కోల్‌కతా ఘటన తీవ్రంగా కలిచివేసింది..

– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

విజయవాడ, మహానాడు: కోల్‌కతాలో మెడికోపై జరిగిన దారుణమైన అత్యాచారం, హత్య.. మానవాళిపై ఒక తీవ్రమైన దాడి! ఒక మాయని మచ్చ. ఇది అత్యంత పాశవిక చర్య. అన్నివిధాలుగా ఖండించదగినదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆమె శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రోజులు గడిచిపోతున్నాయి.. కానీ కేసులో పురోగతి కనపడట్లేదు. మానవజాతి సిగ్గుపడే ఈ సంఘటనలో పూర్వాపరాలు బయటకు వస్తుంటే వెన్నులో వణుకు పుడుతోంది..

మనుషులుగా మనం ఎంత దిగజారిపోతున్నాం అనేది తలచుకుంటే సిగ్గువేస్తోంది. వైద్య సిబ్బంది అంటే మనకు దేవదూతలతో సమానం. మనల్ని రక్షించే వారినే సమాజంలో భక్షిస్తున్నామంటే, మనల్ని మనం మనుషులని ఎలా అనుకోవాలి? మన మానవత్వం అబద్దం, మోసం కాదా?

ఒక మహిళగా ఇది నన్ను తీవ్రంగా కలచివేసింది. ఒక ఆడపిల్ల తల్లిగా ఇది నాలో లోతైన భయం నింపింది. గత పదేళ్లుగా మహిళలపై అసంఖ్యాకమైన దారుణమైన దాడులు జరిగాయి.. అత్యాచారాలు, హత్యలు, వారి కుటుంబాలపై కూడా దాడి చేశారు. కుటుంబ సభ్యులు హత్యకు గురయ్యారు కూడా.. హత్రాస్‌ను గుర్తుతెచ్చుకోండి, అలాగే కుల్దీప్ సింగ్ సెంగార్‌, ఆశారాం, డేరా బాబా వంటి దారుణమైన నేరస్తులను గుర్తుతెచ్చుకోండి.. వీరికి ప్రభుత్వాల రక్షణ కూడా అందింది కదా. ఈ అత్యాచారాలు, హత్యల నుంచి మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు దోషులకు రక్షణ కవచంగా వ్యవహరిస్తూ, ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విచారకరం. రెండేళ్ళ కిందట అత్యాచార దోషులకు గుజరాత్‌లో పూలమాలలు వేసి స్వాగతం పలికారు. ఇంకా ఎంత దిగజారాలి?

నిర్భయ ఉదంతం తర్వాత, అప్పటి యూపీఏ ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టి, మహిళల భద్రతకు తగినన్ని నిధులు కేటాయించింది. అయితే గడిచిన పదేళ్ళను పరిశీలిస్తే, మహిళల భద్రతకు రూ. 7214 కోట్లు కేటాయించగా. కేవలం రూ. 5000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఒక మహిళగా, నిబద్ధత నిండిన కాంగ్రెస్ కార్యకర్తగా, ఈ సంఘటనలో బాధితురాలికి, ఆమె కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేయడంలో మా పార్టీ వైఖరిని పునరుద్ఘాటిస్తున్నాను. అలాగే అసలైన దోషులను తక్షణమే ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో విచారణ జరిపి, అత్యంత కఠినమైన శిక్షలు విధించాలని పట్టుబట్టుతున్నాం.

కేంద్ర ప్రభుత్వం, మమతా సర్కారు, వారి వారి రాజకీయ కుమ్ములాటలు పక్కన పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. వీటికి ఇది సమయం కాదని కాంగ్రెస్ విజ్ఞప్తి చేస్తోంది. మనం ముందు మనుషులుగా స్పందించి, బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలి.

వైద్యులు, యావత్ మెడికల్ సిబ్బందికి మేం ఎల్లపుడూ అండగా నిలుస్తాము. ఈ రోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చిన సమ్మెకు కాంగ్రెస్ పార్టీ తరపున బేషరతుగా మద్దత్తు ప్రకటిస్తున్నాం. వారి డిమాండ్లు తెలుసుకొని, వారి భయాలు పోగొట్టే దిశగా, మహిళల భద్రతా విషయంలో, దేశంలోని అన్ని ప్రభుత్వాలు కఠినాతి కఠినంగా వ్యవహరించాలని గట్టిగా కోరుతున్నాం.