కూటమి విజయం… విజయమే కాదట!

  • ఈవీఎంలను మేనేజ్ చేస్తే వచ్చిన విజయమట!!
  • సాక్షి ఛానల్ లో కూర్చొని కొమ్మినేని వల్లించిన ప్రవచనం ఇది
  • వై నాట్ 175 అని మాట్లాడి, మాట్లాడి 11 స్థానాలకే పరిమితం కావడంతో జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ చిన్న మెదడు చితికినట్టు ఉంది
  • ఈవీఎంలను మేనేజ్ చేయగలిగితే బిజెపికి 240 స్థానాలే ఎందుకొస్తాయి?
  • తాము చేసిన మంచి పనులకు 360 స్థానాలు వస్తాయన్న బిజెపి నేతలు … ఈవీఎంలను మేనేజ్ చేయగలిగితే 380 స్థానాలను తెచ్చుకోలేరా??
  • 240 స్థానాలతో ప్రాంతీయ పార్టీలపై ఆధారపడే పరిస్థితిని ఎందుకు కొని తెచ్చుకుంటారు?
  • తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని నియోజకవర్గంలోకి అడుగుపెట్టనివ్వడం లేదన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవేదన చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు గా ఉంది
  • నాలుగేళ్ల పాటు దొంగ కేసులు పెట్టి సిట్టింగ్ ఎంపీ నైన నన్ను నియోజకవర్గంలోకి అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకున్నప్పుడు ఈ బుద్ది ఎక్కడకు పోయింది… జగన్మోహన్ రెడ్డి?
  • నేడు ప్రకాశం పంతులు 153 వ జయంతి… ఘనంగా నివాళులు అర్పించిన ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి సాధించిన విజయం విజయమే కాదట… ఈవీఎంలను మేనేజ్ చేస్తే వచ్చిన విజయమని సాక్షి ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కూర్చుని ప్రవచనాన్ని వల్లించడం విడ్డూరంగా ఉందని ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి సాధించిన విజయాన్ని జీర్ణించుకోలేక, గత రెండు రోజుల క్రితం సాక్షి ఛానల్ కొమ్మినేని శ్రీనివాసరావు తనతో పాటు , మరో ఇద్దరు వ్యక్తులను కూర్చోబెట్టుకొని ఈ రకమైన మతిలేని వాదనను చేశారని విరుచుకుపడ్డారు. వై నాట్ 175 అని మాట్లాడి, మాట్లాడి 11 స్థానాలకే పరిమితం కావడంతో జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ కు మొత్తానికి చిన్న మెదడు చితికినట్టు ఉందని విమర్శించారు. తమ దారుణ పరాజయాన్ని తట్టుకోలేక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు.

శుక్రవారం నాడు రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఈవీఎం మిషిన్లను మేనేజ్ చేసుకోగలిగితే, బిజెపికి 240 స్థానాలు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. 360 స్థానాలలో గెలుస్తామని వారు ధీమా వ్యక్తం చేశారని గుర్తు చేశారు. మంచి పనులు చేశారు కాబట్టి 360 స్థానాలు వస్తాయని బిజెపి నాయకులు భావించినా , ప్రజలు వారికి 240 స్థానాలు ఇచ్చారన్నారు. ఈవీఎంలను మేనేజ్ చేయగలిగితే 360 స్థానాలలో గెలుస్తామని చెప్పిన బిజెపి నాయకులు, ఈవీఎంలను మేనేజ్ చేయగలిగితే 380 స్థానాలను తెచ్చుకుంటారు కదా? అని ఎదురు ప్రశ్నించారు. ప్రాంతీయ పార్టీలపై ఆధారపడే పరిస్థితిని ఎందుకు తెచ్చుకుంటారని నిలదీశారు. ఈ తరహా అర్థం, పర్ధం లేని మాటలను జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఇప్పటికైనా మాట్లాడడం మానేస్తే మంచిదని హితవు పలికారు. వైకాపాకు 151 సీట్లు వచ్చినప్పుడు అది వారి గొప్ప, కూటమికి 164 సీట్లతో గెలిస్తే మాత్రం ఈవీఎంల గొప్ప అన్నట్లు మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ తరహా అర్థం పర్ధం లేని సంధి ప్రేలాపనలతో ముందుగానే చేసుకున్న మ్యాచ్ ఫిక్సింగ్ ప్రకారం ఒక బుద్ధిలేనివాడు, ఇద్దరు బుద్ధిలేని వ్యక్తులతో మాట్లాడించారన్నారు.

ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలోకి రఘురామకృష్ణం రాజును అసలు ప్రజలు రానివ్వలేదని, ఎన్నికల్లో ఆయన ప్రచారం కూడా సరిగ్గా నిర్వహించలేదని, అయినా అటువంటి వ్యక్తికి 45 వేల మెజారిటీ ఎలా వచ్చిందని ఆ బుద్ధిలేని వ్యక్తులు ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల్లో నాకు 57 వేల పైచిలుకు మెజారిటీ వచ్చిందని… ఈ పిచ్చి వెధవలకు తెలియదేమో, ఈ ఏడాది జనవరి 13వ తేదీన నాలుగేళ్ల తర్వాత నా నియోజకవర్గం లో నేను అడుగుపెడితే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రాజమండ్రి ఎయిర్పోర్టులో విమానం దిగిన తర్వాత నా ఇంటికి చేరుకోవడానికి, మీ పార్టీకి వచ్చినన్ని సీట్లన్ని గంటల సమయం పట్టిందని ఎద్దేవా చేశారు. నేను విమానం దిగిన తర్వాత ఇంటికి చేరుకునే వరకు ప్రతి నిమిషం రికార్డెడ్ ఎవిడెన్స్ ఉందన్న ఆయన, సెక్యూరిటీ కోణం లో భాగంగా నేనే రెండు మూడు కెమెరాలుకు షూట్ చేయించానని తెలిపారు.

రాజమండ్రి నుండి మా ఇంటికి వెళ్లే దారిలో ప్రతి జంక్షన్ ప్రజలతో జామ్ అయింది. వెయ్యి కి పైగా వాహనాలు నా వెంట రావడంతో, ట్రాఫిక్ డైవర్టు పేరిట 30 నుంచి 50 వాహనాలను వేరు, వేరుగా విడగొట్టాలని చూశారన్నారు. పార్టీలకతీతంగా ప్రజలు నా వెంట కలిసి నడిచారు. 24 గంటల ముందు నేను నియోజకవర్గానికి వస్తున్నానని ప్రకటించగానే, తెదేపా, జనసేన, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు. అప్పటికి తెదేపా, జనసేన మధ్య మాత్రమే పొత్తు ఉంది. బిజెపితో తెదేపాకు పొత్తు లేదు. అయినప్పటికీ పార్టీలకతీతంగా, పాలక పక్షంలో ఉంటూ ప్రతిపక్ష నాయకుడిలా పోరాడుతున్న నాకు ప్రజలు వెన్నుదన్నుగా నిలిచారు. ఈ ఏడాది జనవరి 13వ తేదీన నా నియోజకవర్గ పర్యటనకు సంబంధించిన విజువల్స్ అన్నీ చానల్స్ లలో ప్రసారమయ్యాయి. ఆ విజువల్స్ కొమ్మినేని శ్రీనివాసరావు చూడడంతో పాటు, జగన్మోహన్ రెడ్డికి కూడా చూపించాలన్నారు. మీరు గుడ్డివాళ్లు అయినంత మాత్రాన ప్రజలు గుడ్డివారు కాదు. నేను అత్యంత ప్రజాదరణతో నా నియోజకవర్గంలో అడుగుపెడితే, అక్కడ ఎంతో మంది ప్రజల మద్దతు నాకు లభిస్తే, ప్రజలు తిరస్కరించిన వ్యక్తికి ఇన్ని వేల ఓట్ల మెజారిటీ ఎలా వస్తుందని ప్రశ్నించడానికి మీకు సిగ్గు లేకపోయినా, నేను ఖండించకపోతే సాక్షి ఛానెల్, దినపత్రిక చూసి, చదివేవారు నిజమని అనుకుంటారేమోనని ఖండిస్తున్నాను. ఆరోజు అన్నీ చానల్స్ లలో నా నియోజకవర్గ పర్యటన వివరాలతో కూడిన విజువల్స్ ను ప్రసారం చేశాయి. సాక్షి ఛానల్ లో కూడా వేసి జగన్మోహన్ రెడ్డికి చూపించండి.

జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు వచ్చినప్పుడు, ఎప్పుడైనా పైసా ఖర్చు పెట్టకుండా ప్రజలు వచ్చిన సందర్భం ఏదైనా ఉందా? అని ప్రశ్నించిన రఘురామకృష్ణం రాజు, డ్వాక్రా మహిళలు, ప్రభుత్వ ఖర్చుతో బస్సుల ఏర్పాటు, జన సమీకరణ కోసం డబ్బులు ఖర్చు చేయడం వంటివి తామేమి చేయలేదన్నారు. 24 గంటల ముందు నియోజకవర్గానికి వస్తున్నానని ప్రకటించగానే ఒక సాధారణ ఎంపీనైన నన్ను ప్రజలు అసాధారణంగా ఆదరించారు. ఒక నియంత పై ప్రాణాలకు తెగించి పోరాడినందుకు ప్రజలిచ్చిన ఆదరణ ఇదని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. నాకు లభించిన ప్రజాధరణ చూసి మీకు మండుతోంది. అందుకే ఈ రకంగా పిచ్చిపిచ్చిగా ఈవియంల మద్దతుతో నెగ్గానని మాట్లాడుతున్నారు. మీకంటూ అంతరాత్మ, మనస్సాక్షి అన్నది ఉంటే ఇలా మాట్లాడరని రఘురామకృష్ణం రాజు అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే ముందు, గతంలో మీరు చేసిన తప్పులను గుర్తు పెట్టుకోండి
రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే ముందు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గతంలో తమ ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులను గుర్తుపెట్టుకోవాలని రఘురామకృష్ణంరాజు హితవు పలికారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని నియోజకవర్గంలోనికి రానివ్వడం లేదని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా ఇదేమి రాజ్యాంగం అని అతిగా చింతించారు. మరుపు అనేది దేవుడు మనిషికి ఇచ్చిన ఒక గొప్ప వరమని మనసు కవి ఆత్రేయ ఎప్పుడో చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఇంత మతిమరుపు ఉన్నదని అనుకోలేదు. జగన్మోహన్ రెడ్డి దేవుడికి ఇంత గొప్ప వరం ఇచ్చారా? అని అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. నాలుగేళ్ల పాటు నాపై దొంగ కేసులన్నీ మోపి నన్ను నియోజకవర్గానికి రానివ్వకుండా జగన్మోహన్ రెడ్డి చేశారన్నారు . చివరకు ప్రధానమంత్రి నా నియోజకవర్గానికి వస్తున్నారని తెలిసుకుని , కార్యక్రమంలో పాల్గొనడానికి రైలు ఎక్కితే, రైలు బోగీని పూర్తిగా తగలబెట్టాలని జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేశారు.

ఒక సిట్టింగ్ ఎంపీ నే నాలుగేళ్ల పాటు నియోజకవర్గంలోకి అడుగుపెట్టనివ్వకుండా చేసి, ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తనకు తానే సుపరిపాలన అందించానని, తమది ఎంతో మనసున్న ప్రభుత్వం అని చెప్పుకుంటూ, చంకలో వేలు పెట్టుకుని చక్కిలిగింతలు పెట్టుకునే మీ ప్రభుత్వ హయాంలో మీరు, నాకు చేసిన అన్యాయాన్ని మీరు మర్చిపోయిన… ప్రజలు మర్చిపోలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి స్థానికంగా ఉన్న గొడవల కారణంగా భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు నియోజకవర్గానికి దూరంగా ఉండమని చెప్పి ఉండవచ్చునన్నారు. తమ పార్టీ కి చెందిన మాజీ ఎమ్మెల్యేను నియోజకవర్గంలోకి రానివ్వడం లేదని ఏడిస్తే ఏడవండి కానీ గతంలో మేము ఎప్పుడూ ఇలా చేయలేదని మాట్లాడితే ప్రజలు హర్షించారన్నారు. మీకు ఈజీగా మర్చిపోయెంత వరాన్ని భగవంతుడు ప్రసాదించినప్పటికీ, ప్రజలకు మాత్రం ఆ వరాన్ని ఇవ్వలేదన్నారు. నియోజకవర్గానికి రానివ్వకుండా నాకు, నువ్వు చేసిన అన్యాయం ప్రజలకు ఇంకా గుర్తుకు ఉందన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు, గతంలో మీ ప్రభుత్వ హయాంలో ఎవరెవరికి ఎటువంటి అన్యాయాన్ని చేశారో గుర్తుపెట్టుకొని మాట్లాడండి.

