కృష్ణా, గోదావరి సంగం వద్ద హారతులు పున: ప్రారంభం

•అంతరాలయంలో శ్రీదుర్గమ్మ తల్లి వీడియోగ్రఫీ చేసిన వారిపై కఠిన చర్యలు
•రూ.113 కోట్ల సి.జి.ఎఫ్.నిధులతో 160 దేవాలయాల ఆధునీకరణ పనులు
•ధూప దీప నైవేద్యాలకై ప్రస్తుతం ఇచ్చే రూ.5 వేలను రూ.10 వేలకు పెంపు
•రెవిన్యూ సదస్సుల్లో దేవాదాయ భూములపై కూడా ఫిర్యాదులు స్వీకరిస్తారు
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

అమరావతి, ఆగస్టు 11 : గతంలో కృష్ణా, గోదావరి పవిత్ర సంగం వద్ద జరిగే జల హారతులను పున: ప్రారంబించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ, ధర్మాధాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ దుర్గమ్మ తల్లి అంతరాలయంలో వీడియోగ్రఫీ చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రూ.113 కోట్ల సి.జి.ఎఫ్.నిధులతో 160 దేవాలయాల ఆధునీకరణ పనులను చేపడుతున్నామన్నారు. ధూప దీప నైవేద్యాలకై ప్రస్తుతం ఇచ్చే రూ.5 వేలను రూ.10 వేలకు పెంపుచేస్తున్నామన్నారు.

రెవిన్యూ సదస్సుల్లో దేవాదాయ భూములపై కూడా ఫిర్యాదులు స్వీకరిస్తారని, రాష్ట్ర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవాదాయ భూముల పరిరక్షణకు సహకరించాలన ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర సచివాలయంలో వారికి కేటాయించిన ఛాంబరు ఆధునీకరణ అనంతరం వేదపండితుల మంత్రోచ్చారణ మద్య కుటుంబ సభ్యులతో ఆదివారం ఉదయం ఛాంబరులోకి ప్రవేశించారు.

రాష్ట్ర సచివాలయం రెండో బ్లాక్ లో ఆధునీకరించబడిన తమ ఛాంబరులో ప్రవేసించడానికి వచ్చిన ఆయనకు ఆ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ, ఇతర అధికారులు పుష్పగచ్చాలు అందజేస్తూ ఘనంగా స్వాగతం పలికారు. పండితుల వేదమంత్రాల మద్య ఛాంబరులో పూజ అనంతరం తమ సీటులో ఆసీనులై తదుపరి రెండు ముఖ్యమైన ఫైళ్లపై మంత్రి తొలి సంతకం చేశారు.

ఇందులో ఒకటి రూ.113 కోట్ల సి.జి.ఎఫ్. నిధులతో రాష్ట్రంలోని 160 దేవాలయాల ఆధునీకరణ పనులకు సంబందించినది కాగా, మరొకటి తూర్పుగోదావరి జిల్లా మండపేటలో నున్న శ్రీ అగస్తేశ్వర స్వామి దేవాలయాన్ని రూ 1.00 కోటి సి.జి.ఎఫ్. నిధులతో ఆధునీకరించే పనులకు సంబందించినది. ఈ 160 దేవాలయాల్లో 147 ప్రాధాన్యత దేవాలయాలు మైదాన ప్రాంతాల్లోవి కాగా మిగిలిన 13 దేవాలయాలు వెనుకబడిన మరియు గిరిజన ప్రాంతాలోనివిగా మంత్రి తెలిపారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సుపరిపాలన దిశగా తమ ప్రభుత్వం అడుగుల వేస్తున్నదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా, భక్తులకు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండే విధంగా, భగవంతుని ఆస్తులను పరిరక్షించే విధంగా ఎల్లప్పుడు సంసిద్దులుగా ఉండటమే తమ ప్రథమ బాధ్యత, కర్తవ్యం అన్నారు.

