా రకరకాల కారణాలతో కాలయాపన చేశారు.

వీధుల్లో సేకరించే చెత్తను డంపింగ్ యార్డులకు తరలించేందుకు 500 ట్రైసైకిళ్లు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కొక్కటి 23,750 ధరకు కొన్నారు అప్పట్లో జిల్లా యూనిట్ గా కలెక్టర్ల ఆధ్వర్యంలో వీటిని సేకరించి పంచాయతీలకు సరఫరా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇదే స్వచ్ఛంద సంస్థ రాష్ట్రం యూనిట్ గా దాదాపు 14000 ట్రై సైకిళ్లు కొని ఒక్కోదానికి 32,750 రూపాయలు చొప్పున చెల్లించింది. ఒక్కో సైకిల్ పై అదనంగా తొమ్మిది వేల రూపాయల చొప్పున 12.60 కోట్లు ఖర్చు చేసింది. స్వచ్ఛ్ ఆంధ్ర సంస్థలో కీలక స్థానంలోని అధికారి ఒకరు ఈ విషయంలో చక్రం తిప్పారు. తెదేపా ప్రభుత్వంలో సంస్థ ఆధ్వర్యంలో చేసే ప్రతి కొనుగోళ్లలోనూ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఎంఎస్ఎంఈ ప్రాధాన్యం ఇచ్చేవారు అప్పట్లో పంచాయితీలకు అందించిన డస్ట్ బిన్లు, ట్రైసైకిళ్లు ఎంఎస్ఎంఈ లు సరఫరా చేసినవే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ పెద్దలకు సంబంధించిన అస్మదీయ సంస్థలకు అధిక ధరలకు కాంట్రాక్టులు కట్టబెట్టారు.

అస్మదీయులకే కాంట్రాక్టులు

ప్రభుత్వ పెద్దల అస్మదీయ గుత్తేదారు సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టే విషయంలో స్వచ్ఛ ఆంధ్ర సంస్థ అధికారులు బరితెగించారు.టెండర్ల లో పాల్గొనే గుత్తేదారు సంస్థలకు అనుభవం,టర్నోవర్ భారీగా చూపించి చిన్న సంస్థలు దరిదాపులకు రాకుండా చేశారు. ఉదాహరణకు 30 లక్షల డస్ట్ బిన్ల సేకరణకు సంబంధించిన టెండర్లో పాల్గొనే సంస్థలు వార్షిక టర్నవర్ 100 కోట్ల రూపాయలు తప్పనిసరనే నిబంధన పెట్టారు. దీంతో ఎంఎస్ఎంఈలు అవకాశం కోల్పోయాయి.రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, మంగళగిరి మాజీ శాసన సభ్యులు ఆళ్ళ రామకృష్ణ రెడ్డి ముఖ్య అనుచరుడు జానీ సైదా సంస్థలు క్రితి ఇంజనీరింగ్ సర్వీసెస్, జానేశ్వర ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరు గల కంపెనీలకు డస్ట్ బిన్ల పంపిణీకి సంబందించిన టెండర్ కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో పురపరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న శ్రీలక్ష్మి అనే అధికారి కమిషన్లు కొట్టేసారన్నది ప్రధాన ఆరోపణ. డస్ట్ బిన్లు కూడా పూర్తిగా ప్రజలకు పంపిణీ చేయలేదని ఆరోపణలు ఉన్నాయి.

ఆటోలలోనూ భారీ కుంభకోణం

క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 21.18 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసి 36 పట్టణ స్థానిక సంస్థలకు సరఫరా చేసిన 516 ఈ ఆటోలలోనూ భారీ కుంభకోణం చోటుచేసుకుంది. ప్రభుత్వ పెద్దలు సిఫార్సు చేసిన కొన్ని సంస్థల ద్వారా తక్కువ ఆటో 4.5 లక్షలకు స్వచ్ఛంద సంస్థ కొన్నది. 2023 జూన్ 8న అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి జెండా ఊపి వీటిని ప్రారంభించారు.ఇవి స్టార్ట్అవని కారణంగా వేరే వాహనాల ద్వారా పుర నగరపాలక సంస్థలకు నగర పంచాయతీలకు చేరవేశారు. వీటిలో సగానికి పైగా రోడ్ల మీదకు రాకుండా షెడ్లకే పరిమితమయ్యాయి. చెత్త తరలింపునకు అనువు కాని ఆటోలను ప్రభుత్వం కొన్నదన్న విమర్శలు అప్పట్లోనే వచ్చాయి. బ్యాటరీలు పాడవటం చార్జింగ్ సరిగ్గా కాకపోవటం వంటి సమస్యలు తలెత్తాయి.ఈ వ్యవహారంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్వచ్ఛంద సంస్థ అధికారులకు భారీగా ముడుపులు ముట్టాయి అన్న ఆరోపణలు ఉన్నాయి.

