– కౌన్సిల్ సమావేశంలో అధికారుల తీరుపై గళ్ళా మండిపాటు
గుంటూరు, మహానాడు: గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రజా సమస్యలపై గళమెత్తి అధికారుల తీరును నిరసించారు. ప్రధానంగా నియోజకవర్గంలో పారిశుద్ధ్య నిర్వహణ తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గళ్ళా మాధవి మాట్లాడుతూ….
రాష్ట్రంలోని వివిధ మున్సిపల్ కార్పొరేషన్ ల్లో ప్రజా సమస్యలపై, అభివృద్ధిపై చర్చలు జరుగుతుంటే గుంటూరు కార్పొరేషన్ లో మాత్రం పారిశుద్ధ్యంపై ప్రస్తావన చేయటం బాధాకరం. అధికారుల తీరు ఆక్షేపణీయం. ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అయిన అమరావతిలో భాగమైన గుంటూరు నగరంలో చెత్త, పారిశుద్ధ్య నిర్వహణ మాత్రం దారుణం.
కనీసం ఇంటి వద్ద చెత్త కూడా ఎత్తలేని పరిస్థితిలో ఉన్నారు మున్సిపల్ అధికారులు. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తున్నా.. ప్రధానంగా నాకు చెత్త సమస్య అధికంగా కనబడింది. ఈ విషయమై అధికారులను వద్ద ప్రస్తావిస్తే సరిపడా సిబ్బంది, యంత్రాలు లేవని సాకుగా చెప్పారు తప్ప దానికి సరైన పరిష్కార దిశగా అడుగులు ముందుకు వేయలేదు.
నియోజకవర్గంలో మంచినీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు.. సమస్యలను అధికారులను పరిష్కరించమని కోరితే ‘చేస్తాం… చూస్తాం’ అని సమాధానం ఇస్తున్నారు తప్ప ఎప్పటిలోగా చేస్తామని చెప్పటం లేదు. చిన్న సమస్యల పరిష్కారం కోసం ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా ప్రయోజనం లేదు. అనేక డివిజన్లో చెత్త వేయడానికి కూడా డబ్బాలు లేవు. అలాగే కాలువలో పేరుకుపోయిన మురికి తొలగించడానికి అనేక కారణాలు చెబుతున్నారు. ఇలా ప్రతి సమస్యకు కారణాలు చెబితే పరిష్కారం దొరకదు కాబట్టి ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన సిబ్బందిని నియమించుకొని పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలి.
స్ట్రీట్ లైట్ ల విషయంలో కూడా నిర్లక్ష్యం. పాడైపోయిన వాటిలో కొత్తవి పెట్టమని కోరినా ఫలితం లేదు. ఇళ్ళ మధ్య మున్సిపల్, ప్రైవేట్ స్థలాల్లో విపరీతంగా పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. ప్రైవేట్ స్థలాల యజమానులకు నోటీసులు ఇచ్చి, కఠిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇవి డంపింగ్ యార్డ్ మాదిరిగా తయారవుతాయని మేయర్, కమిషనర్ దృష్టికి తీసుకువస్తున్నానన్నారు.