పేద‌ల‌కు క‌డుపు నిండా భోజనం

– రూ. 5 కే టిఫిన్, లంచ్, డిన్న‌ర్
– 15న గుడివాడ‌లో సీఎం చంద్ర‌బాబు చేతుల మీదుగా అన్న క్యాంటీన్ లు ప్రారంభం
– ఆహారం స‌ర‌ఫ‌రా చేసే భారీ కిచెన్ మంత్రి పరిశీలన

అమ‌రావతి, మహానాడు: అధికారంలోకి వ‌స్తే అన్న క్యాంటీన్ ల‌ను తిరిగి ప్రారంభిస్తాం…ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌తిప‌క్ష నేత హోదాలో ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇచ్చిన హామీ…వంద రోజుల్లో అన్న క్యాంటీన్ లు ప్రారంభించాల‌ని మొద‌ట్లో టార్గెట్…కానీ అనుకున్న దానికంటే ముందుగానే కేవ‌లం రెండు నెలల్లోనే క్యాంటీన్ ల ప్రారంభం…పేద‌వాడి కోసం మేమున్నామంటూ కూట‌మి స‌ర్కార్ మ‌రోసారి నిరూపించుకుంటుంది…ఆగ‌స్ట్ 15 స్వాతంత్ర దినోత్స‌వం నాడు అన్న క్యాంటీన్ ల పునః ప్రారంభానికి ప్ర‌భుత్వం సిద్ద‌మ‌యింది…పేద‌ల‌కు ఐదు రూపాయిల‌కే క‌డుపునిండా అన్నం పెట్టాల‌నే ఎంతో ఉన్న‌త‌మైన ల‌క్ష్యంతో ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి, నాటి ముఖ్య‌మంత్రి అయిన చంద్ర‌బాబు అన్న క్యాంటీన్ ల‌ను ప్రారంభించారు.

2018, 2019 ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ నాలుగు కోట్ల 60 ల‌క్ష‌ల మందికి ఆహారం స‌ర‌ఫ‌రా చేసారు.. ఉద‌యం బ్రేక్ ఫాస్ట్, మ‌ధ్యాహ్నం భోజ‌నం, సాయంత్రం భోజ‌నం ఏదైనా గానీ కేవ‌లం ఐదు రూపాయిలు మాత్ర‌మే ల‌బ్ధిదారుల నుంచి వ‌సూలు చేసి మిగిలిన భారమంతా ప్ర‌భుత్వ‌మే భ‌రించింది. కానీ 2019 ఎన్నిక‌ల త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వం ఆగ‌స్ట్ ఒక‌టో తేదీ 2019 నుంచి అన్న క్యాంటీన్ల‌ను ర‌ద్దు చేసి పేద‌లకు కూడుకు దూరం చేసింది. ప్ర‌భుత్వం నిర్మించిన క్యాంటీన్ల భ‌వ‌నాల‌ను కూడా ఇత‌ర అవ‌స‌రాల‌కు ఉప‌యోగించుకుంది. దీంతో గ‌త ఐదేళ్ల‌లో పేద‌లు నానా ఇబ్బందులు ప‌డిన ప‌రిస్థితి ఉంది. ఈ ప‌రిస్థితి నుంచి పేద‌ల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించేలా తామున్నామంటూ ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీని నిల‌బెట్టుకుంటుంది.

ఆగ‌స్టు 15న వంద అన్న క్యాంటీన్లు ప్రారంభం: మంత్రి నారాయ‌ణ‌

అన్న క్యాంటీన్లు, ఆహార స‌ర‌ఫ‌రా వంటి అంశాల‌పై పుర‌పాల‌క, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ ఎప్ప‌టిక‌ప్పుడూ ప‌ర్య‌వేస్తూ వ‌చ్చారు. ఈనెల 15 నుంచి క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. త‌న‌కు వంద‌రోజుల్లో క్యాంటీన్లు ప్రారంభించాల‌ని సీఎం చంద్ర‌బాబు సూచించిన‌ప్ప‌టికీ దానికంటే ముందుగానే వేగంగా కార్య‌రూపం దాల్చేలా కీల‌క‌పాత్ర పోషించారు. అన్న క్యాంటీన్ల‌కు ఆహారం స‌ర‌ఫ‌రా టెండ‌ర్ల‌ను హ‌రేకృష్ణ మూవ్ మెంట్ సంస్థ ద‌క్కించుకుంది.