లేకపోతే గతంలో మేము ఈ తప్పులను చేసి ప్రతిపక్షంలో కూర్చున్నామని, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే, మీరు అటువంటి తప్పులే చేయవద్దని చెప్పాలని హితవు పలికారు. అంతేకానీ మీరు పరిశుద్ధాత్ములైనట్లుగా, మేము అపవిత్రులం అన్నట్లుగా మాట్లాడడం ఏమంత బాగాలేదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తక్షణమే ఈవీఎంలను మేనేజ్ చేసి ఎన్నికల్లో గెలిచామని, గతంలో నియోజకవర్గానికి రానివ్వకుండా ఎవరిని అడ్డుకోలేదన్నట్టుగా ఇచ్చిన స్టేట్మెంట్లను జగన్మోహన్ రెడ్డి విత్ డ్రా చేసుకోవాలని రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తన స్టేట్మెంట్ విత్ డ్రా చేసుకోకపోతే ప్రజలు వీడింతే తేడాగాడు అని అనుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

అచ్యుతాపురం ప్రమాద బాధితులకు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
అచ్యుతాపురం ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లుగా రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. ప్రమాదంలో కుటుంబ పెద్ద కోల్పోయినప్పుడు ఆర్థికంగా ఆదుకోవడం ఎంతో అవసరం. ఎంత ఇచ్చిన కూడా కోల్పోయిన వ్యక్తులను తిరిగి తెచ్చి ఇవ్వలేం. అయినా ఇటువంటి సంఘటన సమయంలో కూడా కొంతమంది రాజకీయంగా మాట్లాడడం బాధనిపిస్తుంది. మృతుల కుటుంబాలకు చేయగలిగిన సహాయం అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు పరిశ్రమల యాజమాన్యం చేయాలి. ఆ బాధ్యత వారిపై ఉంది. ఈ సందర్భంగా సంబంధిత శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన స్వాగతించదగిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఎన్విరాన్మెంట్, సేఫ్టీ ఆడిట్ అన్నది క్రమం తప్పకుండా నిర్వహించాలని మంత్రి పవన్ కళ్యాణ్ ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారని ఆయన అభినందించారు. ఈ నిర్ణయాన్ని పరిశ్రమల యాజమాన్యాలు తూచా తప్పకుండా పాటిస్తాయని ఆశిస్తున్నట్లుగా తెలిపారు.

గ్రామసభల ద్వారానే ఎన్ఆర్జిఎస్ నిధుల ఖర్చుకు ప్రణాళికలు
రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు గ్రామసభలను నిర్వహించి కేంద్ర ప్రభుత్వం ద్వారా పంచాయితీలకు మంజూరయ్యే ఎన్ ఆర్ జి ఎస్ నిధులను ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమని రఘురామకృష్ణం రాజు తెలిపారు. రాష్ట్రంలోని 13 వేల 200 పంచాయితీలలో ఎన్ఆర్జిఎస్ నిధుల ఖర్చు కోసం ప్రణాళికలను రూపొందించడానికి గ్రామ సభలను నిర్వహిస్తున్నారన్నారు.. కేంద్రం ద్వారా ఈ ఏడాది 4500 కోట్ల రూపాయల ఎన్ ఆర్ జి ఎస్ నిధులు మంజూరయ్యే అవకాశం ఉందన్నారు. గత ఐదేళ్లలో ఎప్పుడూ కూడా గ్రామసభల ద్వారా తీర్మానించి ఎన్ఆర్జిఎస్ నిధులను ఖర్చు చేసిన దాఖలాలే లేవని ఆయన గుర్తు చేశారు. ఎన్ఆర్జిఎస్ నిధుల ద్వారా అవసరం లేని బిల్డింగులను నిర్మించారని, ప్రజలకు అవసరం లేని పనులను ఎక్కువగా చేశారని విమర్శించారు.

