– జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ ఎద్దేవా
విశాఖపట్నం, మహానాడు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు కార్పొరేటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో భాగంగా మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ వారిని విహార యాత్రలకు తిప్పుతున్నారని జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ఎవరెన్ని ఎత్తులు వేసినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో జిల్లా జనసేన కొత్త కార్యాలయం ఆదివారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి మూవీ డైరెక్టర్, జనసేన ఎమ్మెల్యే మెహర్ రమేష్ పాల్గొన్నారు. టీడీపీ, జనసేన నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పార్టీ కార్యాలయం ప్రారంభం అనంతరం జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడారు. జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభానికి టీడీపీ, బీజేపీ నేతలు కూడా రావడం సంతోషంగా ఉందని అన్నారు. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఎవరనేది రేపు ప్రకటించే అవకాశం ఉందని వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తరపున బరిలో నిలిచే అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి తీరుతామని అన్నారు. దువ్వాడ ఇష్యూపై స్పందిస్తూ.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కష్టాల్లో ఉన్నాడు.. ఆయనకు నా సానుభూతిని తెలుపుతున్నానని వంశీకృష్ణ అన్నారు.