రేషన్ బియ్యం అక్రమ రవాణాకి అడ్డుకట్ట

• కాకినాడ పోర్టులో చెక్ పోస్టు
• చెక్ పోస్టుల సమస్యల పరిష్కారానికి చర్యలు
• వారంలో అదనంగా మరో రెండు చెక్ పోస్టులు
• రోజుకి వెయ్యికి పైగా లారీలు పాస్ అయ్యే విధంగా ఏర్పాట్లు
• కాకినాడ యాంకరేజీ పోర్టును దుర్వినియోగం చేశారు
• ఒక కుటుంబం కోసం పోర్టు లేదు
• బియ్యం సీజ్ వ్యవహారంలో విచారణ సాగుతోంది
• బాధ్యులపై క్రిమినల్ చర్యలు.. 41ఏ నోటీసులు.. అరెస్టులు
• కాకినాడ కలెక్టరేట్ లో పోర్టు కార్మికులు, ట్రాన్స్ పోర్టర్లు, ఎగుమతిదారుల ప్రతినిధులతో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్

కాకినాడ, మహానాడు: కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాన్నిస్తున్నాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. కాకినాడ పోర్టులో అక్రమాలు ఆగాలి.. ఆపి తీరుతామన్నారు. అందుకు ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు. ఆ క్రమంలో పోర్టు మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ఇబ్బందులు కలగకుండా, పోర్టు కార్యకలాపాలకు ఆటంకాలు ఏర్పడకుండా చర్యలు ఉంటాయన్నారు. తక్షణం చెక్ పోస్టుల సంఖ్య పెంచుతామని హామీ ఇచ్చారు. కాకినాడ కలెక్టరేట్ లో పోర్టు కార్మికులు, ట్రాన్స్ పోర్టర్లు, ఎగుమతిదారుల ప్రతినిధులతో మంగళవారం సమావేశం అయ్యారు. కాకినాడ నగర శాసనసభ్యులు వనమాడి కొండబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టు కారణంగా ఎగుమతి ప్రక్రియలో జాప్యం జరుగుతోందని పోర్టు ప్రతినిధులు తెలిపారు.

ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా రాష్ట్రంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగింది. అందుకు కాకినాడ పోర్టు అడ్డాగా మారింది. ఆహార భద్రత చట్టం కింద రాష్ట్రవ్యాప్తంగా కోటీ 47 లక్షల రేషన్ కార్డుల ద్వారా ఉచితంగా బియ్యం సరఫరా చేస్తుంటే, ఆ బియ్యాన్ని 10 రూపాయిల లోపు ధరకు వినియోగదారుల నుంచి కొనుగోలు చేసి బ్రోకెన్ రైస్, బాయిల్ రైస్ పేరిట ఇతర దేశాలకు ఎగుమతి చేసి అమ్ముకుంటున్నారు.
కాకినాడ పోర్టు ఉన్నది ఒక కుటుంబం కోసం కాదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం. పోర్టు ద్వారా ఈ ప్రాంతానికి మంచి పెట్టుబడులు, పరిశ్రమలు రావాలి. తద్వారా కాకినాడ అభివృద్ధి జరగాలి. గత ప్రభుత్వంలో యాంకరేజీ పోర్టుని దుర్వినియోగం చేసి అధికారులు, మీడియా సంస్థలకు సైతం ప్రవేశం లేకుండా హుకుం జారీ చేశారు. జూన్ 28, 29 తేదీల్లో నిర్వహించిన తనిఖీల్లో 50 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేస్తే అందులో 26 వేల మెట్రిక్ టన్నులు పీడీఎస్ బియ్యంగా నిర్ధారించారు. ఈ వ్యవహారంపై శాఖాపరమైన విచారణ పూర్తికావచ్చింది. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటా. అక్రమాలకు కారకులైన వారికి 41ఏ నోటీసులు జారీ చేస్తాం. విచారణ పూర్తయ్యాక అరెస్టులు ఉంటాయి.

తనిఖీల విషయంలో వెనక్కి తగ్గం
బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు చెక్ పోస్టు ఏర్పాటు చేశాం. చెక్ పోస్టు ఏర్పాటు వల్ల చిన్నపాటి ఇబ్బందులు ఉన్నాయన్న విషయాన్ని పోర్టు మీద ఆధారపడి జీవించే స్టేక్ హోల్డర్స్ మా దృష్టికి తీసుకువచ్చారు. కొత్తగా ఒక పని ప్రారంభించినప్పుడు ఇబ్బందులు ఉంటాయి. వారం రోజుల్లో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యకలాపాలు సజావుగా సాగే విధంగా చర్యలు తీసుకుంటాం. రోజుకి వెయ్యి నుంచి 11 వందల లారీల ద్వారా బియ్యం సరఫరా చేసే విధంగా ఏర్పాట్లు చేస్తాం. వచ్చే సోమవారం నుంచి అదనంగా మరో రెండు చెక్ పోస్టుల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తాం. ఆధునిక పరికరాలు ఏర్పాటు చేసి సమయం వృథా కాకుండా చర్యలు తీసుకుంటాం. చెక్ పోస్టుల్లో సిబ్బంది సంఖ్యను కూడా వెంటనే పెంచుతాం. 12 నుంచి 14 మంది సిబ్బందిని అదనంగా నియమించి మూడు షిఫ్టుల ద్వారా 24 గంటలు చెక్ పోస్టు నడిచే ఏర్పాటు చేస్తాము. తనిఖీల విషయంలో మాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి లేదు.

ప్రభుత్వ నిబంధనల మేరకు బియ్యం రవాణా చేసుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటాం. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని రేషన్ బియ్యం నేరుగా పోర్టుకి తరలించే ఏర్పాట్లు చేసుకున్నారు. ఇది వ్యక్తిగత కక్ష సాధింపు కాదు. కాకినాడ పోర్టులో ఇలాంటి అక్రమాలు ఆగాలన్నదే మా ఉద్దేశం. ఎక్కడా హమాలీలకు నష్టం కలగకుండా చూస్తాం.. ప్రక్షాళణలో భాగంగా కొన్ని సందర్భాల్లో కొంత జాప్యం జరగవచ్చు ఆలోచనా విధానంలో మంచి పరిపాలన అందిరికి అందేలా చూడాలన్న ఉద్దేశంతో మేందుకు వెళ్తున్నాం. ప్రభుత్వపరంగా న్యాయబద్దంగా చేయాల్సినవి చేస్తాం. ఎవరి వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని అన్నారు.

పోర్టు చెక్ పోస్టు పనితీరు పరిశీలన
కలెక్టరేట్లో సమావేశం అనంతరం కాకినాడ పోర్టు బొంబాయి గేటు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టు పని తీరుని మనోహర్ పరిశీలించారు. లోడుతో వచ్చే వాహనాలను లోనికి అనుమతించే విధానం, బరువు కొలిచే విధానంతో పాటు బియ్యం శాంపిల్స్ సేకరణ తదితర అంశాలపై అధికారులను ఆరా తీశారు. చెక్ పోస్టు కారణంగా లారీల రవాణా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో అదనంగా మరో రెండు చెక్ పోస్టుల ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. వచ్చే సోమవారంలోపు మరో రెండు చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని ఆధికారులను ఆదేశించారు. మత్రితో పాటు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండీ వీరపాండ్యన్, కలెక్టర్ షాన్ మోహన్, పోర్టు అథారిటీ అధికారులు, రెవెన్యూ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.