పేదవాడి సొంతింటి కల తెలుగుదేశంతోనే సాధ్యం

-పేదల కలలపై నీళ్లు చల్లిన వైసీపీ 
-ఎన్డీఏ ప్రభుత్వంలో జర్నలిస్టులకు ఇళ్లు 
-ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి  నెట్టెం శ్రీరఘురామ్ 

జగ్గయ్యపేట, మహానాడు : పేదవాడి సొంతింటి కల తెలుగు దేశంతోనే సాధ్యమని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి  నెట్టెం శ్రీరఘురామ్ అన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే సరికి ప్రభుత్వ ఖజానాలో పైసా లేదు. ఏ శాఖలో చూసినా అప్పులే కనపడుతున్నాయి తప్ప ఆదాయ వనరులు ఏమి లేవు. బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే కీలకమైన ఐదు హామీలు అమలుకై ఐదు ఫైళ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేశారు. వేలాది మంది నిరుద్యోగులు, రైతులు, 65 లక్షల మంది పింఛనుదారులు, యువత, పేదలకు లబ్ధి చేకూరుతుంది. ఇలా ఇచ్చిన హామీలను ఒక్కక్కటిగా నెరవేర్చుకుంటూ పోతున్న ఎన్డీఏ సర్కారు ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. హౌసింగ్ ఫర్ ఆల్ అనే నినాదంతో చంద్రన్న ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.

పేదల కలలపై నీళ్లు చల్లిన వైసీపీ 
2014లో ప్రతీ పేదవాడికి ఇళ్లు కట్టించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పీఎంఏవై కింద కేంద్ర వాటా రూ.1.80 లక్షలతో పాటు రాష్ట్ర వాటాగా గ్రామీణ ప్రాంతాల వారికి రూ.50 వేలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.1 లక్ష సాయం అందించారు. తద్వారా 12 లక్షల మందికి లబ్ధి చేకూరింది. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పేదల కలలపై నీళ్లు పోసింది. పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి పట్టాలు మాత్రమే ఇస్తాం ఇళ్లు మీరే కట్టుకోవాలని మాట తప్పింది.

చిగురిస్తున్న పేదల ఆశలు 
కేంద్ర సాయం రూ.1.80 లక్షలు తప్ప పేదల ఇంటి నిర్మాణానికి గత ప్రభుత్వం ఇచ్చింది శూన్యం. ఒక్క పట్టణ ప్రాంత లబ్ధిదారులకు ఉపాధి హామీ పథకం కింద రూ.30 వేలు అందించి చేతులు  దులుపుకున్నారు.  దాంతోపాటు కేంద్ర గృహ నిర్మాణాల కోసం ఇచ్చిన రూ.5 వేల కోట్లను కూడా దారి మళ్లించారు. ఇళ్ళ స్థలాలకు పట్టణాల్లో 1.5 సెంటు. గ్రామాల్లో 2 సెంట్లు టీడీపీ ఇవ్వగా దాన్ని జగన్ రెడ్డి సెంటుకే దించాడు. తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడటంతో పేదల ఆశలు మరలా చిగురించాయి.

జర్నలిస్టులకు ఇళ్లు
పేదవాడి ఆశల మేరకే చంద్రబాబు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు లేని వారికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు అందజేయనున్నట్లు తెలిపారు. సొంత స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకోలేని వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయనుంది. పేద మధ్య తరగతి వారి కోసం రూ.4 లక్షలు ఇంటి నిర్మాణానికి అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 40% (రూ.1.50 లక్షలు) కాగా కేంద్ర ప్రభుత్వం వాటా 60%(రూ.2.50 లక్షలు) గా ఉంది. ఇళ్ల నిర్మాణంలో పేదలు ఇబ్బందులు పడకూడదనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకన్నారు. వాటితో పాటు జర్నలిస్టులకు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇవ్వనుంది.

మౌలిక వసతుల కల్పనకు కృషి 
గత ప్రభుత్వం హాయంలో ఇళ్ల పట్టా వచ్చి ఇళ్లు నిర్మించుకోలేని స్థితిలో ఉన్న వారికి పీఎంఏవై 2.0 పథకం వర్తించదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినా వారిని ఒప్పించే దిశగా చంద్రబాబు మంతనాలు చేస్తున్నారు. వాటితో పాటు కోర్టు వివాదం కారణంగా ఇళ్లు కట్టుకోలేకపోయిన అమరావతి, ఇతర ప్రాంతాల్లోని వారికి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటున్నాం. పీఎంఏవై-1.0 కింద పెండింగ్ లో ఉన్న ఇళ్లను వంద రోజుల్లో 1.25 ఇళ్లను, ఏడాదితో మొత్తంగా 8.25 లక్షల ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది.

కేంద్ర పథకాలను వినియోగించి రహదారులు, విద్యుత్, త్రాగు నీరు వంటి మౌలిక వసతులను దశల వారిగా పూర్తి చేస్తాం.గత ప్రభుత్వం పూర్తి చేయకుండా నిలిపివేసిన ఇళ్లను నిర్మాణాలను కూడా పూర్తి చేసి పేదలకు అందిస్తాం. గత ప్రభుత్వం మాదిరిగా రద్దు చేసే యోచనలో కూటమి ప్రభుత్వం లేదు. ఇది గత ప్రభుత్వం మాదిరిగా రాక్షస ప్రభుత్వం కాదు పేదల పక్షపాత ప్రభుత్వం అని రఘురామ్ పేర్కొన్నారు.