గత ప్రభుత్వ పాలనలలో తిరుమల నుండి ఉత్తరాంద్రలోని అరసవిల్లి వరకూ దేముని ఆస్తులను కూడా వదలని పరిస్థితులు అనేకం మీడియా ముఖంగా వెలువడిన పరిస్థితి అందరికీ తెలుసన్నారు. ఈ విషయంలో ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని చర్యలు చేపట్టాల్సిన గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. కానీ తామధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎటు వంటి ఆరోపణవచ్చినా సరే వెంటనే నివేదికలు తెప్పించుకుని బాద్యులైన వారిపై చర్యలు తీసుకుంటూ పాలనను ముందుకు తీసుకుపోవడం జరుగుచున్నదన్నారు. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలో రెండు ఆలయాలకు సంబందించి విచారణ జరిపించి, వచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా తప్పు జరిగినట్లు నిర్థారించుకుని, అందుకు బాధ్యులైన ఐదుగురు అధికారుల నుండి వివరణ తీసుకుని సస్పెండ్ చేయడం జరిగిందన్నారు.

సమగ్ర విచారణలో ఎటు వంటి తప్పులు జరుగలేదని రూఢీ అయితే వారిపైనున్న సస్పెన్షన్ను ఎత్తి వేసి తిరిగి వారిని విధుల్లోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. దేవాదాయ శాఖలో తప్పుచేసిన చిన్న అధికారులనే కాదు పెద్ద అధికారులను కూడా ఏ మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు. ఇందుకు తార్కాణం ఈ మద్య మీడియాలో ప్రతి నిత్యం వచ్చిన వార్తలను అనుసరించి దేవాదాయ శాఖలోని ఒక అధికారిణి సహాయంతో ప్రతి పక్షంలోని కొందరు ఎంప్పీలు, ప్రతి పక్షపార్టీ నాయకులు చేసి దురాగతాలపై విజిలెన్సు ఎంక్వరీ జరిపించడమే అన్నారు. విజిలెన్సు విచారణ సమయంలో ఆ అధికారిణిని సస్పెండ్ కూడా చేయడం జరిగిందన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టబోయేముందు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తదుపరి ఈ తిరుమల నుండే ప్రక్షాళన మొదలు పెడతాం అని చెప్పిన విధంగా దేవాదాయ శాఖ ప్రక్షాళనను కూడా తిరుమలే నుండే ప్రారంభించడం జరిగిందన్నారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ తెలుసుకున్న అంశాలు మరియు ప్రజాగళం, యువగళం కార్యక్రమంలో వచ్చిన వినతులకు అనుగుణంగా దేవాదాయ శాఖ తగు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.

రాష్ట్ర విభజన కారణంగా భద్రాచలం తెలంగాణా రాష్ట్రంలోని వెళ్లిన నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీరామనవమి ఉత్సవాల నిర్వహణకై కడప జిల్లాలోని ఒంటిమిట్టను ఎంపికచేసి, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆలయాలతో పాటే ఈ దేవాలయాన్ని కూడా అభివృద్ది పర్చడం జరుగుచున్నదన్నారు. రాష్ట్రంలో ఇంకా ఉన్నటు వంటి పుణ్యక్షేతాలను అన్నింటినీ పరిశీలించి, వాటి పవిత్రతకు ఎటు వంటి భంగం కలుగకుండా వారి అభివృద్ది చర్యలను దేవాదాయ శాఖ చేపడుతున్నట్లు తెలిపారు.

దేవాదాయ శాఖ అదీనంలో మొత్తం 27,105 దేవాలయాలు ఉన్నాయని, వీటిలో 6(ఎ) ఆలయాలు 236 ఉన్నట్లు మంత్రి తెలిపారు. అదే విధంగా ఈ శాఖ పరిధిలో మొత్తం 4,65,000 ఎకరాల భూమి ఉందని, ఆ భూమి ఏ మాత్రం అన్యాక్రాంతం కాకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. దేవాదాయ శాఖ పరిధిలో మొత్తం 20,839 మంది సిబ్బంది ఉన్నారని, వారిలో మత పరంగా 11,142 మంది, పాలనా పరంగా 9,697 మంది పనిచేస్తున్నారన్నారు. మొత్తం 1,234 ట్రస్టు బోర్డులు ఉన్నాయని, వీటిలో పలు కారణాల వల్ల కొన్ని ఖాళీగా ఉన్నాయని, మరో 462 నూత బోర్డులను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.

