కలకత్తాలో వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా
వైద్యులపై ఇలాంటి ఘటనలు జరగడం అత్యంత బాధాకరం, విచారకరం
నిందితులు ఎంతటి వారైనా అత్యంత కఠినంగా శిక్షించాలి
ఈ పాశవిక ఘటనకు బాధ్యులైన దోషులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సందేశం ఇవ్వాలి
ఐఎంఏ ప్రకటించిన వైద్య సేవల బంద్ కు ఎంపీ సంఘీభావం
వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కలకత్తా లోని ఆర్ జీకర్ మెడికల్ కాలేజీలో డ్యూటీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, న్యాయవ్యవస్థ కఠినంగా వ్యవహరించి నిందితులను అత్యంత కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
యువ మహిళా డాక్టర్ హత్యాచార ఘటన పై దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా తెలంగాణ ఐఎంఏ పిలుపు మేరకు హైదరాబాద్ ధర్నాచౌక్ లో జరిగిన నిరసనలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య ధర్నాను ఉద్దేశించి ప్రసంగించారు. విధినిర్వహణలో ఉన్న మహిళా డాక్టర్ ల రక్షణకు చట్టాలు తీసుకురావలసిన ఆవశ్యకతను ఎంపీ నొక్కి చెప్పారు.
ఆగస్టు 9న కలకత్తాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ లో డ్యూటీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన తీవ్రంగా కలిచివేసిందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు తెలిపారు. వైద్యుల పై ఇలాంటి ఘటనలు జరగడం అత్యంత అమానుషం అన్నారు. యావత్ దేశాన్ని కదిలించిన ఈ సంఘటనపై సిబిఐ నిష్పక్షపాతంగా పూర్తి స్థాయి విచారణ జరిపి నిందితులను అత్యంత కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
అత్యంత దారుణంగా పాశవికంగా వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడిన దోషులు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా వైద్యులపై జరిగే దాడుల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలనీ, దాడులకు పాల్పడే నిందితులకు కఠిన శిక్షలు అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ ప్రభుత్వ, ప్రయివేట్ మెడికల్ కళాశాలలు, అస్పత్రులలో భద్రతను పెంచి, వైద్యులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.