– విద్యార్థిని మృతి, ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
అప్సిగూడ చౌరస్తా, మహానాడు: స్కూల్ ఆటోను టిప్పర్ ఢీకొన్న దుర్ఘటనలో విద్యార్థిని మృతి చెందగా, ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అప్సిగూడ చౌరస్తా వద్ద శనివారం ఉదయం ఏడు గంటల 50 నిమిషాలకు ఈ సంఘటన సంభవించింది. ఆర్టీసీ బస్సు వెనకాల ఉన్న ఆటోని… ఆటో వెనకాల నుండి టిప్పర్ లారీ ఢీకొట్టింది. దీంతో ఆటో.. ఆర్టీసీ బస్సు కిందికు చొచ్చుకుపోయి నుజ్జయింది. అటువైపుగా వెళ్తున్న స్థానికుల సమాచారంతో పోలీసులు హుటా హుటిన ప్రమాదస్థలానికి చేరుకొని, వెంటనే క్రేన్ సిబ్బంది సహాయంతో ఆటోను బస్సు కింద నుంచి బయటకు తీశారు.
విద్యార్థినితో పాటు డ్రైవర్ ను నాచారం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతి చెందిన విద్యార్థిని తార్నాకలో కిమితీ కాలానికి చెందిన సాత్వికగా గుర్తించారు. తను గౌతమ్ మోడల్ స్కూల్ లో పదో తరగతి చదువుతున్నట్టు తెలిసింది. ఆటో తార్నాక నుంచి హబ్సిగూడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, ఆటో డ్రైవర్ అత్యంత వేగంగా నడపడమే ప్రమాదాన్ని కారణమని పోలీసులు నిర్ధారించారు. కాగా, ఆటో డ్రైవర్ సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినట్టు స్థానికులు తెలిపారు. గౌతమ్ మోడల్ స్కూల్ యాజమాన్యానికి, స్వాత్విక తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం ఇచ్చి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.