కృష్ణా, గోదావరి జలాల పవిత్ర సంగం వద్ద హారతులు పున: ప్రారంభం….
గతంలో తమ ప్రభుత్వ హయాంలో పట్టిసీమ ప్రాజక్టును పూర్తిచేసి కృష్ణా, గోదావరి జలాల పవిత్ర సంగం ఫెర్రీ ఘాట్ వద్ద హారతులు ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహించండ జరిగిందన్నారు. అయితే గత ప్రభుత్వం హారతులు ఇచ్చే పవిత్ర కార్యక్రమాన్ని నిలిపివేసిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాల మేరకు మళ్లీ ఆ హారతుల కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం పున:ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకై సోమవారం రాష్ట్ర సచివాలయంలో పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తదితరులతో కూడిన మంత్రుల బృందం సమావేశమై హారతులు ఇచ్చే కార్యక్రమంపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

అంతరాలయంలో శ్రీదుర్గమ్మ తల్లి వీడియోగ్రఫీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం….
ఈ నెల 7 వ తేదీన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ దుర్గమ్మతల్లి మూల విరాట్ ను ఒక వ్యక్తి వీడియోగ్రఫీ చేసినట్లు, సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు ఒక మీడియా చానల్లో ప్రసారం చేయడం జరిగిందన్నారు. సాధారణంగా ఏ ఆలయంలో అయినా అంతరాలయంలోని మూల విరాట్ ను అర్చకులు తప్ప మరెవ్వరూ తాకకూడదు, అంతరాలయంలోని వెళ్ల కూడదు అన్నారు. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ తీవ్రంగా పరిగణిస్తూ విచారణ జరిపించి నివేదికతో పాటు సీసీ ఫుట్టేజీలను విజయవాడలోని పోలీస్ కమిషనర్ కు తగు చర్యకై అందజేయడం జరిగిందన్నారు.

పోలీసులు ఈ విషయంలో విచారణ చేస్తున్నారని, అందుకు బాధ్యుడై వ్యక్తిని కూడా గుర్తించడం జరిగిందన్నారు. మీడియాలో చెప్పినట్లుగా వీడియోగ్రఫీతీసిన వ్యక్తి మహిళ కాదని, పురుషుడే అని నిర్థారించడం జరిగిందన్నారు. ఇటు వంటివి మరోసారి పునరావృతం కాకుండా పోలీస్ నివేదిక అందగానే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 27,105 దేవాలయాలు ఉన్నాయని, ఆ దేవాలయాల అంతరాలయంల్లోని మూల విరాట్ ను పిక్చరైజ్ చేయవద్దని, ఎవరూ తాకవద్దని విజ్ఞప్తి చేస్తూ అందుకు విరుద్దంగా ప్రవర్తించిన వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది మంత్రి హెచ్చరించారు.

ధూప దీప నైవేద్యాలకై ప్రస్తుతం ఇచ్చే రూ.5 వేలను రూ.10 వేలకు పెంపు….
దేవాదాయ శాఖ పరిధిలో 50 వేల లోపు ఆదాయం ఉన్న ఆలయాలకు గతంలో ప్రతి నెలా రూ.5 వేలు ఇస్తుంటే, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దాన్ని రూ.10 వేలకు పెంచుతూ ప్రతిపాదనలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపడం జరిగిందని, త్వరలోనే జి.ఓ. కూడా జారీచేయడం జరుగుతుందన్నారు. ఫలితంగా ప్రతి ఏడాది దాదాపు రూ.32 కోట్లు అదనపు భారం దేవాదాయ శాఖ మీద పడుతుందని అంచనా వేయడం జరిగిందన్నారు.

రెవిన్యూ సదస్సుల్లో దేవాదాయ భూములపై కూడా ఫిర్యాదులు స్వీకరిస్తాం….
రెవిన్యూ శాఖ పరంగా ప్రజలకు ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే లక్ష్యంతో రెవిన్యూ సదస్సులను ఆగస్టు 15 న ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అన్ని రెవిన్యూ గ్రామాల్లో ఈ సదస్సులను నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆద్వర్యంలో డివిజనల్, మండల, గ్రామ స్థాయి అధికారులతో నిర్వహించే ఈ రెవిన్యూ సదస్సులను పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయి నుండి ఒక ప్రత్యేక అధికారిని కూడా ప్రతి జిల్లాకు పంపడం జరుగుచున్నదన్నారు. ఈ రెవిన్యూ సదస్సుల్లో దేవాదాయ శాఖకు సంబందించిన భూములపై కూడా నివేదికలు, ఫిర్యాదులు అందితే వాటిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవాదాయ భూములు అన్యాక్రాంతం కాకుండా వాటి పరిరక్షణకు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ ఆజాద్, డిప్యుటీ కమిషనర్ రతన్ రాజు తదితర అధికారులతో పాటు పలువురు అనధికారులు, మంత్రి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.