– మానవత్వాన్ని మంటకలిపిన కలప వ్యాపారి మస్తాన్ వలీ
నూజండ్ల, మహానాడు: తన వద్ద ఎప్పటికీ పని ఉంటుందని నమ్మించిన ఓ కలప వ్యాపారి వారిని అతని జిల్లాకు తీసుకువెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక తన మనుషులతో కూలీలను బందీలుగా చేశాడు. గొడ్డుచాకిరీ చేయించుకొని.. నెలకు రూ.3 వేలే ఇచ్చేవాడు. రోజంతా పని చేయించుకున్నా.. నిత్యావసర సరకులు సరిగా అందించేవాడు కాదు. దీంతో వారు గంజినీళ్లతోనే కడుపు నింపుకొనేవారు. అనారోగ్యానికి గురైనా ఆసుపత్రికి తీసుకెళ్లేవాడు కాదు. చివరికి వ్యాపారి నిర్వాకంతో నాలుగేళ్ళ పాప మృతిచెందింది. ఇలా మూడేళ్లు వ్యాపారి చెరలో నరకయాతన అనుభవించిన కూలీలకు పోలీసుల సాయంతో విముక్తి లభించింది.
పల్నాడు జిల్లా నూజండ్ల మండలం ఐనవోలుకు చెందిన కలప వ్యాపారి మస్తాన్ వలీ మూడేళ్ళ కిందట తన పొలంలో పనుల కోసం ప్రకాశం జిల్లా త్రిపురాంతకానికి చెందిన ఆరు కుటుంబాలను పనిలో పెట్టుకున్నాడు. వారందరూ యానాది సామాజిక వర్గానికి చెందినవారు. దాదాపు 25 మంది వరకు ఇతని వద్ద పనిచేస్తున్నారు. కలప నరికి.. ట్రాక్టర్లు, లారీల్లో లోడ్లు ఎక్కిస్తుంటారు. ఎండ, వాన అని తేడా లేకుండా పని చేయించుకొని.. ఒక్కొక్క కుటుంబానికి నెలకు రూ.3 వేలే చెల్లించేవాడు.
‘మా తమ్ముడి కుమార్తెకు నాలుగేళ్ళు ఉంటాయి. వారం పాటు జ్వరంతో బాధపడుతుంటే.. ఆసుపత్రికి తీసుకెళ్లాలని మస్తాన్ వలీని వేడుకున్నాం. చూపిస్తాలే అంటూ రోజులు దాటవేశాడు. ఓ రోజు మేమంతా పనికి వెళ్ళి వచ్చేసరికి చీమలు పట్టి చనిపోయింది. అయినా పూడ్చి పెట్టి వెంటనే పనికి రమ్మన్నాడు’ అని నాగలక్ష్మి అనే మహిళ విలపించింది. బాధితుల్లో 13 మంది చిన్నారులు ఉన్నారు. వీరంతా తిండి లేక, విద్యకు దూరమై దుర్భర జీవితం గడుపుతున్నారు. బాధితుల అవస్థలను గుర్తించిన యానాది సంఘ నాయకులు ఈ విషయాన్ని పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్ళారు.
ఎస్పీ ఆదేశాల మేరకు మస్తాన్ వలీని వినుకొండ గ్రామీణ పోలీసులు విచారించగా.. తన వద్ద వీరందరూ రూ.8 లక్షల అప్పు తీసుకున్నారని చెప్పాడు. కానీ, అందుకు తగ్గ ఆధారాలు చూపించలేదు. పోలీసులు అతణ్ని మందలించి వదిలేశారు. బాధితులు స్వస్థలాలకు వెళ్ళేలా ఏర్పాట్లు చేశారు.