ఈ సంస్థ ఇప్ప‌టికే అక్ష‌య‌పాత్ర పేరుతో బ‌డిపిల్ల‌ల‌కు మ‌ధ్యాహ్న భోజ‌నం స‌ర‌ఫ‌రా చేస్తోంది. ఈ సంస్థ‌కు చెందిన భారీ కిచెన్ ను మంత్రి నారాయ‌ణ సంద‌ర్శించారు. మంగ‌ళ‌గిరి లోని తెనాలి రోడ్డులో ఉన్న హ‌రేకృష్ణ మూవ్ మెంట్ కు చెందిన భారీ కిచెన్ ను మంగళవారం ప‌రిశీలించారు. ఒకేసారి వేలాది మందికి అతి త‌క్కువ స‌మ‌యంలో ఆహారం వండి స‌ర‌ఫ‌రా చేసేలా కిచెన్ లో ఏర్పాట్లున్నాయి. ఎంతో ప‌రిశుభ్ర‌మైన వాతావ‌ర‌ణంలో అన్నం వండే విధానాన్ని, కూర‌గాయ‌లు త‌రిగే విధానం, కూర‌లు వండే విధానం, ప్యాకింగ్ ఎలా చేస్తార‌నే అంశాల‌ను నిర్వాహ‌కుల‌ను అడిగి తెలుసుకున్నారు. అన్నం వ‌డుకుతున్న భారీ పాత్ర‌లో అన్నాన్ని క‌లియ‌బెట్టారు మంత్రి. కూర‌గాయ‌లు క‌ట్ చేసే యంత్రంలో ట‌మోటాలు వేసి ఎలా ప‌నిచేస్తుంద‌నేది తెలుసుకున్నారు. ఆ త‌ర్వాత మీడియాతో మాట్లాడారు.

గ‌త టీడీపీ ప్ర‌భుత్వంలో దేశంలో ఎక్క‌డా లేని విధంగా అన్న క్యాంటీన్ల ద్వారా నాణ్య‌మైన‌,ప‌రిశుభ్ర‌మైన ఆహారం

స‌ర‌ఫ‌రా చేసాం.. ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ 4 కోట్ల 60 ల‌క్ష‌ల మందికి భోజ‌నాలు పెట్టాం.. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తూ గ‌త ప్ర‌భుత్వం అన్న క్యాంటీన్ల‌ను మూసివేసింద‌న్నారు మంత్రి నారాయ‌ణ‌… క్యాంటీన్ల భ‌వ‌నాల‌ను సైతం స్టోర్ లుగాను, స‌చివాల‌యాలుగా మార్చివేసింది. అధికారంలోకి వ‌స్తే అన్న క్యాంటీన్ల‌ను తిరిగి ప్రారంభిస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన రోజు చంద్ర‌బాబు చేసిన ఐదు సంత‌కాల్లో అన్న క్యాంటీన్ల ప్రారంభం కూడా ఒక‌టి. ఈ సంత‌కం ఆచ‌ర‌ణ దిశగా ముందుకెళ్తున్నాం. వంద‌ రోజుల్లో క్యాంటీన్లు ప్రారంభించాల‌ని సీఎం చెప్పిన విధంగా గ‌తంలో ఉన్న విధంగానే ఏర్పాట్లు చేసి ప్రారంభోత్స‌వాలు చేస్తున్నామ‌న్నారు. ఆగస్టు 15న కృష్ణా జిల్లా గుడివాడ‌లో మ‌ధ్యాహ్నం లంచ్ స‌మ‌యంలో ఈ క్యాంటీన్ల‌ను సీఎం ప్రారంభిస్తార‌న్నారు. ఆ మ‌రుస‌టి రోజు మిగిలిన 99 క్యాంటీన్ల‌ను స్థానిక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్ర‌జాప్ర‌తినిధులు ప్రారంభిస్తార‌ని అన్నారు. మిగిలిన 103 క్యాంటీన్ల‌ను సెప్టెంబ‌ర్ ఐదో తేదీన ప్రారంభిస్తామ‌న్నారు.

