– కేంద్ర మంత్రి మాండవీయకు తెలిపిన సీఎం రేవంత్
న్యూఢిల్లీ: జాతీయ, అంతర్జాతీయ క్రీడలు నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు తెలంగాణలో ఉన్నాయని కేంద్ర మంత్రి మాండవీయకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సీఎం కేంద్ర క్రీడా, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్‌సుఖ్ ఎల్ మాండవీయతో శుక్రవారం భేటీ అయ్యారు. సీఎంతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లోని స్టేడియాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈత కొలనులు, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలు, సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్స్, ఫుట్‌బాల్ గ్రౌండ్స్, స్కేటింగ్ ట్రాక్స్, వాటర్ స్పోర్ట్స్, ఇతర క్రీడలకు వసతులు ఉన్నాయన్నారు.
2002లో నేషనల్ గేమ్స్, 2003లో ఆఫ్రో-ఏషియన్ గేమ్స్, 2007లో ప్రపంచ మిలటరీ గేమ్స్ హైదరాబాద్‌లో నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాండవీయ దృష్టికి తీసుకువెళ్ళారు. భవిష్యత్‌లో ఒలింపిక్స్, ఆసియన్ గేమ్స్, కామన్‌వెల్త్ గేమ్స్ తెలంగాణలో నిర్వహించే అవకాశం ఇప్పించాలని కోరారు. 2025, జనవరిలో నిర్వహించే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కు హైదరాబాద్‌కు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో యువత క్రీడా నైపుణ్యాలవెలికితీసేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి మాండవీయకు తెలిపారు. స్పోర్ట్స్ యూనివర్సిటీల్లో క్రీడలకు సంబంధించిన అన్ని రకాల శిక్షణ, పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వనున్నామని, స్పోర్ట్స్ యూనివర్సిటీకి అవసరమైన ఆర్థిక సహాయం అందజేయాలని కోరారు.
రాష్ట్రంలో క్రీడా వసతుల అభివృద్ధికి ఖేలో ఇండియా పథకం కింద విడుదల చేసే నిధుల మొత్తాన్ని పెంచాలని, జీఎంసీ బాలయోగి స్టేడియం, షూటింగ్ రేంజ్, ఎల్ బీ స్టేడియం, హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం అప్‌గ్రెడేషన్ కు సమర్పించిన డీపీఆర్‌లను ఆమోదించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.