గ్రామ సభల నిర్వహణ ద్వారా ప్రజలకే ప్రాధాన్యత ఇస్తూ, తమ సమస్యల పరిష్కారం కోసం నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రోత్సహించడం ముదావహమని అన్నారు . 15 ఫైనాన్స్ నుంచి వచ్చిన నిధులను గత ప్రభుత్వం హాం ఫట్ చేసింది.. ప్రస్తుతం ప్రభుత్వంలో హాం ఫట్ అన్న పదానికి తావు లేకుండా, పంచాయితీలకే నేరుగా నిధులను ఇచ్చేస్తున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఫైల్ పై సంతకం చేసిన విషయం తెలిసిందేనని పేర్కొన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుకు వెళుతుందని రఘురామ కృష్ణంరాజు అన్నారు.. చక్కటి ఫలితాలు వచ్చి గ్రామాభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అని రఘురామకృష్ణంరాజు అన్నారు.

పెద్ద పెద్ద పదవులను అనుభవించి… చివరి దశలో చేతిలో చిల్లి గవ్వ లేకుండా ప్రాణాలు విడిచిన ప్రకాశం పంతులు
టంగుటూరి ప్రకాశం పంతులు 153 వ జయంతి వేడుకల సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. రోజురోజుకీ రాజకీయాలలో విలువలు పడిపోతున్న ఈ రోజుల్లో, విలువల కోసమే బ్రతికిన గొప్ప రాజకీయ నాయకుల గురించి మాట్లాడుకుని, వారిని మననం చేసుకోవలసిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ప్రకాశం పంతులు గురించి అడిగితే, ప్రకాశం జిల్లా ఆయన పేరిటనే ఏర్పడిందని మాత్రమే నేటి తరానికి తెలుసునన్నారు. నాకంటే ముందు తరం వారికి ప్రకాశం పంతులు గురించి ఎక్కువగా తెలిసే అవకాశం ఉందన్న ఆయన, ప్రకాశం పంతులు మద్రాస్ ప్రెసిడెన్సీ లో ఏడాది పాటు ప్రధానమంత్రిగా పనిచేశారన్నారు. స్వాతంత్రానికి పూర్వం మద్రాస్ ప్రెసిడెన్సీ అంటే ఒరిస్సాలోని బరంపురం, కర్ణాటకలోని బళ్లారి, రాష్ట్రం మొత్తం కలిపి ఉండేది. అటువంటి మద్రాస్ ప్రెసిడెన్సీకి ఆయన ఏడాది పాటు ప్రధానమంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్షతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఏడాది పాటు కొనసాగారు.

లండన్ లో భారిష్టర్ చదివిన టంగుటూరి ప్రకాశం పంతులు అప్పట్లో అత్యధిక పారితోషికం వసూలు చేసే అడ్వకేట్. అయినా ఆయన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని మూడేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు. రాజకీయాలలోకి వచ్చిన తరువాత పెద్ద పెద్ద పదవులను అనుభవించినప్పటికీ, తన చివరి రోజుల్లో చేతిలో ఒక్క రూపాయి కూడా లేకుండా చనిపోయారు అంటే ఎవరికి నమ్మబుద్ధి కాదన్నారు. అటువంటి వారి జీవిత చరిత్ర చదివితే ఒక ఫాంటసీ లాగా అనిపిస్తోందని, ఇటువంటి మనుషులు కూడా ఉంటారా అనిపిస్తుందన్నారు. అటువంటి మహానుభావుల గురించి తెలుసుకోవాలని ఆయన కోరారు. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ ఎన్నికల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ఈ రోజుల్లో, రాజకీయ నాయకుల పిల్లలు ఎలా ఎత్తుకు ఎదుగుతున్నారో చూసిన తర్వాత ప్రకాశం పంతులు మనవలు, ముని మనవలు చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ, ఎవరి దగ్గర దమ్మిడి ఆస్తి లేకుండా ఉన్నారు. ప్రస్తుతం విలువలు లేని రాజకీయాలలో ఉన్నామని చెప్పక తప్పదు… అటువంటి మహానుభావుడు గురించి తెలుసుకుంటే నైనా రాజకీయాలలో కాస్తో, కూస్తో విలువలు పెరుగుతాయన్న ఆశాభావాన్ని రఘురామకృష్ణం రాజు వ్యక్తం చేశారు.