అన్న క్యాంటీన్ల‌కు ఆహారం స‌ర‌ఫ‌రా చేసే టెండ‌ర్ల‌ను హ‌రేకృష్ణ మూవ్ మెంట్ సంస్థ ద‌క్కించుకుంద‌ని చెప్పారు…గ‌త టీడీపీ ప్ర‌భుత్వంలోనే ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభించిన త‌ర్వాత వాటికి వ‌చ్చిన స్పంద‌న చూపి గ్రామీణ ప్రాంతాల్లో కూడా 152 క్యాంటీన్లు ప్రారంభించాల‌ని సీఎం చంద్ర‌బాబు నిర్ణ‌యించార‌ని,టెండ‌ర్లు పిలిచిన‌ప్ప‌టికీ… ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలు,ఎన్నిక‌లు రావ‌డంతో అమ‌ల్లోకి రాలేద‌న్నారు.

హ‌రేకృష్ణ మూవ్ మెంట్ కిచెన్ లాంటి కిచెన్ మ‌రెక్క‌డా లేద‌న్నారు. ఎంతో ప‌రిశుభ్ర వాతావ‌ర‌ణంలో ప్ర‌తిరోజూ ల‌క్ష మందికి ఆహారం స‌ర‌ఫ‌రా చేసే భారీ కిచెను ఏర్పాటు చేసిన సంస్థ‌ను అభినందిస్తున్న‌ట్టు మంత్రి తెలిపారు. కేవ‌లం మూడు గంట‌ల్లోనే ల‌క్ష‌మందికి ఆహారం సిద్దం చేసే భారీ కిచెన్ ఇంకెక్క‌డా లేద‌న్నారు. ఈ భారీ కిచెన్ ఏర్పాటుకు 22 కోట్లు ఖ‌ర్చ‌యింది. మ‌రోవైపు అన్న క్యాంటీన్ల కోసం భారీగా విరాళాలు ఇచ్చేందుకు ఎంతో మంది ముందుకొస్తున్నారు. ఈరోజు కూడా ఎస్ ఎల్ వీ గ్రూప్ శ్రీనివాస‌రాజు కోటి రూపాయిలు విరాళం ఇచ్చార‌ని చెప్పారు. అయితే అన్న క్యాంటీన్ల కోసం ప్ర‌త్యేకంగా కార్ప‌స్ ఫండ్ ఏర్పాటు చేసి అన్న క్యాంటీన్ చారిట‌బుల్ ట్ర‌స్ట్ ను ఏర్పాటు చేసిన‌ట్టు మంత్రి నారాయ‌ణ చెప్పారు.

పేద‌ల‌కు క‌డుపునిండా భోజ‌నం పెట్టే అన్న క్యాంటీన్ల కోసం విరాళాలు ఇవ్వాల‌నుకుంటే అన్న క్యాంటీన్స్, ఏసీ నెంబ‌ర్ 37818165097, చంద్ర‌మౌళి న‌గ‌ర్, గుంటూరు, ఐఎఫ్ ఎస్ సీ నెంబ‌ర్ SBIN0020540, అకౌంట్ కు పంపించ‌వ‌చ్చ‌ని సూచించారు.

జోగి ర‌మేష్ కుమారుడు అరెస్ట్ విష‌యంలో చ‌ట్ట ప్ర‌కార‌మే ముందురకు…

మాజీ మంత్రి జోగి ర‌మేష్ కుమారుడు రాజీవ్ అరెస్ట్ పై మంత్రి నారాయ‌ణ స్పందించారు. ఏ విష‌యంలోనైనా చ‌ట్ట‌బ‌ద్దంగా ముందుకెళ్లాల‌ని సీఎం చంద్ర‌బాబు కేబినెట్ లో చెప్పార‌న్నారు. వైసీపీ నాయ‌కులు గ‌తంలో చేసిన‌ట్టు ఎలాంటి అరాచ‌కాల‌కు పాల్ప‌డ‌వ‌ద్ద‌ని సూచించార‌ని తెలిపారు. మ‌న ప్ర‌భుత్వం ప్ర‌జాపాల‌న చేయాల‌ని, గ‌త ప్ర‌భుత్వం అస‌లు ప్ర‌జ‌ల్లోకి రాకుండా పాల‌న చేసింద‌ని సీఎం గ‌తంలోనే చెప్పార‌న్నారు…గ‌తంలో 36 మందిని ఈ ప్ర‌భుత్వం చంపేసింద‌ని అభాండాలు వేశారని, తీరా ఎఫ్ ఐ ఆర్ లు ఇవ్వాల‌ని సీఎం అడిగితే ముందుకు రాలేద‌న్నారు. బీసీల‌కు టీడీపీ ఎప్పుడూ అండ‌గా ఉంటుంద‌ని… త‌మ ప్ర‌భుత్వంలో ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని మంత్రి చెప్పారు.