ఆడు మగాడ్రా బుజ్జా!

-ముబారక్ ద్వారకా సాబ్ !
– శభాష్ డీజీపీ ద్వారకా తిరుమల రావు సార్
– థ్యాంక్యూ వెరీ మచ్ ..సెల్యూట్ సార్

ఒకప్పుడు చార్మినార్ వద్ద ఒక గూండాను రోడ్డులో కొట్టుకొంటూ తీసుకెళ్తుంటే.. అంకుశం అనే సినిమాకు బ్రహ్మరథం పట్టారు. కనిపించని నాలుగో సింహమేరా పోలీస్ అంటే.. అనే సాయికుమార్ డైలాగులకు థియేటర్లు కేకలతో దద్దరిల్లిపోయేవి.

అలాంటిది పొలిటికల్ క్రిమినల్స్‌కు కీలుబొమ్మలు అయ్యి, పోలీసింగ్ మరిచి, సింహాలు గా ఉండాల్సిన వారు, పుట్టినరోజులకు బొకేలతో వెళ్లి, స్టేజీల మీద డ్యాన్సులు కూడా చేస్తుంటే.. అకృత్యాల మీద రోడ్లలోకి రాకుండా ఇంటి గడపలోనే అణిచేస్తుంటే.. ఒక విధమైన అసహ్యం పుట్టింది సమాజంలో.

విశాఖ నడి వీధిలో గంజాయి బ్యాచ్ తన పెళ్లాంను, కుటుంబాన్ని అల్లరి చేస్తుంటే అడిగిన భర్తను అక్కడే కొట్టడం నుండి, మా అక్కను అల్లరి చేస్తారా అని అడిగిన అమర్నాథ్ గౌడ్‌ను సజీవ దహనం చేసిన ఘటనలను సమాజం భరించింది.

పోలీసు వ్యవస్థే ఇలా అయిపోతే.. మన మాన,ధన,ప్రాణ,ఆస్తులకు కు రక్షణ ఏది అనే ఆవేదన కలిగింది యావత్తు రాష్ట్రానికి. బాధితులు మరింత బాధపడేలా కేసులు పెడుతుంటే.. పోలీస్ స్టేషనుకు వెళితే మరింత నరకం అని కుటుంబాలతో సహా ఆత్మహత్యలు చేసుకొన్న ఘోర పరిస్థితులు చూసి, భయంతో మూగబోయిన ప్రజాస్వామ్యం, తమదైన రోజు తెలివిగా.. పదకొండు ముక్కలు అయ్యేలా ముక్కలు ముక్కలుగా కొట్టారు అరాచక పాలక వైకాపాను. అలాగే కొనసాగి ఉంటే అరాచకం ప్రబలి సమాజం కూడా ఆటవిక వ్యవస్థగా మారేది.

జనంతో పాటు స్వేచ్చ వచ్చిన మీ శాఖలో.. ఆ అరాచక వాదుల అవశేషాలను కనిపెట్టి, ఆ గౌరవ రక్షణ విధుల నుండి దూరం పెడుతూ ప్రధాన కార్యాలయానికి రిపోర్ట్ చేయమని ఆదేశాలు ఇస్తుంటే.. యావత్తు ఆంధ్రా ఆనందిస్తోంది. ఇప్పుడిప్పుడే పూర్వ గౌరవం, నమ్మకం కలుగుతోంది పోలీసు వ్యవస్థ మీద.

న్యాయం కోసం పోలీసు స్టేషనుకు సామాన్యుడు వచ్చే పరిస్థితుల కోసం జరుగుతున్న ఈ ప్రక్షాళనను చూసి ప్రజలు పట్టరాని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

డీజీపీ ద్వారకా తిరుమలరావు తీసుకున్న ఈ అసాధారణ నిర్ణయం చూసిన తర్వాత.. ఓ సినిమాలో తనికెళ్ల భరణి చెప్పిన, ఆడు మగాడ్రా బుజ్జా ..అన్న డైలాగు గుర్తుకురాక మానదు.

– సత్యం