– ఎమ్మెల్యే ప్రత్తిపాటి
చిలకలూరిపేట, మహానాడు: ఆర్థికంగా ఉన్న సమస్యలు తొలగించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, జవాబుదారీతనంలో రాష్ట్ర స్థానిక సంస్థలను ముందు వరుసలో నిలపడమే ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పమని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం విలేఖర్లతో మాట్లాడారు. గత వైకాపా ప్రభుత్వం దారి మళ్లించిన స్థానిక సంస్థలకు చెందిన రూ.1,452 కోట్లను ఇప్పుడు కూటమి ప్రభుత్వం విడుదల చేయడమే అందుకు నిదర్శనం అన్నారు. ఈ విధంగా పంచాయతీలు, మున్సిపాలిటీలకు నిధుల కొరత లేకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిదని, వాటి సాయంతో ప్రజల అవసరాలు, సమస్యలను తీర్చాల్సిన బాధ్యత మాత్రం స్థానిక సంస్థలపైనే ఉందన్నారు.
చిలకలూరిపేట మెయిన్ బజార్, కేబీ రోడ్డు, మార్కెట్ రోడ్డులోని మురుగు కాల్వలను ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. మురుగు కాల్వల్లో వ్యర్థాలు పేరుకుపోయి నీరు రహదారిపై పారుతుందని స్థానికులు ఆయన దృష్టికి తెచ్చారు. వర్షాలు కురిసినప్పుడు మురుగు కాల్వల్లో నీరు నిలిచి చాలా అసౌకర్యంగా ఉంటుందని చెప్పారు. మురుగు కాల్వల్లో తక్షణమే వ్యర్థాలను తొలగించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. కాల్వలపై ఉన్న ఆక్రమణలను కూడా తొలగించాలని, ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మార్కెట్ సెంటర్ పరిధిలో వాహనాల పార్కింగ్ స్థలం లేక రహదారిపైనే నిలుపుతున్నారని, దాంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. ఆ సమస్యపై కూడా దృష్టి సారించి పరిష్కరించాలని సూచించారు. అధికారులంతా గత ప్రభుత్వ వాసనల్ని పూర్తిగా వదిలించుకోవాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్న విషయాన్ని నిరంతరం దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని ఎమ్మెల్యే ప్రత్తిపాటి సూచించారు.