హైదరాబాద్, మహానాడు: తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సెక్రటేరియట్ ఆవరణను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. డిసెంబర్ 9న సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని గతంలో ముఖ్యమంత్రి ప్రకటించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి తెలంగాణ అధికార పీఠమైన సెక్రటేరియట్ సముచితమైన స్థానమని, అక్కడ తెలంగాణ తల్లిని సగర్వంగా, సగౌరవంగా ప్రతిష్ఠిస్తామని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. రాజీవ్ గాంధీ జయంతి వేడుకలలో మరోసారి తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించారు. ఇందులో భాగంగానే ఆవరణను మంగళవారం సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా విగ్రహ ఏర్పాటు స్థలం, ఏరియా డిజైన్ ప్రణాళికలపై అధికారులతో చర్చించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని సూచించారు. పూర్తి ప్రణాళికలు సిద్ధం చేయాలని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశింశారు.