మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు

తిరుమల: ఈ నెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు పలు సేవలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తెలిపింది. ఆగస్టు 14వ తేదీన అంకురార్పణ కారణంగా సహస్రదీపాలంకార సేవ, 15వ తేదీన తిరుప్పావడ, 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.

మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారని టీటీడీ అధికారులుచెప్పారు.

శ్రీవారి ఆలయంలో ఏడాది మొత్తం జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గాని తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వాటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.