వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆళ్ళ నాని రాజీనామా!

ఏలూరు, మహానాడు: మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ నాని వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ… తొలుత ఏలూరు జిల్లా అధ్యక్ష, ఇన్‌చార్జి పదవులకు ఇటీవల రాజీనామా చేశా.. అప్పుడు నేను పార్టీకి రాజీనామా చేయలేదు.. నా వ్యక్తిగత కారణాల వల్ల ఇప్పుడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నాను..

నిన్న జరిగిన పార్టీ కార్యాలయం కూల్చివేత విషయంలో కూడా ఎవరూ అపోహలు పడవద్దు.. ఆ పార్టీ కార్యాలయం ఎవరైతే లీజుకు ఇచ్చారో అతను అమెరికాలో ఉంటారు.. రవిచంద్ర అని మా మిత్రుడు. రాజకీయ పార్టీకి కార్యాలయం అంటే ఎవరూ ముందుకు రారు.. కానీ నా అభ్యర్థన మేరకు రెండేళ్ళ లీజు కోసం 2017 లో ఆ స్థలం తీసుకున్నాం.. ఆ తర్వాత దాంట్లోనే తాత్కాలిక నిర్మాణాలు చేపట్టాం. కానీ, గత ఏడాదిగా ఆ స్థలం తిరిగి ఇవ్వాలని, దాన్ని డెవలప్మెంట్ కి ఇచ్చుకుంటా అని స్థల యజమాని కోరారు. ఆ విషయం గత ఏడాది రీజినల్ కో – ఆర్డినేటర్ మిథున్ రెడ్డికి చెప్పాం. ఆయన ఎన్నికలకు మూడు నెలల ముందే ఆ స్థలం యజమానికి ఇచ్చేయాలని చెప్పారు. కానీ ఎన్నికల వేళ కార్యాలయం తీసివేయడం మంచి విధానం కాదని సమయం తీసుకున్నాం.

15 రోజుల క్రితమే స్థలాన్ని యజమానికి అప్పగించమని పార్టీ నాయకులు నిర్ణయించారు… ఈ నెల ఒకటోతేదీన ఆ స్థలాన్ని అప్పగించాం. 15వ తేదీ కార్యక్రమ నిర్వహణ కోసం స్థల యజమాని అనుమతి తీసుకుని కార్యక్రమాన్ని చేపట్టాం. అనంతరం ఆగస్టు 16 వ తేదీన స్థలాన్ని స్థల యజమాని పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకున్నారు.. ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదు… ప్రజలు, నాయకులు గమనించాలని కోరుతున్నాను.. గెలుపు, ఓటములకు అతీతంగా ఏలూరు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.. నా రాజీనామా కేవలం నా వ్యక్తిగతం మాత్రమే… ఇకపై వ్యక్తిగా అందరికీ అందుబాటులో ఉంటా..