పెండింగ్ బిల్లులు నేటికీ చెల్లించలేదు

స్వచ్ఛంధ్ర సంస్థ ద్వారా అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చేసిన వివిధ కొనుగోళ్లపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించి అనేక ఎంఎస్ఎంఈలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. వీరికి పెండింగ్ బిల్లులు చెల్లించకుండా తిప్పలు పెట్టింది. బాధితులు కొందరు అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు. ఇంకొందరు ఇప్పటికీ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలలకే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో డస్ట్ బిన్లు, ట్రై సైకిళ్లు కొనుగోళ్లపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అయినా అధికారులు అవినీతి జరిగినట్లు నిరూపించలేకపోయారు. అయినప్పటికీ స్వచ్ఛ ఆంధ్ర సంస్థలో తిష్టవేసి చక్రం తిప్పుతున్న సంస్థ ఎండి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి అధికారులు కొందరు పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఎంఎస్ఎంఈలను ఇప్పటికీ ఇబ్బంది పెడుతున్నారు.

భారీ చెత్త స్కామ్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ లో భాగంగా పాత చెత్తని బయో మైనింగ్ ప్రక్రియ ద్వారా 33% కేంద్ర ప్రభుత్వం నిధులతో రాష్ట్ర ప్రభుత్వం నగరపాలక సంస్థల నిధులతో ప్రాసెసింగ్ చేసి నగరపాలక సంస్థలకు అప్పగించాలి. 2022 జూలై నుంచి ఆగస్టు నెల వరకు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు పిలిచారు. ఈ టెండర్ల ప్రక్రియలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సంస్థకు సంబంధించిన అధికారులు, పురపరిపాలన శాఖ అధికారులు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అండతో అనుభవం, అర్హత లేని సంస్థలకు పొరుగు రాష్ట్రాల సంస్థలకు అప్పగించారు. జాయింట్ వెంచర్ల పేరుతో సిండికేట్ గా ఏర్పడి పాత చెత్తని నాన్ అమృత్ సిటీ కింద సుమారుగా 90 మున్సిపాలిటీలను 10 క్లస్టర్లుగా విభజించారు. తరుణి అసోసియేట్స్, అవినాష్ ఏజెన్సీస్, క్రితి ఇంజనీరింగ్ సర్వీసెస్, జానేశ్వర ఇంజనీరింగ్ ప్రైవేట్ సర్వీసెస్, సృష్టి కాంటెక్ ప్రైవేట్ లిమిటెడ్, సాగర్ మోటార్స్ లాతూర్, ఆకాంక్ష ఎంటర్ప్రైజెస్ వాళ్ల జాయింట్ వెంచర్లతో సిండికేట్ గా ఏర్పడ్డాయి. 65 మున్సిపాలిటీలు కృతి ఇంజనీరింగ్ సర్వీసెస్ మరియు జానేశ్వర ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలకు అప్పనంగా నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు అప్పగించారు. ఆ సంస్థలకు డమ్మీలుగా తరుణి అసోసియేట్స్, అవినాష్ ఏజెన్సీస్ సంస్థలకు 35 మున్సిపాలిటీలను అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అప్పగించారు.

అమృత్ సిటీలు వర్తించే లక్ష టన్నులు దాటిన 30 కార్పోరేషన్లలో నియమ నిబంధనలకు విరుద్ధంగా జానేశ్వర ఇంజనీరింగ్ సంస్థకు, కృతి ఇంజనీరింగ్ సర్వీసెస్ అనే సంస్థకు, తరుణి అసోసియేట్స్ కు టెండర్లు కట్టబెట్టారు. బయట రాష్ట్రాల నుండి వచ్చిన అనుభవం కలిగిన సంస్థలను పక్కనపెట్టి నామమాత్రంగా అతి తక్కువ మున్సిపాలిటీలను కేటాయిం చారు. టెండర్లు దక్కించుకున్న జ్ఞానేశ్వర ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థల్లో రెండు లక్షల 29 వేల టన్నుల చెత్తను ప్రాసెసింగ్ చేయకుండా సమీపంలోని దిగువన ఉన్నటువంటి గుంటలలోకి నెట్టివేసి పైన ఎర్రమట్టి కప్పి వేశారు. దీని తాలూకు 100% నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే, అప్పటి పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి ఒత్తిడితో నిధులు విడుదల చేశారు. శ్రీకాకుళం, ప్రొద్దుటూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంకా పలు మున్సిపాలిటీలలో ఇదే మాదిరిగా నిధులు విడుదల చేశారు. ప్రాసెసింగ్ లో భాగంగా వచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలను నిబంధనల ప్రకారం గా సిమెంట్ ఫ్యాక్టరీలకు పంపకుండా, విద్యుత్తు వినియోగ సంస్థలకు పంపకుండా తగలబెట్టారు. వాటికి సంబంధించిన రికార్డులను అధికారులు సంస్థలు మైంటైన్ చేయలేదు.

2024 సార్వత్రిక ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలోని ముఖ్య అధికారి ఆంజనేయ రెడ్డి ద్వారా శ్రీ లక్ష్మీ ఐఏఎస్ పై ఒత్తిడి తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేయించారు. మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన అధికారులు, గుత్తేదారు సంస్థలు, అప్పటి అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. గుత్తేదారులకు పెండింగ్ బిల్లులను నిలుపుదల చేసి విజిలెన్స్ విచారణకు ఆదేశించాలి. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.